శుక్లాంబర ధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
అగజానన పద్మార్కం గజానన మహర్నిశం
అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నం కురు మే దేవ సర్వ కార్యేషు సర్వద
మొదటగా వినాయకప్రార్థన చేసిన తరువాత మనం ఏ కార్యం మొదలుపెట్టినా అది నిర్విఘ్నంగా కొనసాగుతుందని లోకోక్తి. నాకు ఊహతెలిసిన తరువాత నేను తెలుసుకున్న తొలి పండుగ వినాయక చవితి. భాద్రపద శుద్ధ చతుర్ధి నాడు పొద్దున్నే లేచి కొత్తబట్టలు వేసుకుని చెట్ల దగ్గరకి వెళ్ళి పూజకు అవసరమైన పత్రిని తీసుకు రావడం, విగ్రహాన్ని తయారు చేయడం, వాటితో పూజ చేయడం, పుస్తకాలకు పసుపు పెట్టడం, ముఖ్యంగా ఉండ్రాళ్ళు పంచిపెట్టడం వంటి ఈ కార్యక్రమాలు నాకు భలే నచ్చేవి. ఒకసారి వినాయక చవితికి విగ్రహాన్ని చేస్తున్నప్పుడు నాకు ఒక సందేహం కలిగింది.
వినాయకుడు ఇంతగొప్పవాడు కదా! మరి ఈయనకి ఇటువంటి దేహం ఎందుకు వచ్చిందా అని..?! మరి ఆయన దేవుడు కదా.. మన కోరికలన్నిటినీ తీరుస్తాడంటారు కదా మరి అంతగొప్పవాడైన ఆయన దేహం ఇంత వికృతంగా ఎందుకుందా అని నాకు సందేహం కలిగింది. ఆయన ఎందుకు అందంగా లేడని బాధ కలిగింది. దేవుళ్ళందరిలోకి అత్యంత అందగాడు, తెలివి తేటలు గలవాడు, మేధోశాలి ఈయనే అన్న విషయం చాలాకాలం తర్వాత నాకు బోధపడింది.
వినాయకవ్రత కథ తెలుసుకున్నప్పుడు ఆ కథ నిజం కాదేమో కల్పించి చెప్పినదేమో అనిపించింది. ఒకసారి నేను అప్పుడే పుట్టిన ఒక పిల్లవాడిని చూశాను. ఆ పిల్లవాడు కూడా కొంత వినాయకుని పోలికలతో ఉన్నాడు. వికృతంగా ఉన్నది మొహమంతా. కొంతమంది ఆ పిల్లవాడిని అసహ్యించుకోసాగారు. నాకా పిల్లవాని మొహంలో వినాయకుడు కనిపించాడు. అప్పుడు నాకు, ఇంతచిన్నవయసులోనే ఈ పిల్లవాడు ఇన్ని అవమానాలు పొందుతుంటే, అంత కాలం ఆ వినాయకులవారు ఇంకెన్ని అవమానాలు పొందారో అనిపించింది. అవన్నీ తట్టుకుని కూడా ఎంత గుండె నిబ్బరంతో ఉన్నారో అనిపించింది. ఇంతటి ఆకారంతో ఉండి ఆ స్వామివారు ఇన్ని విజయాలు సాధిస్తే అన్నీ సక్రమంగా ఉన్న మానవులు ఇంకెన్ని విజయాలు సాధించగలరో అనిపించింది.
వినాయకుడు లోకంలోని దేవతాగణములకు అధిపతి గా ఖ్యాతినొందాడు. విఘ్నాలను తొలగించి తలపెట్టిన కార్యాలను నిర్విఘ్నంగా పూర్తిచేయించేవాడు. విజయానికీ, చదువులకూ, జ్ఞానానికీ మార్గదర్శిగా నిలుచువాడు. వినాయకుని భారీ కాయం, ఉదరం సమస్త జగత్తుకు ప్రతీక. ఆయన నయనాలు, శిరస్సు మేధోశక్తిని చిహ్నాలు. ఆయన వక్రతుండము’ "ఓం"కారనాదానికి మూలముగా చెప్పేవారట. ఉదరబంధనంగా విలసిల్లు నాగబంధనము శక్తి, సామర్ధ్యాలకు ప్రతీక. ఆయన ఆయుధాలు ఆయన ఆలోచనలు అన్నీ మన బుద్ధి మనసులకు సన్మార్గబోధన చేసే సాధనాలు. వ్యాసభగవానుడు భారతరచనకు సంకల్పించినపుడు వినాయకులవారు వారి దంతాన్ని విరిచి కలంగా ఇచ్చారని ప్రతీతి. గణాధ్యక్షునిగా ప్రసిద్ధిచెందినవారు. దేవతల చేత కూడా ప్రధమపూజలు అందుకునేవారు. తాండవనృత్యకళాకారుడు కూడా.
ఇన్నిరకాలైన ప్రఖ్యాతులు గణేశుని సొంతం. ఈశరీరంతో ఇంత పేరుప్రఖ్యాతులు సాధించిన గణేశుని చూసినతరువాత ఆయనను గురించి తెలుసుకున్న తరువాత ఆయనపై భక్తి పెరిగింది. వినాయకచవితినాడు మనం గణేశుని తలుచుకుని ఏదైనా కార్యసాధనకు పూనుకుంటే ఆకార్యం నిర్విఘ్నంగా కొనసాగుతుందని లోకోక్తి. ఇన్ని విషయాలు తెలుసుకున్న తరువాత నాకు ఒక ఆలోచన కలిగింది. మనం దేవతలను, దేవుళ్ళను చూసి వారి కథలను చదివి తెలుసుకోవలసిన విషయాలు అనేకం ఉన్నాయేమో అనిపించింది. మనకి అనేకమంది ఈ ప్రార్ధన ఇన్ని సార్లు చదువు అంటారు కానీ ఎందుకో చెప్పరు. అది అన్ని సార్లు చదివితే ఒక్కసారైనా అది మన మస్తిష్కాన్ని తాకుతుందేమో అని అన్నిసార్లు చెప్పారేమో అన్నది నా అభిప్రాయం. మనం దేవతలను గూర్చి తెలుసుకుని వారి కథలను చదివి, వారి వ్యక్తిత్వము గురించి తెలుసుకుని స్పూర్తి పొందాలి కానీ వారిని కోరికలు కోరరాదేమో అనిపించింది. దేవతలుగా కీర్తింపబడినవారందరూ వారివారి విషయాలలో ప్రావీణ్యులు. ఒక్కవినాయకుల విషయంలోనే మనకు ఇన్ని విషయాలు తెలిస్తే ఇంక తక్కిన దేవుళ్ళను గురించి తెలుసుకుంటే ఇంకెన్ని విషయాలు అవగతమవుతాయో అనిపించింది. మనం దేవుళ్ళను కోరికలు తీర్చమని కాక వారి జ్ఞానానికి, వారు ఈ రోజు ఈ స్థితిలో ఉండటానికి గల కారణాల్ని తెలుసుకుని వాటి సాధనకు పూనుకుంటే, వారి వ్యక్తిత్వ సాధనే మన ధ్యేయంగా మార్చుకుంటే మనం ఇంకా ఉన్నతస్థితిని సాధించడంతో పాటు దేవుళ్ళ అనుగ్రహంతో పాటుగా మోక్షాన్ని సాధించగలమేమో అనిపించింది.
ఆవినాయకులవారు మీకందరికీ విజయాలకీ, విద్యలకూ, జ్ఞానానికీ మార్గదర్శిగా నిలవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
అందరికీ వినాయకచవితి శుభాకాంక్షలు.
గమనిక. ఎవరి మనోభావాలను అయినా దెబ్బతీసి ఉంటే మన్నించమని ప్రార్ధన.
0 comments:
Post a Comment