వాక్కు అంటే అగ్ని..! కొంచెం జాగ్రత్త..!
--> వాక్కు అనేది అగ్ని. ఆ వాగ్బాణాలు మన నోటి
నుండి వెలువడినప్పుడు అవి ఎదుటివారికి వెచ్చదనాన్ని ఇవ్వాలి గానీ..! ఎదుటివారి మనసును
నొప్పించకూడదు. ఆ వెచ్చదనాన్ని అందించే శక్తి మన వాక్కుకు లేనప్పుడు దానిని ఎదుటివారిపై
ప్రయోగించకపోవడమే ఉత్తమం. "తనకోపమె తన శత్రువు తనశాంతమె తనకు రక్ష" అన్నట్టు
మనకి కోపం అనిపిస్తే మనము మౌనంగా ఉండటమే మంచిది.
--> మౌనం యొక్క
శక్తి ఎంతటిదో చెప్పలేము. దానికి కొలమానాలు లేవు. బ్రహ్మానందం అని చెప్పబడేది ఈ పరిపూర్ణ
మౌనమే. ఈ శక్తికి అసాధ్యమన్నదేదీ లేదు. మౌనం అన్నదే వాక్కు. మనవాటి లాగా అనేక వాక్కుల
సమూహం కాదది. అది ఒక్కటే వాక్కు.
--> మౌనం అఖండ
వాక్కు.
--> వాక్కు - భాషావిశేషాలు
వాక్కు – పరా,
పశ్యన్తి, మధ్యమ, వైఖరి అని నాలుగు విధాలు. ఈ వాక్కు ఎలా పుడుతుందో వ్యాకరణం చెబుతుంది.
ఈ వాక్కు వెలువడిన తర్వాత అది ’శబ్దం’గా పరిగణిస్తాం. ప్రతి శబ్దానికి నిర్దుష్టంగా
ఒక అర్థం ఉంటుంది. అలా నిర్దుష్టమైన అర్థం కలిగిన శబ్దాన్ని ’వాచకం’లేదా ’అభిద’ అంటారు.
ఆ శబ్దం తాలూకు అర్థాన్ని ’వాచ్యం’ అంటారు.
--> చెడువాక్కులు
నాలుగువిధాలుగా ఉంటాయి.
--> పారుష్యం అనగా
కఠినంగా మాట్లాడడం. కష్టం కలిగించే విధంగా మాట్లాడితే కష్టాలు, సమస్యలే కాక మిత్రులు
కూడా శత్రువులు అవుతారు. అందువలన అశాంతి, దుఃఖం కలుగుతుంది. ఇతరులు వారితో మాట్లాడేందుకు
సంకోచిస్తారు**.
--> అనృతం అనగా
అసత్యం చెప్పడం. దీనివల్ల ఆత్మ, మనస్సు కలుషితమౌతాయి. సత్యం దేవతల వ్రతం అని, అసత్యం
చెప్పడం అసురుల స్వభావమని వేదవిదులు అంటున్నారు. అసత్యవాదులు జీవించినా మరణించిన వారితో
సమానమని వేదోక్తి.
--> పైశున్యం అనగా
చాడీలు చెప్పడం. దీనివలన కుటుంబాలలో కలహాలు, సన్నిహితులతో విరోధాలు ఏర్పడతాయి. పరస్పరం
అసూయ, అసహనం ఏర్పడతాయి ఇతరుల నుండి అవమానాల్ని, అవహేళనల్ని పొందాల్సి ఉంటుంది. వీరు
సాంఘిక జీవనం కోల్పోతారు.
--> అసందర్భ ప్రలాపం
: పరమాత్మ ప్రసాదించిన వాక్కును ఆచితూచి వినియోగించాలి. అనవసరంగా, అసందర్భంగా వ్యర్ధంగా
మాట్లాడకూడదు. ఇడతెగకుండ మాట్లాడుతుంటే ఇతరులకు చిరాకుపెడుతుంది.
--> సత్యం బ్రూయాత్
ప్రియం బ్రూయాత్
న బ్రూయాత్
సత్య మప్రియం
ప్రియం చ నానృతం
బ్రూయాత్
ఏష ధర్మ స్సనాతన:!!
(మనుస్మృతి)
భావం. సత్యాన్నే పలుకు,
ప్రియాన్నే మాట్లాడు, సత్యమైనా అప్రియాన్నిపలక్కుఇదే సనాతన ధర్మం అని శ్లోక తాత్పర్యం.
ఇది చెప్పేవాడికి చెప్పే లక్షణ శ్లోకంలా కనిపిస్తుంది.కానీ అడిగే వాడెలాంటి విషయం వింటానికి
అడగాలో,ఏది వినాలో చెప్పే చమత్కారం కూడా యిందులో వుంది. సత్యాన్నేవిను, ప్రియమైన దాన్నే
విను.సత్యమైనా అప్రియంగా వుంటే వినకు.అలాగే ప్రియంగా వుందని అసత్యాన్ని వినకు.అలాంటి
లక్షణాలతో చెప్పేవాడు, వినేవాడూ వున్నప్పుడు ఆ చెప్పిన విషయం హృదయానికి హత్తుకుని ఎల్ల
కాలం గుర్తుంటుంది. అనగా ఇతరులకు ప్రియం కానిది అది సత్యమైనా మనం చెప్పకూడదు. అందులో
కాఠిన్యముండడమే కారణం. అలాగే జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడకపోతే అది సత్యమైనా తగవులాటకు
కారణమవుతుంది. అందుకే నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ అన్నారు.
అటువంటివిషయాల జోలికి పోకపోవడం ఉత్తమమేమో…!
--> వాక్కు గురించి
వేమన పలికిన మాటలు
--> వాక్కువలన
గలుగు పరమగు మోక్షంబు
వాక్కువలన గలుగు
వరలు ఘనత
వాక్కువలన గలుగు
నెక్కుడైశ్వర్యంబు
విశ్వదాభిరామ
వినురవేమ!
భావం. మోక్షం, గౌరవం, ఐశ్వర్యం అన్నీ మాటలను బట్టే లభిస్తాయి. కనుక తగిన విధంగా మాట్లాడడం నేర్చుకోవాలి.
భావం. మోక్షం, గౌరవం, ఐశ్వర్యం అన్నీ మాటలను బట్టే లభిస్తాయి. కనుక తగిన విధంగా మాట్లాడడం నేర్చుకోవాలి.
--> వాక్కు శుద్ధి లేనివాడు చండాలుడు
ప్రేమ శుద్ధి
లేక పెట్టు టెట్లు?
నొసలు భక్తుడైన
నోరు తోడేలయా!
విశ్వదాభిరామ
వినురవేమ!
భావం. వాక్కుశుద్ధిలేనివాడే చండాలుడు. అతని మాటల్లో
మంచితనం ఉండదు. అతని నొసటన భక్తి చిహ్నాలు ఉంటే ఉండొచ్చు గాని నోటికి మాత్రం క్రూరమృగాల
లక్షణాలే ఉంటాయి అంటున్నాడు వేమన. దేనికైనా త్రికరణ శుద్ధి ముఖ్యం అని సారాంశం.
మహాభారతంలోని
ఆదిపర్వమునందలి చతుర్థాశ్వాసంలో వాక్కు, సత్యవాక్కుల గురించిన ప్రస్తావన వస్తుంది. ఎటువంటి మాటలు మాట్లాడాలి?!
వాక్కు అంటే ఏంటి? అన్న అనేకప్రశ్నలకి సమాధానాలు ఈ సందర్భంలో లభిస్తాయి.
చ. నుతజల పూరితంబు
లగు నూతులు నూఱిటికంటె సూనృత
వ్రత యొక బావి
మేలు మఱి బావులు నూఱిటికంటె నొక్క స
త్క్రతు వది
మేలు తత్క్రతుశతంబునకంటె సుతుండు మేలు త
త్సుత శతకంబుకంటె
నొక సూనృతవాక్యము మేలు సూడఁగన్.
భావం. తియ్యటి నీటితో
నిండివున్న నూఱు నూతులకంటె ఒక దిగుడుబావి మేలు, అట్టి బావులు నూఱిటికంటె ఒక సత్క్రతువు
మేలు, అట్టి నూఱు క్రతువులకంటె ఒక కుమారుడు మేలు, అట్టి నూర్గురు కుమారులకంటె కూడా,
ఓ సూనృతవ్రతుడ వైన రాజా ! ఒక సత్యమైన మాట మేలయ్యా. అని అంటూ ఇంకా సత్యాన్నిగురించిన
గొప్పదనాన్ని ఇలా వర్ణిస్తుంది.
క. వెలయంగ నశ్వమేధం,
బులు వేయును నొక్క సత్యమును నిరుగడలం
దుల నిడి తూఁపఁగ
సత్యము, వలనన ములు సూపు గౌరవంబున పేర్మిన్.
భావం. వెయ్యి అశ్వమేధ
యాగాల ఫలాన్నిఒకవేపు, సత్యవాక్యాన్ని ఇంకోవేపు త్రాసులో ఉంచి తూస్తే త్రాసు యొక్క ముల్లు
సత్యం వైపే మొగ్గును చూపిస్తుంది సత్యము యొక్క భారాతిశయము చేత.
తే. సర్వతీర్థాభిగమనంబు
సర్వ వేద, సమధిగమము సత్యంబుతో సరియుఁ గావు
నెఱుఁగు మెల్ల
ధర్మంబుల కెందుఁ బెద్ద, యండ్రు సత్యంబు ధర్మజ్ఞు లైన వారు.
భావం. అన్ని తీర్థాలను
సేవించగా వచ్చే ఫలితం, సర్వవేదాల్ని పొందుట కూడా సత్యముతో సరిగావు. అన్ని ధర్మాలలోకెల్లా
సత్యమే పెద్ద అని ధర్మజ్ఞులైనవారు చెప్తారు, తెలుసుకో. మోక్షం, గౌరవం, ఐశ్వర్యం
అన్నీ మాటలను బట్టే లభిస్తాయి. కనుక తగిన విధంగా మాట్లాడడం నేర్చుకోవాలి.
వాక్కు అనేది
బాణం వంటిది. వాస్తవానికి మనుష్యుల వచనాలు, పదాలు, మాటలు ఎదుటివారిని తాకుతాయి. వారు
పలికిన పలుకులను బట్టి ఆ వాక్కు యొక్క ఫలితాలు కూడా తిరిగి వారినే చేరతాయి. ఆ ఫలితం
మంచిదైతే గౌరవాభిమానాలు లభిస్తాయి. చెడ్డవైతే ఛీత్కారాలు లభిస్తాయి. కనుక వాగ్బాణాలను
వదిలేముందు ఒకటికి వందసార్లు సరిచూసుకుంటే మంచిది.
ఒకవేళ పొరపాటుగా కొన్ని అనుచిత వాక్యాలు
ప్రయోగించినట్టయితే, వారు పశ్చాత్తాపం చెంది
క్షమించమని అడిగేందుకు సిద్ధపడతారు. అంటే మనుష్యులు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే
మనం మాట్లాడే మాటలతో సమాజంలో ఒక సంచలనం సృష్టించవచ్చు. లేదా ప్రజలను సంఘటితం చేయవచ్చు,
వ్యవస్థను ఆనందింప చేయగలం అన్న విషయాన్ని. కొందరు వ్యక్తులు సమయం, సందర్భం స్థితి స్థానాన్ని
దృష్టిలో ఉంచుకోకుండా మాట్లాడుతూ ఉంటారు. దీనివల్ల ముందడుగు వేయడం మాట అటుంచి వెనకడుగు
మాత్రం ఖాయం. వ్యర్థ ప్రసంగాల ద్వారా ఇతరులతో సంబంధాలను తెంచుకోవడం మంచిది కాదు.
--> మనుష్యుల మాటల
ద్వారా అతని స్వభావం సంస్కారం తెలుస్తుంది. జ్ఞానవంతుడు అయిన మనిషి తన మాటలను అదుపులో
పెట్టుకుంటాడు.
--> ఆంగ్లభాషలో
ఒక సూక్తి ఉంది. “Let us agree to disagree”' అంటే ఒక విషయంపట్ల అనంగీకారమును తెలిపే
ముందు అంగీకారం తెలియబరచు.. ఒక విషయంలోని తప్పును చెప్పే ముందు ముందు ఆ విషయాన్ని ఒప్పు
అని ఒప్పుకుని ఆ తరువాత అది ఎందుకు తప్పో తెలియబరిచే ప్రయత్నం చేస్తే ఎదుటివారి మనసును
నొప్పించకుండా విషయమును సానుకూలంగా పరిష్కరించడం సులభం అవుతుంది.
--> వాక్కు అంటే
అగ్ని..! కొంచెం జాగ్రత్త..!
వాక్కుకు అధిదేవత
సరస్వతి అందుకే ఆవిడకి వాగ్దేవి అని పేరు. ఆ వాక్కును మనం దుర్వినియోగం చేస్తే, ఎదుటి
వారిని చెడగొట్టి వారిని మన స్వార్థ పూరితమైన మన కోర్కెలు తీర్చుకోవడానికి వాడుకోవడానికి
ప్రయత్నిస్తే, ఆవిడ మొదట మన అంతరాత్మలో బావనా రూపంలో మన ఆలోచనల్లో ఒక ఆలోచనై, వచ్చి
నిలిచి, మనల్ని రహస్యంగా హెచ్చరిస్తుంది. మనం వినకుండా మళ్ళీ అవే పనులు చేస్తూ మన అతి
తెలివినీ ప్రదర్శిస్తూ పోయామనుకోండి.. అప్పుడు మొదట బంధువులూ ఆ తరువాత మిత్రుల ద్వారా
ముందు సున్నితంగానూ తరువాత గట్టిగానూ నిలదీయించి, హెచ్చరిస్తుంది. ఆ హెచ్చరికలను కూడా
లెక్క చెయ్యకుండా మనం ముందుకు దూకుతూ వున్నా మనుకోండి.. అప్పుడు ఆ వాగ్దేవి మన చుట్టూ
వున్న ప్రతి మనిషి హృదయం లోనికీ ప్రవేశించి హెచ్చరిస్తూనే ఉంటుంది, మనం ఆమెను తల్లిగా
గుర్తించక పోయినా తల్లి గా తన బాధ్యతను నిర్వర్తిస్తూ మన బుద్దిని మళ్ళీ మళ్ళీ ఖండిస్తుంది.
అప్పటికీ తెలుసుకోకుండా మారకుండా అంతులేని స్వార్ధాన్నీ అతి తెలివినీ ప్రదర్శిస్తే
ఇహ సహనం నశించి, ఆమె తన విశ్వరూపం చూపించి, తనలోని సర్వశక్తులతో మనల్ని అధపాతాళానికి
తొక్కేస్తుంది.
అదికూడా ఎందుకో
తెలుసా? కోపంతో కాదు. కలుపు మొక్కని తీసిపారెయ్యాలి కనుక. మనతో పాటు మిగిలిన వారంతా
కూడ ఆమె పుత్రులె కనుక. వారిని మన నుంచి కాపడడానికి..! మనకు మన డబ్బూ పరువూ, పేరూ,
ప్రతిష్టా అన్నీ సర్వనాశనమయ్యాక చిట్ట చివరికి అప్పుడర్థమౌతుంది.మనకు ! " ఈ సరస్వతీ,''
''ఈ వాగ్దేవీ'' '' వాఙ్మయం" ఇవన్నీ యదార్థాలేలే అవి, వాక్ మయం అంటే అగ్నిమయం అని"!
" మనందరి వాక్కులో అగ్ని వున్నదీ'' అని అన్న మాటలు వొట్టి మాటలు కావూ.. నిజంగానే
వాక్కుకు అధిపతిగా ఒక మహా శక్తి కేంద్రమే వున్నదీ. అది బడబాగ్ని కన్నా బలమైనదీ..భయంకరమైనదీ"
అని అర్థమౌతుంది. అయితే ఈ విషయాన్ని నాశనం కాక ముందే మొదటి హెచ్చరికతోనే ముందుగా గ్రహించగలిగితే
తల్లికీ ఆనందం బిడ్డకూ ఆనందం. !
"Lets
talk less - work more"
గమనిక : నాకు తెలిసినంతలో చెప్పడానికి ప్రయత్నించాను. ఎక్కడైనా
తప్పుగా చెప్పి ఉన్నా, ఎవరి మనసును అయినా నొప్పించి
ఉన్నా మన్నించమని ప్రార్థన.
2 comments:
సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్
న బ్రూయాత్ సత్య మప్రియం
ప్రియం చ నానృతం బ్రూయాత్
ఏష ధర్మ స్సనాతన:!! (మనుస్మృతి)
ఈ శ్లోకం అర్థం మీరు చెప్పినది పూర్తిగా సరికాదండీ..
"సత్యమునే పలుకు.సత్యాన్ని ప్రియంగా పలుకు. సత్యాన్ని అప్రియంగా పలుకకు.ప్రియం అయినా అసత్యాన్ని పలుకకు.ఇదే సనాతన ధర్మం".
"సత్యమైనా ఆప్రియాన్నిపలక్కు" కు "సత్యాన్ని అప్రియంగా పలుకకు" కు గల తేడా గమనించగలరు.
@సురేష్ బాబు gaaru..!
namaste sir, meeru cheppinadi nijame andi.. gamanimchaledu... opikagaa chadivinamduku, sarididdinamduku dhanyavadamulu andi..! :) :)
Post a Comment