Sunday, June 3, 2018

ఓ మనిషీ మేలుకో....!

ఓ మనిషీ మేలుకో....!

ప్రేమాభిమానాలతో మసలుకో
కులమతాలను, పగలను, ప్రతీకారద్వేషాలను వదులుకో

జీవితం బుద్బుదప్రాయం
గర్భస్థనరకాన్ని జయించగలవేమో.....
మరణాన్ని జయించలేవు....!

అబద్ధపుసాక్ష్యాలు చెప్పగలవేమో కానీ
అంతరాత్మలో
మనస్సాక్షిని జయించలేవు....!

మోసాలతో ధనార్జనచేసి
కోట్లు గడించగలవేమో కానీ
పిడికెడు ప్రేమ సంపాదించలేవు...!

ఆత్మవంచన చేసుకోగలవేమో కానీ ఆప్యాయతానురాగాలు
గెలవలేవు

బంధాలను వదలుకోగలవేమో....
ఋణానుబంధాలను తీర్చుకోలేవు

ఎందుకీ వ్యామోహం
ఎందుకీ వెంపర్లాట
దేనికోసమీ వెదుకులాట

మనిషిని మనిషిగా చూడు
జీవాన్ని ప్రేమతో చూడు
భావోద్వేగాలను జయించిచూడు
ప్రేమతో  మసలి చూడు
సర్వజనహితసాధనకై శ్రమించు
విశ్వశాంతి శ్రేయస్సుకై ప్రాకులాడు
....

సర్వం పరికించిచూడు
సర్వం పరిత్యజించి చూడు

విశ్వం నీకు దాసోహమంటుంది
సమస్తవిశ్వాంతరాళం నీ
 పాదాలచెంత ప్రణమిల్లుతుంది

ఓ మనిషీ అంతరాత్మ ఆశయసాధనకై శ్రమించు
ఆ సాధన నిన్ను ఆకాశసౌధాన నిలబెడుతుంది

ఆ విజయంతో నీవు
విశ్వవిజేతగా అవతరిస్తావు
విశ్వమానవవేదికపై విజయబాగుటా ఎగురవేస్తావు

జీవితం బుద్బుదప్రాయం

ఒంటరిగా వస్తావు
ఒంటరిని చేస్తావు
నిన్ను చేరని జీవి ఉండదు
నిన్ను తలచుకునే జీవి ఉండదు
సంతోషాలను మరపిస్తావు
కన్నీటిని మిగులుస్తావు
నీకై ఎదురుచూసే కన్నులకు అడియాసలను మిగిల్చి
పసిప్రాణాలను బలిగొంటావు
నీమనసెందుకింత కర్కశత్వం?
నీ ఒడిలో ఆనందంగా నిద్రించే కనులుండవా??
నీ రాక కోసం తపించే మనసులుండవా....
అనందంగా తమ జీవితంలోకి నిన్ను ఆహ్వానించే తనువులుండవా....
సృష్టిలో అన్నిటినీ ఆనందంగా ఆహ్వానిస్తాం....
స్వీకరిస్తాం....
ఒక్క నిన్ను తప్ప.....
అన్నిటినీ సంతోషంగా ఆహ్వానించే వాళ్ళె నిన్ను కూడా  సంతోషంగా స్వీకరిస్తే
ఈ కపటప్రేమలు, నాటకాలూ, బాధలు, ఆవేశాలు,  ఆగ్రహజ్వాలలు ఉండవేమో.....
నిన్ను ఆనందంగా ఆహ్వానించే మనసుల  కోసం 
నీ ప్రేమకోసం
ఎదురుచూస్తూ............