Sunday, January 27, 2019

నైపుణ్యం

నైపుణ్యం


ఒకానొకచెట్టుమీద తేనెటీగలు గూడు ఏర్పరచుకొన్నాయి. అవి రోజూ ఎంతో కష్టపడి తన తుట్టెలలో వాటికవసరమైన ఆహారాన్ని దాచిపెట్టుకునేవి. ప్రతిసారీ మనుషులు పొగబెట్టి ఆ తేనెటీగలను తరిమి ఆ తేనెని దొంగిలించేవారు. 

ఆ తేనెటీగల కష్టమంతా మనుషులు దోచుకుంటున్న విధానాన్ని చూసి జాలిపడి దేవుడు వాటిని ఏదైనా వరం కోరుకొమ్మని అన్నాడు. 

దానికి సంతోషించిన ఆ తేనెటీగలు దేవుడితో "ఓ దేవా! మాకు మేము కష్టపడిన తేనెని అంతా దోచుకుంటున్నందుకు బాధ లేదు. రూపంలోనూ, తెలివితేటలలోనూ మాకంటే ఎన్నో రెట్లు అధికులైన వారు మా లాంటి చిన్నజీవుల మీద ఆధారపడుతున్నందుకు చాలా బాధగా ఉంది. వారు మానుండి దోచుకుంటున్నది మేము కూడబెట్టిన తేనెనే కాని, మేము సంపాదించుకొన్న నైపుణ్యాన్ని కాదు. మాపట్ల నీవు చూపించిన అభిమానానికి కృతజ్ఞులై ఉంటాము. నీవు ఇచ్చిన జీవితంతో మేము సంతోషంగా ఉన్నాము. కాని, నీవేదైనా చేయదలిస్తే ఎన్నో రెట్లు నైపుణ్యాలుండీ ఏమీ చేయలేకపోతున్న మానవులకి చేయి. ఎన్నో జీవరాసులకి మేలు చేసినట్లవుతుంది. ఇందుకు నీకు రుణపడి ఉంటాము." అని బదులు పలికాయి.

వాటి సమాధానం విన్న దేవుడు అచ్చెరువొందాడు. బ్రతికేది కొంతకాలమైనా, రూపంలో చిన్నదైనా, వాటికున్న ఓర్పుని, వాటి స్వభావాన్ని కష్టపడేతత్త్వాన్ని చూసి నివ్వెరపోయాడు. వాటిని తృప్తిగా ఆశీర్వదించి కనుమరుగయ్యాడు.

నీతి  :
చిన్న జీవులైనా వాటి నుంచి మనం నేర్చుకోవలసిన నీతి ఎంతో ఉన్నది. తేనెటీగలు కష్టపడి పోగుచేసుకొన్న తేనెని మానవులు దోచుకొన్నప్పటికీ అవి బాధపడవు. మళ్లాఅవన్నీ సహనం కోల్పోకుండా ఐకమత్యంతో మరొక చోటుకి చేరి వాటి కర్తవ్యాన్ని అవి నిర్వహిస్తాయి. 

అలాగే, మనం సంపాదించినది ఏదైనా కోల్పోతే దిగులు చెందకూడదు. మనం కోల్పోయామని ఇతరుల కష్టాన్ని దోచుకోవాలని ప్రయత్నించకూడదు. ఇతరులకు హాని కలిగించాలని ఎప్పుడూ ఆలోచించకూడదు. 

ఒకరి కష్టాన్ని మరొకరు దోచుకోగలరేమో కాని, ప్రపంచంలో ఏజీవి నైపుణ్యాన్ని ఎవరూ దోచుకోలేరు, మనం పోయిన దాన్ని గురించి ఆలోచిస్తూ కాలయాపన చేయకుండా ఆ సమయాన్ని మన నైపుణ్యాన్ని మెరుగుపరచుకోవడం కోసం వినియోగిస్తే విజయం మనవెంటే వస్తుంది.


0 comments:

Post a Comment