నవలల్లో మనో విశ్లేషణాత్మకత
పరిచయo:
నవలల్లో మనో విశ్లేషణాత్మకత అనేది నవీన యుగములోనే ప్రారంభం అయిందని
చెప్పవచ్చు. క్రీ.శ. 1920-1942 ప్రాంతములోని తెలుగు నవలా వికాసం నందు, క్రీ.శ.1942
నుండి 1960 వరకు మధ్య ప్రాంతం లోని మనో వైజ్ఞానిక యుగము నందు నవలల్లో గల మనో
విశ్లేషణాత్మకత మీద విస్తృత చర్చ జరిగిందని చెప్పవచ్చు.
మనస్తత్వ విశ్లేషణల ద్వారా మాత్రమే మానసిక పరిణతి సాధించబడ్తుందని గ్రహించి
సాహిత్యములో మనో విశ్లేషణాత్మకతని పరిచయము చేశారు. కథకు మనో విజ్ఞానమునకు
ప్రాధాన్యము ఇవ్వడం దీని ముఖ్య ఉద్దేశం. వీటిల్లో మనో విశ్లేషణ ప్రధానముగా
ఉంటుంది. ఒక వ్యక్తి పాత్ర ప్రవర్తించే స్వభావము అతని మనసు ఆలోచించే తీరుమీద
ఆధారపడి ఉంటుంది. ఆ వ్యక్తి జీవితములోని కీలకసమయాలలో అతని మనస్తత్వం ఎలా ఉంది?
అతని నిర్ణయాలను అతను అతని ఇష్టానుసారం అనుసరించినప్పుడు వాటి ఫలితాలు అతనే
అనుభవిస్తాడు. ఒక వ్యక్తి ఇతరులకు సలహాలుగా సూచనలుగా ఎన్నో విషయాలు చెప్తాడు కానీ
తను మాత్రం ఆచరించడు. అలాగే కొందరు ఇతరులలోని తప్పులని ఎత్తిచూపుతారు వారికి
జ్ఞానభోద చెయ్యాలని చూస్తారు కాని వారు మాత్రం వారు చేసే తప్పులని
విశ్లేషించుకోరు. ఈ విషయాలన్నీ మనస్తత్వం ఆధారంగా ఆ వ్యక్తి యొక్క ఆలోచనా సరళిని,
వ్యక్తిత్వాన్ని నమ్మకాలను ఆశ్రయించి ఉంటాయి.
మనస్తత్వం ప్రధానంగా పాత్రల మానసిక సంఘర్షణలు, మనో విశ్లేషణలు, తత్వాలు,
ఆలొచనలను వివరిస్తూ నవలా రచన సాగుతుంది. మనో విశ్లేషణాత్మకంగా రచనలు చేసిన వారిలో
త్రిపురనేని గోపీచంద్, రాచకొండ విశ్వనాధ శాస్త్రి, జి.వి.కిష్ణారావు, బుచ్చిబాబు,
కొడవటి గంటి కుటుంబరావు ముఖ్యులుగా చెప్పవచ్చు.
మనోవిశ్లేషణాత్మకతను ప్రధానంగా చేసుకుని రచన కావించబడ్డ నవలలలోముఖ్యమైనవి
బుచ్చి బాబు – చివరకు మిగిలేది, గోపీచంద్ – అసమర్ధుని జీవయాత్ర, విశ్వనాధ శాస్త్రి
గారి అల్పజీవి, రాజు మనిషి మొదలైన నవలలు ముఖ్యమైన నవలలుగా చెప్పవచ్చు.
ముఖ్యమైన కొన్ని మనో విశ్లేషణాత్మక రచనలు:
కొడవటిగంటి కుటుంబరావుగారు ఆర్ధిక మానసిక సంక్షోభాన్ని మనో విజ్ఞానాన్ని
కథా సంవిధానాన్ని కూడా చూపిస్తూ అనుభవం, చదువు, ఆత్మజన్మ, కొత్త కోడలు, ప్రేమించిన
మనిషి, కొత్త అల్లుడూ మొదలైన నవలలు రచించారు.
బుచ్చిబాబు చివరకు మిగిలేది నవలలో సాంఘిక, మానసిక సంఘర్షణలకు సతమతమౌతూ,
తల్లి మీద నింద తనకి నీడలా వెంటాడుతోందని భాదపడ్తూ ఉన్నటువంటి పాత్రగా దయానిధి
పాత్రని చిత్రించారు. చివరలో అతను చేసినట్టి సాహసలు అతని జీవితగమనంలోని ఒడిదుడుకులను కూడా ఇందులో
వివరిస్తారు. ’చివరకు మిగిలేది’ ఏంటి? అని పాఠకుని ప్రశ్న ముగింపుగా మనకు ఈ నవలలో
కనిపిస్తుంది.
అవ్యక్త మానసిక స్ధితికి ప్రాధాన్యమిస్తూ చేసిన రచన రాచకొండ విశ్వనాధ
శాస్త్రిగారి అల్పజీవి. మధ్య తరగతి గుమాస్తా అయిన సుబ్బయ్య తన జీవితాన్ని
స్ధితిగతులను నిందించుకుంటూ జీవితం గడుపుతుంటాడు. పరిణతి చెందిన వ్యక్తిత్వము
లేనివాడుగా సుబ్బయ్య పాత్ర ఇందులో కన్పిస్తుంది. వ్యక్తిత్వము లేక అతను అల్పజీవి
అయిన విధానాన్ని వివరిస్తూ మానసిక లోతులు ఒక వ్యక్తిలో ఏ పరిధిలో ఉంటాయో
అద్భుతముగా వివరిస్తారు.
త్రిపురనేని గోపీచంద్ అసమర్ధుని జెవయాత్ర నవల అతిముఖ్యమైనది. జీవితంలో
ఎన్ని ఉన్నా సుఖదుఖాలకు జయాపజయాలకు వ్యక్తియొక్క మనస్తత్వమే ప్రధానమని నిరూపించిన
తొలినవలగా దీని గురించి చెప్పుకోవచ్చు. సీతారామారావు పాత్రని ప్రతిభావంతంగా
తీర్చిదిద్దాడు. మెరుపుల మరకలు, పండిత ప్రమేశ్వర శాస్త్రి వీలునామా, పిల్ల తెమ్మెర
నవలలు గోపీచంద్ మనో విశ్లేషణాత్మకత కు నిదర్శనాలు.
ఏకవీర – అసమర్ధుని జీవయాత్ర నవలల పరిచయం:
ఏకవీర పాశ్చాచ్య నాగరికతా వ్యామొహంలో పడి నైతికవిలువలు సంస్కృతీ సంప్రదాయము
మర్చిపోతున్న సమయంలో కొత్త సమాజాన్ని నిర్మింపజేయాలనే ఆశతో నవలా రచన చేసి 60కి
పైగా నవలలను రచించిన వారు విశ్వనాథ సత్యనారాయణ. వీటిల్లో ఉత్తమోత్తమ
స్ధాయినందుకున్న నవల ’ ఏకవీర’. మధురను ఏలిన నాయకరాజుల కాలమునాడు జరిగినట్టి కధగా
మనకు కనిపిస్తుంది.వైదిక ధర్మానికీ, వ్యక్తిగత హృదయ స్పందనకు మధ్య సంఘర్షణ ఇందులోని
కథా బీజము. ప్రేమకీ ధర్మానికీ చెలరేగిన ఘర్షణ ఇందులో తారస్ధాయినందుకుంది.
వీరభూపతి, కుట్టాన్,మీనాక్షి,ఏకవీరలు ఇందులో ప్రధాన పాత్రలు. వీరి ప్రేమ కథలు,
విరహవేదనలు ఇందులో ప్రధాన వస్తువులు.
ఏకవీర ఇతివృత్తం:
సేతుపతి కుట్టాన్, వీరభూఅప్తి చిన్ననాటి నుంచీ ప్రాణ మిత్రులు. అన్ని విద్యలయందు ఆరితేరినవారు. సమౌజ్జీలు. సేతుపతి సైన్యాద్యక్షుడి కొడుకు.
వీరభూపతి సామాన్యుడు. సేతుపతి మీనాక్షి అనే సామాన్య యువతిని ప్రేమిస్తాడు. ఆమె
కూడా ఇతన్ని ప్రేమిస్తుంది. వీరభూపతి ఏకవీర అనే రాజకుమారిని ప్రేమిస్తాడు. ఆమె
కూడా ఇతన్ని ఇతన్ని ప్రేమిస్తుంది. కానీ పరిస్తితులు అంతస్ధుల అంతరాల వల్ల ఒకరి
చెలియని మరొకరు ఒకరికి తెలియకుండా ఒకరు వివాహము చేసుకోవల్సి వస్తుంది. ప్రేమించిన
వారిని వదలలేక వైవాహిక బంధానికి తలొంచలేక పెద్దలనందరినీ ఎదిరించలేక మనస్సుకు
సర్దిచెప్పుకోలేక నలుగురూ చివరకు మనో సంఘర్షణకు గురౌతారు. ఏకవీర పాత్ర ఆత్మార్పణ
చేసుకుంటుంది.
ఏకవీర – మనో విశ్లేషణాత్మకత:
ధృఢ చిత్తం గలవారు వీరాధివీరులు అన్నింటా జయాపజయాలు తప్ప అపజయాలను చూడని
వారు సేతుపతి, వీరభూపతి. అన్నింటా ప్రతిభావంతులు కానీ జీవితగమనంలో ఓడిపోతారు.తమ
మనసును తామే వంచించుకుంతారు. ఏకవీర పాత్ర ధైర్యం గలది దిట్టమైన గుండె గలది
రహస్యాలు వెల్లడించని స్త్రీ ఏకవీర. పేదవనిత సామాన్యురాలైనప్పటికీ ఆత్మాభిమానం,
అద్వితీయ సౌందర్యం ప్రతిభ గల స్త్రీ మీనాక్షి.
ఈ నాలుగు పాత్రలూ ఇన్నింటా ప్రావీణ్యులు ఓటమినెరుగని వారు జీవితగమనంలో
ఎందుకు ఓడిపోయారనేది ప్రధాన ప్రశ్న. వారి వారి మనస్సును చంపుకోలేక పెద్దవారి మాటను
ఎదిరిమ్చలేని వారిగా ఈ నలుగురి పాత్రలూ కనిపిస్తాయి. వీరి తల్లిదండ్రులు తమ
మూర్ఖత్వం కొద్దీ తమ పంతం నెగ్గించుకుంటారు. అంతిమంగా ఫలితం పొందలేకపోతారు.
ఆత్మవంచన చేసుకులేని, మోసం చెయ్యలేని పాత్రలుగా నలుగురి పాత్రలనూ గొప్పగా
విశ్వనాధగారు తీర్చిదిద్దారు. చదువుకున్న వారు, సకలవిద్యాపారంగతులైనప్పటికీ మనసు
మాటవినలేక, పెద్దలని ఎదిరించలేక జీవనగమనములో ప్రయాణం సాగించలేక ఆత్మవంచన
చేసుకుంటారు. విచక్షణ ఆలోచనలను కోల్పోయిన పాత్రలుగా వీరి పాత్రలు కనిపిస్తాయి.
ఏకవీర పాత్ర అన్ని ఆటుపోట్లనూ ఎదుర్కోలేక రాజీ పడలేక ప్రియుడికీ దూరమై భర్తకూ
దూరమై ఎవ్వరి ప్రేమానురాగాలు పొందకుండా మరణిస్తుంది. చివరిలో ఏకాకిగా మిగిలిన
అనుభూతి కలుగుతుంది. సేతుపతి, ఏకవీర, భూపతి, మీనాక్షిల మానసిక సంఘర్షణలు, మనస్సులో
చెలరేగే ఆలోచనలు, సంక్షోభాలు, వ్యక్తిత్వనిరూపణలు మొదలైనవి పాత్రోచితముగా
సందర్భోచితముగా అద్భుతంగా చూపారు.
గోపీచంద్ – అసమర్ధుని జీవయాత్ర:
జీవితములో ఎన్ని ఉన్నా సుఖానికి విజయానికి వ్యక్తి మనస్తత్వమే అన్నిటికంటే
ముఖ్యము అని నిరూపించిన తొలి నవల ’ అసమర్ధుని జెవయాత్ర. జీవితములో అనేక సమస్యలకు
లోనైన వ్యక్తి జీవితమెందుకు అను మీమాంస ఈ నవల. సీతారామారావు పాత్ర ద్వారా సగటు
మనిషి జీవితము ఎన్ని మానసిక సంఘర్షణలకు లోనవుతుందో ఇందులో గోపీచంద్ వివరీంచారు.
సీతారామారావు పాత్ర అపరదానకర్ణుడిగా, మంచి వ్యక్తిత్వము ఉన్న వాడిగా నవల మొదట్లో
కనిపిస్తుంది. తర్వాత క్రమక్రమముగా అతని పాత్రతీరు ఉచ్చస్ధితికి
కాకుండా నీచస్ధితికి చేరుకోవడాన్ని మనము గమనించావచ్చు. అతని పాత్ర అతని
వ్యక్తిత్వము ఆలోచనలు ఆశయాలు అన్నీ కాలగర్భమునందు మట్టిలో కల్సిపోయాయి. పాఠకుడు
ఇంత అద్భుతంగా ఆలోచించే వ్యక్తి ఇంత మంచి వ్యక్తి నిజాయితీగా దర్మబద్ధంగా ఆలోచించే
వ్యక్తి చివరికి ఎంత గొప్పవాడౌతాడో ఎంతమంది చేత ఆరాధింపబడుతాడో అని ఊహిస్తాడు.
కానీ ముగింపు దానికి పూర్తి విరుద్ధముగా ఉంటుంది ఒక మనస్సు చెపినట్లు వ్యక్తిత్వము నడవడిక తీరు తెన్నులు అనేవి జీవితములో చోటుచేసుకుంటాయి.
ఆత్మవంచన చేసుకుని ధర్మ విరుద్ధంగా సత్యానికి వ్యతిరేకముగా పనులు చేసినప్పుడు
ఎలాంటి ఫలితారు అనుభవించవలసి వస్తుందో ఎన్ని కష్టాలు పడాల్సి వస్తుందో జీవితము ఎంత
నీచస్ధితికి చేరుకుంటుందో అన్న దానికి నిలువెత్తు సాక్ష్యంగా మనకి సీతారామారావు
పాత్ర చిత్రణ, మనస్తత్వము కనిపిస్తుంది.
ధర్మ మార్గములో పేరు ప్రతిష్టలు సాధించి వంశ ప్రతిష్టను నిలబెట్టిన వాడు
సీతారామరావు అయినప్పటికీ మనస్సు ఆలోచనలు పరి పరి విధాల పెడదారి పడుతున్నా వాటిని
అదుపులో ఉంచుకోలేక ఆలోచనలకు తలవంచి జీవితాన్ని కోల్పోయిన పాత్ర ఇతనిది. మనం
జీవితంలో ఏమేమి చేయాలో ఏ విధంగా నడచుకోవాలో అన్న విషయాలన్నిటికీ సీతారామారావు
మనస్తత్వము నిలువెత్తు సాక్ష్యముగా పరిగణించవచ్చు. ఈ ప్రపంచములో నిజముగా సుఖప్డేది
సంతోష పడేది అజ్ఞానే అని భావిస్తాడు. ఆడవాళ్ళు హీనులని భావిస్తాడు. అతిచిన్న
విషయాల గూర్చి అతిగా ఆలోచన చెయ్యడం కోర్కెలకు అతి తీరకపోవడానికి గల కారణాలు,
వాటివల్ల పడుతున్న బాధలకు కారణాలు అని భావించి ఆలోచనలు చెయ్యడం మానేస్తాడు. తనని
తాను అతిగా కష్టపెట్టుకుని భార్యా బిడ్డలను అనవసరంగా తిడుతూ వారి ఆప్యాయతానురాగాలకు
ప్రేమకు దూరమౌతాడు. నిశితముగా దేని గురించి ఆలోచించడు. ప్రయత్నించకుండానే వచ్చి
పడాలని ప్రయత్నిమ్చడము గొప్ప కాదని భావించి దాన్ని ఆచరణలో పెడతాడు. శ్మశానానికి చేరుకుని ఆత్మాన్వేషణ చేసుకుంటాడు.
ఎదిగిన కూతురు సంపాదించి తెచ్చి కుటుంబాన్ని పోషిస్తూ కొడుకుని చదివిస్తూ ఉంటుంది.
అది చూసి కూడా తానుసంపాదించడం మొదలు పెట్టడు.కొడుకు పెళ్ళి చేసుకుని
సంపాదనాపరుడౌతాడు. భార్య ఇందిర పిల్లల బాగోగులు చూసుకుంటూ కాలం వెళ్లదీస్తుంది.
వాళ్ళని చూస్తూ వాళ్ళని సంతోషపెట్టలేకపోయానని బాధపడ్తూ చివరికి చనిపోతాడు.
ముగింపు:
ఈ పాత్రలన్నిటి ద్వారా మనకు అనేక విషయాలు తెలుస్తాయి. మానవులు చేసే పనులు
అన్నిటికీ మనసే ప్రధానము, అది పరిపరి విధాల ఆలోచిస్తుంది. మనస్సు చెప్పిన దాని
ప్రకారమే పాత్ర తీరు, నడవడిక ఆలోచనలు నడుచు కుంటాయి. బుద్ధి ఒకటి చెప్తుంది, మనసు
ఒకటి చెప్తుంది, నడవడిక మరొకటి చెప్తుంది. బుద్ధి, మనస్సు , నడవడిక అన్నీ మన
నియంత్రణలోనే ఉంటాయి. మంచి చెడ్డలను విడదీసుకుని మానవత్వానికి ప్రాధాన్యము
కల్పిస్తూ ధర్మ న్యాయ నీతిబద్ధముగా ఆలోచిస్తూ, సత్యానికి ఎక్కువ ప్రాధాన్యము ఇస్తూ
ఉంటే మన జీవితము పూలబాటలా సాగుతుంది. వీటన్నిటినీ కూడా ఆచరణలో ఎట్టడానికి మనో
నియంత్రణ అతి ముఖ్యము. మనస్తత్వ విశ్లేషణల ద్వారా మాత్రమే మనో పరిణతి
సాధించబడ్తుందని గ్రహించి సాహిత్యములో మనో విశ్లేషణాత్మకతని పరిచయము చేశారు. దీని
ద్వారా ఎట్లా జీవితము మొదలు పెట్టిన వారైనా ఎంత గొప్పవారైనా మనసు అదుపులో
ఉంచుకోనట్లైతే ఎట్లా మారగలరో మనకు నవలలలో పాత్రల ద్వారా రచయితలు నిరూపించారు. ఈ
నవలలలో పాత్రలు అన్నీ మనకు మార్గదర్శకాలు. వీటిలో నిజానిజాలను గ్రహించి మన
జీవితాల్లో అవి జరగకుండా చూసుకుంటూ, వాటిని నిరంతరము గుర్తు చేసుకుంటూ ఉండాలి.
ఆత్మస్థైర్యాన్ని, మనోనిగ్రహాన్ని అలవరుచుకోవాలి. మానసిక విశ్లేషణచేసుకోవాలి. వాటిని జ్ఞప్తికి తెచ్చుకుంటూ జీవనము కొనసాగిస్తే మన జీవితము ఆనందమయము
అవుతుంది.
0 comments:
Post a Comment