Sunday, January 27, 2019

నైపుణ్యం

నైపుణ్యం


ఒకానొకచెట్టుమీద తేనెటీగలు గూడు ఏర్పరచుకొన్నాయి. అవి రోజూ ఎంతో కష్టపడి తన తుట్టెలలో వాటికవసరమైన ఆహారాన్ని దాచిపెట్టుకునేవి. ప్రతిసారీ మనుషులు పొగబెట్టి ఆ తేనెటీగలను తరిమి ఆ తేనెని దొంగిలించేవారు. 

ఆ తేనెటీగల కష్టమంతా మనుషులు దోచుకుంటున్న విధానాన్ని చూసి జాలిపడి దేవుడు వాటిని ఏదైనా వరం కోరుకొమ్మని అన్నాడు. 

దానికి సంతోషించిన ఆ తేనెటీగలు దేవుడితో "ఓ దేవా! మాకు మేము కష్టపడిన తేనెని అంతా దోచుకుంటున్నందుకు బాధ లేదు. రూపంలోనూ, తెలివితేటలలోనూ మాకంటే ఎన్నో రెట్లు అధికులైన వారు మా లాంటి చిన్నజీవుల మీద ఆధారపడుతున్నందుకు చాలా బాధగా ఉంది. వారు మానుండి దోచుకుంటున్నది మేము కూడబెట్టిన తేనెనే కాని, మేము సంపాదించుకొన్న నైపుణ్యాన్ని కాదు. మాపట్ల నీవు చూపించిన అభిమానానికి కృతజ్ఞులై ఉంటాము. నీవు ఇచ్చిన జీవితంతో మేము సంతోషంగా ఉన్నాము. కాని, నీవేదైనా చేయదలిస్తే ఎన్నో రెట్లు నైపుణ్యాలుండీ ఏమీ చేయలేకపోతున్న మానవులకి చేయి. ఎన్నో జీవరాసులకి మేలు చేసినట్లవుతుంది. ఇందుకు నీకు రుణపడి ఉంటాము." అని బదులు పలికాయి.

వాటి సమాధానం విన్న దేవుడు అచ్చెరువొందాడు. బ్రతికేది కొంతకాలమైనా, రూపంలో చిన్నదైనా, వాటికున్న ఓర్పుని, వాటి స్వభావాన్ని కష్టపడేతత్త్వాన్ని చూసి నివ్వెరపోయాడు. వాటిని తృప్తిగా ఆశీర్వదించి కనుమరుగయ్యాడు.

నీతి  :
చిన్న జీవులైనా వాటి నుంచి మనం నేర్చుకోవలసిన నీతి ఎంతో ఉన్నది. తేనెటీగలు కష్టపడి పోగుచేసుకొన్న తేనెని మానవులు దోచుకొన్నప్పటికీ అవి బాధపడవు. మళ్లాఅవన్నీ సహనం కోల్పోకుండా ఐకమత్యంతో మరొక చోటుకి చేరి వాటి కర్తవ్యాన్ని అవి నిర్వహిస్తాయి. 

అలాగే, మనం సంపాదించినది ఏదైనా కోల్పోతే దిగులు చెందకూడదు. మనం కోల్పోయామని ఇతరుల కష్టాన్ని దోచుకోవాలని ప్రయత్నించకూడదు. ఇతరులకు హాని కలిగించాలని ఎప్పుడూ ఆలోచించకూడదు. 

ఒకరి కష్టాన్ని మరొకరు దోచుకోగలరేమో కాని, ప్రపంచంలో ఏజీవి నైపుణ్యాన్ని ఎవరూ దోచుకోలేరు, మనం పోయిన దాన్ని గురించి ఆలోచిస్తూ కాలయాపన చేయకుండా ఆ సమయాన్ని మన నైపుణ్యాన్ని మెరుగుపరచుకోవడం కోసం వినియోగిస్తే విజయం మనవెంటే వస్తుంది.


Wednesday, October 31, 2018

జీవితం

జీవితంలో ఎన్నో పరిచయాలు,
కొన్ని మధురానుభూతులు
కొన్ని విషాధ ఛాయలు

నిరంతరం దేనికోసమో అన్వేషణ,దేనికోసమో నిరీక్షణ,
దేనికోసమో వెదుకులాట

ప్రతి క్షణం  నవ్వులపువ్వులు పూయించే పసివారు ఒకప్రక్క,
ఆ మితిమీరిన కోపాలతో కస్సుబుస్సులాడేవారు ఒక ప్రక్క,
ప్రేమాభిమానాలతో ముంచెత్తే వారు ఒక ప్రక్క
నమ్మకద్రోహాలు చేసి ముంచే వారు ఒక ప్రక్క...

మనం చేసిన చిలిపి సరదా అల్లర్లు,
మనకు తగిలిన అనుభవాలు
మనల్ని వెంటాడిన  జ్ఞపకాలు,
మనం వెంటపడి సాధించుకున్న ఆనందాలు.
కన్నులముందే కరిగిపోతున్న కాలం,
ఆ కరిగిన కాలం ఒడిలో ఎదిగిన జీవితం...
రెప్పపాటు జీవితంలో ఎందుకో ఇన్ని అంతర్మధనాలు?
ఎందుకో ఇన్ని ఆటుపాట్లు?

ఎన్నో జీవితాలలో అలుముకున్న చీకటిని మింగిన ఉదయకాంతి,  మనసుపొరల్లో దాగిన చీకట్లని కూడా పారద్రోలి మౌనాన్ని చేదించి  ఏకాంతాన్ని తరిమిగొట్టాలి.

ఈ ఏకాంతసమయాన కలం నుండి కదిలిన మాటలు పెదవిదాటి రావెందుకని......???
మౌనానికి, నిశ్శబ్దానికి కూడా తోడుంటే ఎంత బాగుణ్ణో??!!

:)

నాలోని అణువణువునూ నిలువెల్లా దహించివేస్తూ వెలుగుదివ్వెనవుతున్న... ఆ వెలుగులోనైనా నన్ను గుర్తిస్తావేమోనని.. నా అంతరాత్మ నీకు కనిపిస్తుందేమోనని.. నా ఆశ...
నా ఆశ ఫలించకపోగా చిమ్మచీకటిలో కలిసిపోతానేమోనని  బాధ గా ఉంది.

:)

కబంద హస్తాల నుండి
తేనెపూసిన కత్తులనుండి
మోసపూరిత హృదయాలనుండి
వెన్నుపోటులనుండి
నమ్మకద్రోహుల నుండి
రెండు నాల్కల మాటలనుండి
బంధాలను తుంచేసేవారినుండి
అపార్థాలను సృష్టించేవారినుండి
మనసులు ముక్కలుచేసేవారి నుండి
మాకందరికి విముక్తి కలిగించు...
దేవుడా.....
నన్ను నా దేశాన్ని రక్షించు.....
సమసమాజస్థాపన చేయి.....
మనుష్యజాతినైనా ఒక్కటిగా చేయి.....

🙏🙏🙏🙏🙏🙏

Sunday, June 3, 2018

ఓ మనిషీ మేలుకో....!

ఓ మనిషీ మేలుకో....!

ప్రేమాభిమానాలతో మసలుకో
కులమతాలను, పగలను, ప్రతీకారద్వేషాలను వదులుకో

జీవితం బుద్బుదప్రాయం
గర్భస్థనరకాన్ని జయించగలవేమో.....
మరణాన్ని జయించలేవు....!

అబద్ధపుసాక్ష్యాలు చెప్పగలవేమో కానీ
అంతరాత్మలో
మనస్సాక్షిని జయించలేవు....!

మోసాలతో ధనార్జనచేసి
కోట్లు గడించగలవేమో కానీ
పిడికెడు ప్రేమ సంపాదించలేవు...!

ఆత్మవంచన చేసుకోగలవేమో కానీ ఆప్యాయతానురాగాలు
గెలవలేవు

బంధాలను వదలుకోగలవేమో....
ఋణానుబంధాలను తీర్చుకోలేవు

ఎందుకీ వ్యామోహం
ఎందుకీ వెంపర్లాట
దేనికోసమీ వెదుకులాట

మనిషిని మనిషిగా చూడు
జీవాన్ని ప్రేమతో చూడు
భావోద్వేగాలను జయించిచూడు
ప్రేమతో  మసలి చూడు
సర్వజనహితసాధనకై శ్రమించు
విశ్వశాంతి శ్రేయస్సుకై ప్రాకులాడు
....

సర్వం పరికించిచూడు
సర్వం పరిత్యజించి చూడు

విశ్వం నీకు దాసోహమంటుంది
సమస్తవిశ్వాంతరాళం నీ
 పాదాలచెంత ప్రణమిల్లుతుంది

ఓ మనిషీ అంతరాత్మ ఆశయసాధనకై శ్రమించు
ఆ సాధన నిన్ను ఆకాశసౌధాన నిలబెడుతుంది

ఆ విజయంతో నీవు
విశ్వవిజేతగా అవతరిస్తావు
విశ్వమానవవేదికపై విజయబాగుటా ఎగురవేస్తావు

జీవితం బుద్బుదప్రాయం

ఒంటరిగా వస్తావు
ఒంటరిని చేస్తావు
నిన్ను చేరని జీవి ఉండదు
నిన్ను తలచుకునే జీవి ఉండదు
సంతోషాలను మరపిస్తావు
కన్నీటిని మిగులుస్తావు
నీకై ఎదురుచూసే కన్నులకు అడియాసలను మిగిల్చి
పసిప్రాణాలను బలిగొంటావు
నీమనసెందుకింత కర్కశత్వం?
నీ ఒడిలో ఆనందంగా నిద్రించే కనులుండవా??
నీ రాక కోసం తపించే మనసులుండవా....
అనందంగా తమ జీవితంలోకి నిన్ను ఆహ్వానించే తనువులుండవా....
సృష్టిలో అన్నిటినీ ఆనందంగా ఆహ్వానిస్తాం....
స్వీకరిస్తాం....
ఒక్క నిన్ను తప్ప.....
అన్నిటినీ సంతోషంగా ఆహ్వానించే వాళ్ళె నిన్ను కూడా  సంతోషంగా స్వీకరిస్తే
ఈ కపటప్రేమలు, నాటకాలూ, బాధలు, ఆవేశాలు,  ఆగ్రహజ్వాలలు ఉండవేమో.....
నిన్ను ఆనందంగా ఆహ్వానించే మనసుల  కోసం 
నీ ప్రేమకోసం
ఎదురుచూస్తూ............

Saturday, May 5, 2018

అగ్నిధార


Tuesday, April 24, 2018

వెన్నెల

వెన్నెల

జీవితకాల నేస్తం

ఒక్కరోజు ఉన్నా వంద ఊసులు చెప్పి పోతుంది

మళ్ళీ వస్తానని ధైర్యం చెప్పి 
ఎదురుచూపులోని విరహబాధను 
రుచి చూపిస్తుంది

మనసు లోతులు వెతికి చూస్తుంది

జ్ఞాపకాల తెరలని తెరచి పెడుతుంది

మధురానుభవాలని నెమరువేస్తుంది

బిగికౌగిలిలో ఒదిగిపోతుంది

సాగర సడులను వినిపిస్తుంది

నిశ్శబ్దం విలువ తెలుపుతుంది

మౌనంగా ఎదగమని హితవు చెబుతుంది

పలకరింపులలో తీయని ప్రేమను రుచిచూపిస్తుంది.

జీవితాంతం బాసటగా నిలుస్తానని బాస చేస్తుంది

రేకెత్తే ఆలోచనలను తన పిల్లగాలులతో జో కొట్టి
నిశిరాత్రిలో కమ్మని కలగా లీలగా 
నలుపుతెలుపుల ఇంద్రధనుస్సును 
ఆవిష్కరింపజేస్తుంది