Monday, September 29, 2014
Monday, April 14, 2014
వాక్కు అంటే అగ్ని..! కొంచెం జాగ్రత్త..!
వాక్కు అంటే అగ్ని..! కొంచెం జాగ్రత్త..!
--> వాక్కు అనేది అగ్ని. ఆ వాగ్బాణాలు మన నోటి
నుండి వెలువడినప్పుడు అవి ఎదుటివారికి వెచ్చదనాన్ని ఇవ్వాలి గానీ..! ఎదుటివారి మనసును
నొప్పించకూడదు. ఆ వెచ్చదనాన్ని అందించే శక్తి మన వాక్కుకు లేనప్పుడు దానిని ఎదుటివారిపై
ప్రయోగించకపోవడమే ఉత్తమం. "తనకోపమె తన శత్రువు తనశాంతమె తనకు రక్ష" అన్నట్టు
మనకి కోపం అనిపిస్తే మనము మౌనంగా ఉండటమే మంచిది.
--> మౌనం యొక్క
శక్తి ఎంతటిదో చెప్పలేము. దానికి కొలమానాలు లేవు. బ్రహ్మానందం అని చెప్పబడేది ఈ పరిపూర్ణ
మౌనమే. ఈ శక్తికి అసాధ్యమన్నదేదీ లేదు. మౌనం అన్నదే వాక్కు. మనవాటి లాగా అనేక వాక్కుల
సమూహం కాదది. అది ఒక్కటే వాక్కు.
--> మౌనం అఖండ
వాక్కు.
--> వాక్కు - భాషావిశేషాలు
వాక్కు – పరా,
పశ్యన్తి, మధ్యమ, వైఖరి అని నాలుగు విధాలు. ఈ వాక్కు ఎలా పుడుతుందో వ్యాకరణం చెబుతుంది.
ఈ వాక్కు వెలువడిన తర్వాత అది ’శబ్దం’గా పరిగణిస్తాం. ప్రతి శబ్దానికి నిర్దుష్టంగా
ఒక అర్థం ఉంటుంది. అలా నిర్దుష్టమైన అర్థం కలిగిన శబ్దాన్ని ’వాచకం’లేదా ’అభిద’ అంటారు.
ఆ శబ్దం తాలూకు అర్థాన్ని ’వాచ్యం’ అంటారు.
--> చెడువాక్కులు
నాలుగువిధాలుగా ఉంటాయి.
--> పారుష్యం అనగా
కఠినంగా మాట్లాడడం. కష్టం కలిగించే విధంగా మాట్లాడితే కష్టాలు, సమస్యలే కాక మిత్రులు
కూడా శత్రువులు అవుతారు. అందువలన అశాంతి, దుఃఖం కలుగుతుంది. ఇతరులు వారితో మాట్లాడేందుకు
సంకోచిస్తారు**.
--> అనృతం అనగా
అసత్యం చెప్పడం. దీనివల్ల ఆత్మ, మనస్సు కలుషితమౌతాయి. సత్యం దేవతల వ్రతం అని, అసత్యం
చెప్పడం అసురుల స్వభావమని వేదవిదులు అంటున్నారు. అసత్యవాదులు జీవించినా మరణించిన వారితో
సమానమని వేదోక్తి.
--> పైశున్యం అనగా
చాడీలు చెప్పడం. దీనివలన కుటుంబాలలో కలహాలు, సన్నిహితులతో విరోధాలు ఏర్పడతాయి. పరస్పరం
అసూయ, అసహనం ఏర్పడతాయి ఇతరుల నుండి అవమానాల్ని, అవహేళనల్ని పొందాల్సి ఉంటుంది. వీరు
సాంఘిక జీవనం కోల్పోతారు.
--> అసందర్భ ప్రలాపం
: పరమాత్మ ప్రసాదించిన వాక్కును ఆచితూచి వినియోగించాలి. అనవసరంగా, అసందర్భంగా వ్యర్ధంగా
మాట్లాడకూడదు. ఇడతెగకుండ మాట్లాడుతుంటే ఇతరులకు చిరాకుపెడుతుంది.
--> సత్యం బ్రూయాత్
ప్రియం బ్రూయాత్
న బ్రూయాత్
సత్య మప్రియం
ప్రియం చ నానృతం
బ్రూయాత్
ఏష ధర్మ స్సనాతన:!!
(మనుస్మృతి)
భావం. సత్యాన్నే పలుకు,
ప్రియాన్నే మాట్లాడు, సత్యమైనా అప్రియాన్నిపలక్కుఇదే సనాతన ధర్మం అని శ్లోక తాత్పర్యం.
ఇది చెప్పేవాడికి చెప్పే లక్షణ శ్లోకంలా కనిపిస్తుంది.కానీ అడిగే వాడెలాంటి విషయం వింటానికి
అడగాలో,ఏది వినాలో చెప్పే చమత్కారం కూడా యిందులో వుంది. సత్యాన్నేవిను, ప్రియమైన దాన్నే
విను.సత్యమైనా అప్రియంగా వుంటే వినకు.అలాగే ప్రియంగా వుందని అసత్యాన్ని వినకు.అలాంటి
లక్షణాలతో చెప్పేవాడు, వినేవాడూ వున్నప్పుడు ఆ చెప్పిన విషయం హృదయానికి హత్తుకుని ఎల్ల
కాలం గుర్తుంటుంది. అనగా ఇతరులకు ప్రియం కానిది అది సత్యమైనా మనం చెప్పకూడదు. అందులో
కాఠిన్యముండడమే కారణం. అలాగే జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడకపోతే అది సత్యమైనా తగవులాటకు
కారణమవుతుంది. అందుకే నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ అన్నారు.
అటువంటివిషయాల జోలికి పోకపోవడం ఉత్తమమేమో…!
--> వాక్కు గురించి
వేమన పలికిన మాటలు
--> వాక్కువలన
గలుగు పరమగు మోక్షంబు
వాక్కువలన గలుగు
వరలు ఘనత
వాక్కువలన గలుగు
నెక్కుడైశ్వర్యంబు
విశ్వదాభిరామ
వినురవేమ!
భావం. మోక్షం, గౌరవం, ఐశ్వర్యం అన్నీ మాటలను బట్టే లభిస్తాయి. కనుక తగిన విధంగా మాట్లాడడం నేర్చుకోవాలి.
భావం. మోక్షం, గౌరవం, ఐశ్వర్యం అన్నీ మాటలను బట్టే లభిస్తాయి. కనుక తగిన విధంగా మాట్లాడడం నేర్చుకోవాలి.
--> వాక్కు శుద్ధి లేనివాడు చండాలుడు
ప్రేమ శుద్ధి
లేక పెట్టు టెట్లు?
నొసలు భక్తుడైన
నోరు తోడేలయా!
విశ్వదాభిరామ
వినురవేమ!
భావం. వాక్కుశుద్ధిలేనివాడే చండాలుడు. అతని మాటల్లో
మంచితనం ఉండదు. అతని నొసటన భక్తి చిహ్నాలు ఉంటే ఉండొచ్చు గాని నోటికి మాత్రం క్రూరమృగాల
లక్షణాలే ఉంటాయి అంటున్నాడు వేమన. దేనికైనా త్రికరణ శుద్ధి ముఖ్యం అని సారాంశం.
మహాభారతంలోని
ఆదిపర్వమునందలి చతుర్థాశ్వాసంలో వాక్కు, సత్యవాక్కుల గురించిన ప్రస్తావన వస్తుంది. ఎటువంటి మాటలు మాట్లాడాలి?!
వాక్కు అంటే ఏంటి? అన్న అనేకప్రశ్నలకి సమాధానాలు ఈ సందర్భంలో లభిస్తాయి.
చ. నుతజల పూరితంబు
లగు నూతులు నూఱిటికంటె సూనృత
వ్రత యొక బావి
మేలు మఱి బావులు నూఱిటికంటె నొక్క స
త్క్రతు వది
మేలు తత్క్రతుశతంబునకంటె సుతుండు మేలు త
త్సుత శతకంబుకంటె
నొక సూనృతవాక్యము మేలు సూడఁగన్.
భావం. తియ్యటి నీటితో
నిండివున్న నూఱు నూతులకంటె ఒక దిగుడుబావి మేలు, అట్టి బావులు నూఱిటికంటె ఒక సత్క్రతువు
మేలు, అట్టి నూఱు క్రతువులకంటె ఒక కుమారుడు మేలు, అట్టి నూర్గురు కుమారులకంటె కూడా,
ఓ సూనృతవ్రతుడ వైన రాజా ! ఒక సత్యమైన మాట మేలయ్యా. అని అంటూ ఇంకా సత్యాన్నిగురించిన
గొప్పదనాన్ని ఇలా వర్ణిస్తుంది.
క. వెలయంగ నశ్వమేధం,
బులు వేయును నొక్క సత్యమును నిరుగడలం
దుల నిడి తూఁపఁగ
సత్యము, వలనన ములు సూపు గౌరవంబున పేర్మిన్.
భావం. వెయ్యి అశ్వమేధ
యాగాల ఫలాన్నిఒకవేపు, సత్యవాక్యాన్ని ఇంకోవేపు త్రాసులో ఉంచి తూస్తే త్రాసు యొక్క ముల్లు
సత్యం వైపే మొగ్గును చూపిస్తుంది సత్యము యొక్క భారాతిశయము చేత.
తే. సర్వతీర్థాభిగమనంబు
సర్వ వేద, సమధిగమము సత్యంబుతో సరియుఁ గావు
నెఱుఁగు మెల్ల
ధర్మంబుల కెందుఁ బెద్ద, యండ్రు సత్యంబు ధర్మజ్ఞు లైన వారు.
భావం. అన్ని తీర్థాలను
సేవించగా వచ్చే ఫలితం, సర్వవేదాల్ని పొందుట కూడా సత్యముతో సరిగావు. అన్ని ధర్మాలలోకెల్లా
సత్యమే పెద్ద అని ధర్మజ్ఞులైనవారు చెప్తారు, తెలుసుకో. మోక్షం, గౌరవం, ఐశ్వర్యం
అన్నీ మాటలను బట్టే లభిస్తాయి. కనుక తగిన విధంగా మాట్లాడడం నేర్చుకోవాలి.
వాక్కు అనేది
బాణం వంటిది. వాస్తవానికి మనుష్యుల వచనాలు, పదాలు, మాటలు ఎదుటివారిని తాకుతాయి. వారు
పలికిన పలుకులను బట్టి ఆ వాక్కు యొక్క ఫలితాలు కూడా తిరిగి వారినే చేరతాయి. ఆ ఫలితం
మంచిదైతే గౌరవాభిమానాలు లభిస్తాయి. చెడ్డవైతే ఛీత్కారాలు లభిస్తాయి. కనుక వాగ్బాణాలను
వదిలేముందు ఒకటికి వందసార్లు సరిచూసుకుంటే మంచిది.
ఒకవేళ పొరపాటుగా కొన్ని అనుచిత వాక్యాలు
ప్రయోగించినట్టయితే, వారు పశ్చాత్తాపం చెంది
క్షమించమని అడిగేందుకు సిద్ధపడతారు. అంటే మనుష్యులు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే
మనం మాట్లాడే మాటలతో సమాజంలో ఒక సంచలనం సృష్టించవచ్చు. లేదా ప్రజలను సంఘటితం చేయవచ్చు,
వ్యవస్థను ఆనందింప చేయగలం అన్న విషయాన్ని. కొందరు వ్యక్తులు సమయం, సందర్భం స్థితి స్థానాన్ని
దృష్టిలో ఉంచుకోకుండా మాట్లాడుతూ ఉంటారు. దీనివల్ల ముందడుగు వేయడం మాట అటుంచి వెనకడుగు
మాత్రం ఖాయం. వ్యర్థ ప్రసంగాల ద్వారా ఇతరులతో సంబంధాలను తెంచుకోవడం మంచిది కాదు.
--> మనుష్యుల మాటల
ద్వారా అతని స్వభావం సంస్కారం తెలుస్తుంది. జ్ఞానవంతుడు అయిన మనిషి తన మాటలను అదుపులో
పెట్టుకుంటాడు.
--> ఆంగ్లభాషలో
ఒక సూక్తి ఉంది. “Let us agree to disagree”' అంటే ఒక విషయంపట్ల అనంగీకారమును తెలిపే
ముందు అంగీకారం తెలియబరచు.. ఒక విషయంలోని తప్పును చెప్పే ముందు ముందు ఆ విషయాన్ని ఒప్పు
అని ఒప్పుకుని ఆ తరువాత అది ఎందుకు తప్పో తెలియబరిచే ప్రయత్నం చేస్తే ఎదుటివారి మనసును
నొప్పించకుండా విషయమును సానుకూలంగా పరిష్కరించడం సులభం అవుతుంది.
--> వాక్కు అంటే
అగ్ని..! కొంచెం జాగ్రత్త..!
వాక్కుకు అధిదేవత
సరస్వతి అందుకే ఆవిడకి వాగ్దేవి అని పేరు. ఆ వాక్కును మనం దుర్వినియోగం చేస్తే, ఎదుటి
వారిని చెడగొట్టి వారిని మన స్వార్థ పూరితమైన మన కోర్కెలు తీర్చుకోవడానికి వాడుకోవడానికి
ప్రయత్నిస్తే, ఆవిడ మొదట మన అంతరాత్మలో బావనా రూపంలో మన ఆలోచనల్లో ఒక ఆలోచనై, వచ్చి
నిలిచి, మనల్ని రహస్యంగా హెచ్చరిస్తుంది. మనం వినకుండా మళ్ళీ అవే పనులు చేస్తూ మన అతి
తెలివినీ ప్రదర్శిస్తూ పోయామనుకోండి.. అప్పుడు మొదట బంధువులూ ఆ తరువాత మిత్రుల ద్వారా
ముందు సున్నితంగానూ తరువాత గట్టిగానూ నిలదీయించి, హెచ్చరిస్తుంది. ఆ హెచ్చరికలను కూడా
లెక్క చెయ్యకుండా మనం ముందుకు దూకుతూ వున్నా మనుకోండి.. అప్పుడు ఆ వాగ్దేవి మన చుట్టూ
వున్న ప్రతి మనిషి హృదయం లోనికీ ప్రవేశించి హెచ్చరిస్తూనే ఉంటుంది, మనం ఆమెను తల్లిగా
గుర్తించక పోయినా తల్లి గా తన బాధ్యతను నిర్వర్తిస్తూ మన బుద్దిని మళ్ళీ మళ్ళీ ఖండిస్తుంది.
అప్పటికీ తెలుసుకోకుండా మారకుండా అంతులేని స్వార్ధాన్నీ అతి తెలివినీ ప్రదర్శిస్తే
ఇహ సహనం నశించి, ఆమె తన విశ్వరూపం చూపించి, తనలోని సర్వశక్తులతో మనల్ని అధపాతాళానికి
తొక్కేస్తుంది.
అదికూడా ఎందుకో
తెలుసా? కోపంతో కాదు. కలుపు మొక్కని తీసిపారెయ్యాలి కనుక. మనతో పాటు మిగిలిన వారంతా
కూడ ఆమె పుత్రులె కనుక. వారిని మన నుంచి కాపడడానికి..! మనకు మన డబ్బూ పరువూ, పేరూ,
ప్రతిష్టా అన్నీ సర్వనాశనమయ్యాక చిట్ట చివరికి అప్పుడర్థమౌతుంది.మనకు ! " ఈ సరస్వతీ,''
''ఈ వాగ్దేవీ'' '' వాఙ్మయం" ఇవన్నీ యదార్థాలేలే అవి, వాక్ మయం అంటే అగ్నిమయం అని"!
" మనందరి వాక్కులో అగ్ని వున్నదీ'' అని అన్న మాటలు వొట్టి మాటలు కావూ.. నిజంగానే
వాక్కుకు అధిపతిగా ఒక మహా శక్తి కేంద్రమే వున్నదీ. అది బడబాగ్ని కన్నా బలమైనదీ..భయంకరమైనదీ"
అని అర్థమౌతుంది. అయితే ఈ విషయాన్ని నాశనం కాక ముందే మొదటి హెచ్చరికతోనే ముందుగా గ్రహించగలిగితే
తల్లికీ ఆనందం బిడ్డకూ ఆనందం. !
"Lets
talk less - work more"
గమనిక : నాకు తెలిసినంతలో చెప్పడానికి ప్రయత్నించాను. ఎక్కడైనా
తప్పుగా చెప్పి ఉన్నా, ఎవరి మనసును అయినా నొప్పించి
ఉన్నా మన్నించమని ప్రార్థన.
Monday, March 17, 2014
ఉత్తమ స్త్రీ, పురుష లక్షణాలు
ఉత్తమ స్త్రీ, పురుష లక్షణాలు :
ఉత్తమ పురుష లక్షణాలు :
శ్లో॥ కార్యేషు యోగీ, కరణేషు దక్షః
రూపేచ కృష్ణః క్షమయా తు రామః
భోజ్యేషు తృప్తః సుఖదుఃఖ మిత్రం
షట్కర్మయుక్తః ఖలు ధర్మనాథః (కామందక నీతిశాస్త్రం)
--> కార్యేషు యోగీ :
పనులు చెయ్యడంలో ఒక యోగి వలె, ప్రతిఫలాన్ని ఆశించకుండా చెయ్యాలి.
--> కరణేషు దక్షః
కుటుంబాన్ని నడపడంలో, కార్యాలను నిర్వహించడంలో నేర్పుతో, సంయమనంతో వ్యవహరించాలి. సమర్ధుడై ఉండాలి.
--> రూపేచ కృష్ణః
రూపంలో కృష్ణుని వలె ఉండాలి. అంటే (ఎనిమిది పెళ్ళిళ్ళు చేసుకోమని కాదు) ఎల్లప్పుడూ ఉత్సాహంగా,
సంతోషంగా ఉండాలి.
--> క్షమయా తు రామః
ఓర్పులో రామునిలాగా ఉండాలి. పితృవాక్యపరిపాలకుడైన రాముని వలె క్షమించేగుణాన్ని కలిగిఉండాలి.
--> భోజ్యేషు తృప్తః
భార్య/తల్లి వండినదాన్ని సంతృప్తిగా (వంకలు పెట్టకుండా) భుజించాలి.
--> సుఖదుఃఖ మిత్రం
సుఖదుఃఖాలలో కుటుంబానికి మిత్రుని వలె అండగా ఉండాలి. మంచి చెడ్డలలో పాలు పంచుకోవాలి.
ఈ షట్కర్మలు - ఈ ఆరు పనులు సక్రమంగా చేసే పురుషుడు ఉత్తమ పురుషునిగా , ధర్మనాథునిగా కొనియాడబడతాడు.
ఉత్తమ స్త్రీ లక్షణాలు :
శ్లో॥ కార్యేషు దాసీ, కరణేషు మంత్రీ,
రూపేచ లక్ష్మీ, క్షమయా ధరిత్రీ,
భోజ్యేషు మాతా, శయనేషు రంభా
షట్కర్మ యుక్తా కుల ధర్మపత్నీ. (కామందక నీతిశాస్త్రం)
--> కార్యేషు దాసీ
పనులు చెయ్యడంలో దాసి లాగా బద్ధకించకుండా పొందికగా, ఒద్దికగా, నిదానంగా పనులు చెయ్యాలి. ఏ పనులు చేసినా ప్రతిఫలాన్ని ఆశించకూడదు. నిస్వార్థంగా, నిజాయితీగా ఉండాలి.
-->కరణేషు మంత్రీ
మంచి సలహాలు, సూచనలు అందించడంలో మంత్రిలాగా ఉండాలి. ఇచ్చే సలహాలు కుటుంబానికి మంచి పేరు తెచ్చేలా ఉండాలి. ఆ సలహాల వల్ల ఎవరికీ అన్యాయం జరగకూడదు.
-->రూపేచ లక్ష్మీ
ఎల్లప్పుడూ ప్రశాంతచిత్తంతో ఉండాలి. ఇరుగు పొరుగువారందరితో స్నేహంగా ఉండాలి. రూపంలో లక్ష్మీ దేవి లాగా ఎల్లప్పుడూ కళకళలాడుతూ, చిరునవ్వు చిందిస్తూ సంతోషంగా ఉండాలి.
-->క్షమయా ధరిత్రీ
కష్ట సమయాలలో, కుటుంబ నిర్వహణలో భూదేవి అంత ఓర్పును కలిగి ఉండాలి. తొందరపడి ఏ పని చేయకూడదు.
-->భోజ్యేషు మాతా
భర్త తెచ్చిన సంపాదనతో సంతృప్తి పడాలి. భోజనం పెట్టేటప్పుడు తల్లి వలె ప్రేమగా పెట్టాలి.
--> శయనేషు రంభా
పడకటింటి లో రంభ లాగా ఉండాలి.
ఈ షట్కర్మలు - ఈ ఆరు పనులు సక్రమంగా చేసే స్త్రీ ఉత్తమ స్త్రీగా, ధర్మపత్నిగా కొనియాడబడుతుంది. ఇదీ ఈ శ్లోకానికి అర్థం.
మన పెద్దలు ఉత్తమ స్త్రీ పురుషులకు ఉండాల్సిన లక్షణాలను గూర్చి ఈవిదంగా చెప్పారు. అంటే ఈవిధంగా ఉన్నవాళ్ళే ఉత్తములా?! అనే సందేహం అనవసరం. ఈ షట్కర్మలనూ ఆచరిస్తే స్త్రీ, పురుషులు ఇంకా సఖ్యతగా, అన్యోన్యంగా ఉంటారని దాని అర్థం కావచ్చును.
విన్నపం - ఎక్కడైనా తప్పుగా చెప్తే మన్నించమని ప్రార్థన.
ఉత్తమ పురుష లక్షణాలు :
శ్లో॥ కార్యేషు యోగీ, కరణేషు దక్షః
రూపేచ కృష్ణః క్షమయా తు రామః
భోజ్యేషు తృప్తః సుఖదుఃఖ మిత్రం
షట్కర్మయుక్తః ఖలు ధర్మనాథః (కామందక నీతిశాస్త్రం)
--> కార్యేషు యోగీ :
పనులు చెయ్యడంలో ఒక యోగి వలె, ప్రతిఫలాన్ని ఆశించకుండా చెయ్యాలి.
--> కరణేషు దక్షః
కుటుంబాన్ని నడపడంలో, కార్యాలను నిర్వహించడంలో నేర్పుతో, సంయమనంతో వ్యవహరించాలి. సమర్ధుడై ఉండాలి.
--> రూపేచ కృష్ణః
రూపంలో కృష్ణుని వలె ఉండాలి. అంటే (ఎనిమిది పెళ్ళిళ్ళు చేసుకోమని కాదు) ఎల్లప్పుడూ ఉత్సాహంగా,
సంతోషంగా ఉండాలి.
--> క్షమయా తు రామః
ఓర్పులో రామునిలాగా ఉండాలి. పితృవాక్యపరిపాలకుడైన రాముని వలె క్షమించేగుణాన్ని కలిగిఉండాలి.
--> భోజ్యేషు తృప్తః
భార్య/తల్లి వండినదాన్ని సంతృప్తిగా (వంకలు పెట్టకుండా) భుజించాలి.
--> సుఖదుఃఖ మిత్రం
సుఖదుఃఖాలలో కుటుంబానికి మిత్రుని వలె అండగా ఉండాలి. మంచి చెడ్డలలో పాలు పంచుకోవాలి.
ఈ షట్కర్మలు - ఈ ఆరు పనులు సక్రమంగా చేసే పురుషుడు ఉత్తమ పురుషునిగా , ధర్మనాథునిగా కొనియాడబడతాడు.
ఉత్తమ స్త్రీ లక్షణాలు :
శ్లో॥ కార్యేషు దాసీ, కరణేషు మంత్రీ,
రూపేచ లక్ష్మీ, క్షమయా ధరిత్రీ,
భోజ్యేషు మాతా, శయనేషు రంభా
షట్కర్మ యుక్తా కుల ధర్మపత్నీ. (కామందక నీతిశాస్త్రం)
--> కార్యేషు దాసీ
పనులు చెయ్యడంలో దాసి లాగా బద్ధకించకుండా పొందికగా, ఒద్దికగా, నిదానంగా పనులు చెయ్యాలి. ఏ పనులు చేసినా ప్రతిఫలాన్ని ఆశించకూడదు. నిస్వార్థంగా, నిజాయితీగా ఉండాలి.
-->కరణేషు మంత్రీ
మంచి సలహాలు, సూచనలు అందించడంలో మంత్రిలాగా ఉండాలి. ఇచ్చే సలహాలు కుటుంబానికి మంచి పేరు తెచ్చేలా ఉండాలి. ఆ సలహాల వల్ల ఎవరికీ అన్యాయం జరగకూడదు.
-->రూపేచ లక్ష్మీ
ఎల్లప్పుడూ ప్రశాంతచిత్తంతో ఉండాలి. ఇరుగు పొరుగువారందరితో స్నేహంగా ఉండాలి. రూపంలో లక్ష్మీ దేవి లాగా ఎల్లప్పుడూ కళకళలాడుతూ, చిరునవ్వు చిందిస్తూ సంతోషంగా ఉండాలి.
-->క్షమయా ధరిత్రీ
కష్ట సమయాలలో, కుటుంబ నిర్వహణలో భూదేవి అంత ఓర్పును కలిగి ఉండాలి. తొందరపడి ఏ పని చేయకూడదు.
-->భోజ్యేషు మాతా
భర్త తెచ్చిన సంపాదనతో సంతృప్తి పడాలి. భోజనం పెట్టేటప్పుడు తల్లి వలె ప్రేమగా పెట్టాలి.
--> శయనేషు రంభా
పడకటింటి లో రంభ లాగా ఉండాలి.
ఈ షట్కర్మలు - ఈ ఆరు పనులు సక్రమంగా చేసే స్త్రీ ఉత్తమ స్త్రీగా, ధర్మపత్నిగా కొనియాడబడుతుంది. ఇదీ ఈ శ్లోకానికి అర్థం.
మన పెద్దలు ఉత్తమ స్త్రీ పురుషులకు ఉండాల్సిన లక్షణాలను గూర్చి ఈవిదంగా చెప్పారు. అంటే ఈవిధంగా ఉన్నవాళ్ళే ఉత్తములా?! అనే సందేహం అనవసరం. ఈ షట్కర్మలనూ ఆచరిస్తే స్త్రీ, పురుషులు ఇంకా సఖ్యతగా, అన్యోన్యంగా ఉంటారని దాని అర్థం కావచ్చును.
విన్నపం - ఎక్కడైనా తప్పుగా చెప్తే మన్నించమని ప్రార్థన.
Saturday, March 8, 2014
Wednesday, January 29, 2014
దుంధుమారుని కథ
మహాభారతం - అరణ్యపర్వం - దుంధుమారుని కథ - అమరత్వ లబ్ధి
ఆయుర్దాయం ఉన్నంత కాలం మానవులెలాగూ బ్రతుకుతారు. మరణించిన తరువాతకూడా కీర్తి
కాయులై జీవించి ఉండటం ఎంతో గొప్ప విషయం. ఇది వారి సత్ప్రవర్తన, సమాజహిత కార్యాచరణ,
కావ్య, కళానిర్మాణదక్షత మొదలైన వాటిని అనుసరించి ఉంటుంది. దీనిని గూర్చి
ఆంధ్రమహాభారతం, అరణ్యపర్వంలో ఒక ప్రతీకాత్మకమైన కథ ఉంది. దీనిని మార్కండేయమహర్షి
ధర్మరాజుకు చెప్పాడు.
పూర్వం హైహయ వంశానికి చెందిన "ధుంధుమారుడు" అనే రాజకుమారుడు వేటకు
వెళ్ళి, జింక చర్మం ధరించి పొదలమాటునుంచి కనిపిస్తున్న ఒక బ్రాహ్మణ యువకుణ్ణి
జింకగా భావించి బాణంతో కొట్టి చంపాడు. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే ఆ యువకుని
కళేబరం కనిపించింది. తన పొరపాటువల్ల ఇంత అనర్థం జరిగిందే అని బాధపడి, ఇంటికి
వెళ్ళి తన వృద్ధ బంధుజనులకు ఈ విషయం చెప్పి, వారిని ఆ ప్రదేశానికి తీసుకువచ్చి ఆ
యువకుని మృతకళేబరాన్ని చూపించాడు.
వారందరూ అక్కడికి సమీపంలో ఉన్న తార్క్ష్యుడు అనే మహర్షి ఆశ్రమానికి వెళ్ళారు. ఆయన
వారిని ఆదరంగా ఆశీర్వదించి, వారికి అతిథిసత్కారాలు చేయవలసినదిగా తన శిష్యులను నియోగించాడు.
అపుడు హైహయులు మహర్షికి నమస్కరిస్తూ "మహర్షీ ! మా మీది అనుగ్రహంతో మీరు మాకు
అతిథిసత్కారాలు చేయిస్తున్నారు. కానీ వాటిని అందుకోదగిన అర్హత మాకు లేదు. ఇడుగో..
మా వంశానికి చెందిన ఈ రాజకుమారుడు మీ ఆశ్రమ ప్రాంతంలో ఒక బ్రాహ్మణయువకుణ్ణి జింకగా
భ్రమించి బాణంతో నేలగూల్చాడు. ఈ మహాపాపానికి నిష్కృతి ఏముంటుంది. ఈ విషయాన్ని తమకు
నివేదించటానికే వచ్చాం" అన్నారు.
అపుడు తార్క్ష్యుడు చిరునవ్వు నవ్వుతూ "త్రిలోకాలకూ ఆశ్చర్యం కలిగించే విషయం
ఒకటి మీకు చెప్పాలి. మా ఆశ్రమంలో ఎవరికీ భయం, వ్యాధి, దుర్గతి, మరణం ఉండనే ఉండవు. అందువల్ల
ఈ రాజకుమారుడు ఇక్కడ ఎవరినో చంపాడనటం మీ భ్రమ" అని తపోబల సంపన్నుడు, తేజస్వి
అయిన ఒక యువకుణ్ణి పిలిచి వారికి చూపుతూ "చూడండి .. మీ రాజకుమారుడు బాణంతో
కొట్టినది ఇతనినేనా?" అన్నాడు.
ఆశ్చర్యం ! రాజకుమారుడు చంపింది ఈ యువకుణ్ణే! పైగా ఇతడు తార్క్ష్య మహర్షికి
కుమారుడట. తమ కళ్ళతో తాము ఈ యువకుని మృతదేహాన్ని చూశారుకదా!కానీ ఇతడు జీవించే
ఉన్నాడే! ఇది ఎలా సంభవం? హైహయులు ఆశ్చర్యపడి తార్క్ష్యునితో "మహర్షీ!ఈ
యువకుడు మరణించి పునర్జీవితుడయ్యాడు. ఈ మహత్తు విస్మయకరం. ఇంతటి మహిమ ఇతనికి ఎలా
సిద్ధించింది?" దయచేసి చెప్పండి అని అడిగారు.
"ఆలస్యంబొకయింత లేదు, శుచి యాహారంబు, నిత్యక్రియా
జాలంబేమఱ, మర్చనీయు లతిథుల్, సత్యంబు
పల్కంబడున్
మేలై శాంతియు, బ్రహ్మచర్యమును నెమ్మిందాల్తు,
మట్లౌట నె
క్కాలంబుం బటురోగ మృత్యుభయ శంకంబొంద
మేమెన్నడున్" అన్నాడు.
ఆ ఆశ్రమవాసుల అమరత్వ లబ్ధికి మహర్షి చెప్పిన కారణాలు ఇవీ -
---> చేయవలసిన పనులు చేయటంలో ఒకయింతైనా ఆలస్యం చేయరు.
---> శుచియైన ఆహారం మాత్రమే భుజిస్తారు.
---> అనుదిన క్రియా కలాపాలలో ఏమఱుపాటు
చెందరు.
---> అతిథులు వారికెప్పుడూ పూజనీయులే!
---> కేవలం సత్యాన్ని పలుకుతారు.
---> ఐచ్ఛికంగా శాంతస్వభావాన్ని,
బ్రహ్మచర్యాన్ని పాటిస్తారు.
ఈ ఆరు లక్షణాలను ఆధునిక సమాజం ఎంతవరకూ సమాదరిస్తోంది అనేది ఆలోచించవలసిన అంశం.
సంకల్పబలం ఉంటే వీనిలో ఆచరణకు అసాధ్యమైనవి ఉండవు. వీటిని ఆచరణలో చూపిస్తే
ఆఫీసుల్లో పెండింగ్ ఫై ల్స్ ఉండవు. కలుషితాహారం తిని అస్వస్థులై ఆసుపత్రుల
పాలయ్యేవారుండరు. పనులు చేయటంలో రేపు, మాపు అని బద్ధకంతో వాయిదాలు వెయ్యటం
ఉండదు.అతిథులు వస్తారంటే , లేదా మనమే అతిథులుగా ఎవరింటికో వెళ్లవలసి వస్తే
భయపడవలసిన అవసరం ఉండదు. అసత్య దోషం ఉండదు. కక్షలూ, అత్యాచారాలూ ఉండవు. నిజానికి ఈ
అంశాలన్నింటికీ నేపథ్యంగా ఒక ఆధ్యాత్మిక దృక్పథం ఉంది. ఆచరణలో అది ప్రతిష్ఠితమైతే
అమరత్వమే సిద్ధిస్తుంది. ఇలాంటి సత్ప్రవర్తన కలిగిన సజ్జనులు భౌతికంగా మరణించినా
మరణాన్ని జయిస్తారని గ్రహించాలి.
"జీవంతం మృతవన్మన్యే దేహినం ధర్మ వర్తనం
మృతో ధర్మేణ సంయుక్తో దీర్ఘజీవీ న
సంశయః" అని పెద్దల మాట.
"ధర్మాన్ని త్యజించినవాడు జీవించి ఉన్నా చనిపోయినవానిగానే పరిగణింపబడుతాడు.
ధర్మైక జీవి మృతుడైనా చిరంజీవి అనటంలో సంశయం లేదు" అని దీని భావం.
Ref : అరణ్యపర్వం మహాభారతం నుండి సేకరించినది.
నవలల్లో మనో విశ్లేషణాత్మకత
నవలల్లో మనో విశ్లేషణాత్మకత
పరిచయo:
నవలల్లో మనో విశ్లేషణాత్మకత అనేది నవీన యుగములోనే ప్రారంభం అయిందని
చెప్పవచ్చు. క్రీ.శ. 1920-1942 ప్రాంతములోని తెలుగు నవలా వికాసం నందు, క్రీ.శ.1942
నుండి 1960 వరకు మధ్య ప్రాంతం లోని మనో వైజ్ఞానిక యుగము నందు నవలల్లో గల మనో
విశ్లేషణాత్మకత మీద విస్తృత చర్చ జరిగిందని చెప్పవచ్చు.
మనస్తత్వ విశ్లేషణల ద్వారా మాత్రమే మానసిక పరిణతి సాధించబడ్తుందని గ్రహించి
సాహిత్యములో మనో విశ్లేషణాత్మకతని పరిచయము చేశారు. కథకు మనో విజ్ఞానమునకు
ప్రాధాన్యము ఇవ్వడం దీని ముఖ్య ఉద్దేశం. వీటిల్లో మనో విశ్లేషణ ప్రధానముగా
ఉంటుంది. ఒక వ్యక్తి పాత్ర ప్రవర్తించే స్వభావము అతని మనసు ఆలోచించే తీరుమీద
ఆధారపడి ఉంటుంది. ఆ వ్యక్తి జీవితములోని కీలకసమయాలలో అతని మనస్తత్వం ఎలా ఉంది?
అతని నిర్ణయాలను అతను అతని ఇష్టానుసారం అనుసరించినప్పుడు వాటి ఫలితాలు అతనే
అనుభవిస్తాడు. ఒక వ్యక్తి ఇతరులకు సలహాలుగా సూచనలుగా ఎన్నో విషయాలు చెప్తాడు కానీ
తను మాత్రం ఆచరించడు. అలాగే కొందరు ఇతరులలోని తప్పులని ఎత్తిచూపుతారు వారికి
జ్ఞానభోద చెయ్యాలని చూస్తారు కాని వారు మాత్రం వారు చేసే తప్పులని
విశ్లేషించుకోరు. ఈ విషయాలన్నీ మనస్తత్వం ఆధారంగా ఆ వ్యక్తి యొక్క ఆలోచనా సరళిని,
వ్యక్తిత్వాన్ని నమ్మకాలను ఆశ్రయించి ఉంటాయి.
మనస్తత్వం ప్రధానంగా పాత్రల మానసిక సంఘర్షణలు, మనో విశ్లేషణలు, తత్వాలు,
ఆలొచనలను వివరిస్తూ నవలా రచన సాగుతుంది. మనో విశ్లేషణాత్మకంగా రచనలు చేసిన వారిలో
త్రిపురనేని గోపీచంద్, రాచకొండ విశ్వనాధ శాస్త్రి, జి.వి.కిష్ణారావు, బుచ్చిబాబు,
కొడవటి గంటి కుటుంబరావు ముఖ్యులుగా చెప్పవచ్చు.
మనోవిశ్లేషణాత్మకతను ప్రధానంగా చేసుకుని రచన కావించబడ్డ నవలలలోముఖ్యమైనవి
బుచ్చి బాబు – చివరకు మిగిలేది, గోపీచంద్ – అసమర్ధుని జీవయాత్ర, విశ్వనాధ శాస్త్రి
గారి అల్పజీవి, రాజు మనిషి మొదలైన నవలలు ముఖ్యమైన నవలలుగా చెప్పవచ్చు.
ముఖ్యమైన కొన్ని మనో విశ్లేషణాత్మక రచనలు:
కొడవటిగంటి కుటుంబరావుగారు ఆర్ధిక మానసిక సంక్షోభాన్ని మనో విజ్ఞానాన్ని
కథా సంవిధానాన్ని కూడా చూపిస్తూ అనుభవం, చదువు, ఆత్మజన్మ, కొత్త కోడలు, ప్రేమించిన
మనిషి, కొత్త అల్లుడూ మొదలైన నవలలు రచించారు.
బుచ్చిబాబు చివరకు మిగిలేది నవలలో సాంఘిక, మానసిక సంఘర్షణలకు సతమతమౌతూ,
తల్లి మీద నింద తనకి నీడలా వెంటాడుతోందని భాదపడ్తూ ఉన్నటువంటి పాత్రగా దయానిధి
పాత్రని చిత్రించారు. చివరలో అతను చేసినట్టి సాహసలు అతని జీవితగమనంలోని ఒడిదుడుకులను కూడా ఇందులో
వివరిస్తారు. ’చివరకు మిగిలేది’ ఏంటి? అని పాఠకుని ప్రశ్న ముగింపుగా మనకు ఈ నవలలో
కనిపిస్తుంది.
అవ్యక్త మానసిక స్ధితికి ప్రాధాన్యమిస్తూ చేసిన రచన రాచకొండ విశ్వనాధ
శాస్త్రిగారి అల్పజీవి. మధ్య తరగతి గుమాస్తా అయిన సుబ్బయ్య తన జీవితాన్ని
స్ధితిగతులను నిందించుకుంటూ జీవితం గడుపుతుంటాడు. పరిణతి చెందిన వ్యక్తిత్వము
లేనివాడుగా సుబ్బయ్య పాత్ర ఇందులో కన్పిస్తుంది. వ్యక్తిత్వము లేక అతను అల్పజీవి
అయిన విధానాన్ని వివరిస్తూ మానసిక లోతులు ఒక వ్యక్తిలో ఏ పరిధిలో ఉంటాయో
అద్భుతముగా వివరిస్తారు.
త్రిపురనేని గోపీచంద్ అసమర్ధుని జెవయాత్ర నవల అతిముఖ్యమైనది. జీవితంలో
ఎన్ని ఉన్నా సుఖదుఖాలకు జయాపజయాలకు వ్యక్తియొక్క మనస్తత్వమే ప్రధానమని నిరూపించిన
తొలినవలగా దీని గురించి చెప్పుకోవచ్చు. సీతారామారావు పాత్రని ప్రతిభావంతంగా
తీర్చిదిద్దాడు. మెరుపుల మరకలు, పండిత ప్రమేశ్వర శాస్త్రి వీలునామా, పిల్ల తెమ్మెర
నవలలు గోపీచంద్ మనో విశ్లేషణాత్మకత కు నిదర్శనాలు.
ఏకవీర – అసమర్ధుని జీవయాత్ర నవలల పరిచయం:
ఏకవీర పాశ్చాచ్య నాగరికతా వ్యామొహంలో పడి నైతికవిలువలు సంస్కృతీ సంప్రదాయము
మర్చిపోతున్న సమయంలో కొత్త సమాజాన్ని నిర్మింపజేయాలనే ఆశతో నవలా రచన చేసి 60కి
పైగా నవలలను రచించిన వారు విశ్వనాథ సత్యనారాయణ. వీటిల్లో ఉత్తమోత్తమ
స్ధాయినందుకున్న నవల ’ ఏకవీర’. మధురను ఏలిన నాయకరాజుల కాలమునాడు జరిగినట్టి కధగా
మనకు కనిపిస్తుంది.వైదిక ధర్మానికీ, వ్యక్తిగత హృదయ స్పందనకు మధ్య సంఘర్షణ ఇందులోని
కథా బీజము. ప్రేమకీ ధర్మానికీ చెలరేగిన ఘర్షణ ఇందులో తారస్ధాయినందుకుంది.
వీరభూపతి, కుట్టాన్,మీనాక్షి,ఏకవీరలు ఇందులో ప్రధాన పాత్రలు. వీరి ప్రేమ కథలు,
విరహవేదనలు ఇందులో ప్రధాన వస్తువులు.
ఏకవీర ఇతివృత్తం:
సేతుపతి కుట్టాన్, వీరభూఅప్తి చిన్ననాటి నుంచీ ప్రాణ మిత్రులు. అన్ని విద్యలయందు ఆరితేరినవారు. సమౌజ్జీలు. సేతుపతి సైన్యాద్యక్షుడి కొడుకు.
వీరభూపతి సామాన్యుడు. సేతుపతి మీనాక్షి అనే సామాన్య యువతిని ప్రేమిస్తాడు. ఆమె
కూడా ఇతన్ని ప్రేమిస్తుంది. వీరభూపతి ఏకవీర అనే రాజకుమారిని ప్రేమిస్తాడు. ఆమె
కూడా ఇతన్ని ఇతన్ని ప్రేమిస్తుంది. కానీ పరిస్తితులు అంతస్ధుల అంతరాల వల్ల ఒకరి
చెలియని మరొకరు ఒకరికి తెలియకుండా ఒకరు వివాహము చేసుకోవల్సి వస్తుంది. ప్రేమించిన
వారిని వదలలేక వైవాహిక బంధానికి తలొంచలేక పెద్దలనందరినీ ఎదిరించలేక మనస్సుకు
సర్దిచెప్పుకోలేక నలుగురూ చివరకు మనో సంఘర్షణకు గురౌతారు. ఏకవీర పాత్ర ఆత్మార్పణ
చేసుకుంటుంది.
ఏకవీర – మనో విశ్లేషణాత్మకత:
ధృఢ చిత్తం గలవారు వీరాధివీరులు అన్నింటా జయాపజయాలు తప్ప అపజయాలను చూడని
వారు సేతుపతి, వీరభూపతి. అన్నింటా ప్రతిభావంతులు కానీ జీవితగమనంలో ఓడిపోతారు.తమ
మనసును తామే వంచించుకుంతారు. ఏకవీర పాత్ర ధైర్యం గలది దిట్టమైన గుండె గలది
రహస్యాలు వెల్లడించని స్త్రీ ఏకవీర. పేదవనిత సామాన్యురాలైనప్పటికీ ఆత్మాభిమానం,
అద్వితీయ సౌందర్యం ప్రతిభ గల స్త్రీ మీనాక్షి.
ఈ నాలుగు పాత్రలూ ఇన్నింటా ప్రావీణ్యులు ఓటమినెరుగని వారు జీవితగమనంలో
ఎందుకు ఓడిపోయారనేది ప్రధాన ప్రశ్న. వారి వారి మనస్సును చంపుకోలేక పెద్దవారి మాటను
ఎదిరిమ్చలేని వారిగా ఈ నలుగురి పాత్రలూ కనిపిస్తాయి. వీరి తల్లిదండ్రులు తమ
మూర్ఖత్వం కొద్దీ తమ పంతం నెగ్గించుకుంటారు. అంతిమంగా ఫలితం పొందలేకపోతారు.
ఆత్మవంచన చేసుకులేని, మోసం చెయ్యలేని పాత్రలుగా నలుగురి పాత్రలనూ గొప్పగా
విశ్వనాధగారు తీర్చిదిద్దారు. చదువుకున్న వారు, సకలవిద్యాపారంగతులైనప్పటికీ మనసు
మాటవినలేక, పెద్దలని ఎదిరించలేక జీవనగమనములో ప్రయాణం సాగించలేక ఆత్మవంచన
చేసుకుంటారు. విచక్షణ ఆలోచనలను కోల్పోయిన పాత్రలుగా వీరి పాత్రలు కనిపిస్తాయి.
ఏకవీర పాత్ర అన్ని ఆటుపోట్లనూ ఎదుర్కోలేక రాజీ పడలేక ప్రియుడికీ దూరమై భర్తకూ
దూరమై ఎవ్వరి ప్రేమానురాగాలు పొందకుండా మరణిస్తుంది. చివరిలో ఏకాకిగా మిగిలిన
అనుభూతి కలుగుతుంది. సేతుపతి, ఏకవీర, భూపతి, మీనాక్షిల మానసిక సంఘర్షణలు, మనస్సులో
చెలరేగే ఆలోచనలు, సంక్షోభాలు, వ్యక్తిత్వనిరూపణలు మొదలైనవి పాత్రోచితముగా
సందర్భోచితముగా అద్భుతంగా చూపారు.
గోపీచంద్ – అసమర్ధుని జీవయాత్ర:
జీవితములో ఎన్ని ఉన్నా సుఖానికి విజయానికి వ్యక్తి మనస్తత్వమే అన్నిటికంటే
ముఖ్యము అని నిరూపించిన తొలి నవల ’ అసమర్ధుని జెవయాత్ర. జీవితములో అనేక సమస్యలకు
లోనైన వ్యక్తి జీవితమెందుకు అను మీమాంస ఈ నవల. సీతారామారావు పాత్ర ద్వారా సగటు
మనిషి జీవితము ఎన్ని మానసిక సంఘర్షణలకు లోనవుతుందో ఇందులో గోపీచంద్ వివరీంచారు.
సీతారామారావు పాత్ర అపరదానకర్ణుడిగా, మంచి వ్యక్తిత్వము ఉన్న వాడిగా నవల మొదట్లో
కనిపిస్తుంది. తర్వాత క్రమక్రమముగా అతని పాత్రతీరు ఉచ్చస్ధితికి
కాకుండా నీచస్ధితికి చేరుకోవడాన్ని మనము గమనించావచ్చు. అతని పాత్ర అతని
వ్యక్తిత్వము ఆలోచనలు ఆశయాలు అన్నీ కాలగర్భమునందు మట్టిలో కల్సిపోయాయి. పాఠకుడు
ఇంత అద్భుతంగా ఆలోచించే వ్యక్తి ఇంత మంచి వ్యక్తి నిజాయితీగా దర్మబద్ధంగా ఆలోచించే
వ్యక్తి చివరికి ఎంత గొప్పవాడౌతాడో ఎంతమంది చేత ఆరాధింపబడుతాడో అని ఊహిస్తాడు.
కానీ ముగింపు దానికి పూర్తి విరుద్ధముగా ఉంటుంది ఒక మనస్సు చెపినట్లు వ్యక్తిత్వము నడవడిక తీరు తెన్నులు అనేవి జీవితములో చోటుచేసుకుంటాయి.
ఆత్మవంచన చేసుకుని ధర్మ విరుద్ధంగా సత్యానికి వ్యతిరేకముగా పనులు చేసినప్పుడు
ఎలాంటి ఫలితారు అనుభవించవలసి వస్తుందో ఎన్ని కష్టాలు పడాల్సి వస్తుందో జీవితము ఎంత
నీచస్ధితికి చేరుకుంటుందో అన్న దానికి నిలువెత్తు సాక్ష్యంగా మనకి సీతారామారావు
పాత్ర చిత్రణ, మనస్తత్వము కనిపిస్తుంది.
ధర్మ మార్గములో పేరు ప్రతిష్టలు సాధించి వంశ ప్రతిష్టను నిలబెట్టిన వాడు
సీతారామరావు అయినప్పటికీ మనస్సు ఆలోచనలు పరి పరి విధాల పెడదారి పడుతున్నా వాటిని
అదుపులో ఉంచుకోలేక ఆలోచనలకు తలవంచి జీవితాన్ని కోల్పోయిన పాత్ర ఇతనిది. మనం
జీవితంలో ఏమేమి చేయాలో ఏ విధంగా నడచుకోవాలో అన్న విషయాలన్నిటికీ సీతారామారావు
మనస్తత్వము నిలువెత్తు సాక్ష్యముగా పరిగణించవచ్చు. ఈ ప్రపంచములో నిజముగా సుఖప్డేది
సంతోష పడేది అజ్ఞానే అని భావిస్తాడు. ఆడవాళ్ళు హీనులని భావిస్తాడు. అతిచిన్న
విషయాల గూర్చి అతిగా ఆలోచన చెయ్యడం కోర్కెలకు అతి తీరకపోవడానికి గల కారణాలు,
వాటివల్ల పడుతున్న బాధలకు కారణాలు అని భావించి ఆలోచనలు చెయ్యడం మానేస్తాడు. తనని
తాను అతిగా కష్టపెట్టుకుని భార్యా బిడ్డలను అనవసరంగా తిడుతూ వారి ఆప్యాయతానురాగాలకు
ప్రేమకు దూరమౌతాడు. నిశితముగా దేని గురించి ఆలోచించడు. ప్రయత్నించకుండానే వచ్చి
పడాలని ప్రయత్నిమ్చడము గొప్ప కాదని భావించి దాన్ని ఆచరణలో పెడతాడు. శ్మశానానికి చేరుకుని ఆత్మాన్వేషణ చేసుకుంటాడు.
ఎదిగిన కూతురు సంపాదించి తెచ్చి కుటుంబాన్ని పోషిస్తూ కొడుకుని చదివిస్తూ ఉంటుంది.
అది చూసి కూడా తానుసంపాదించడం మొదలు పెట్టడు.కొడుకు పెళ్ళి చేసుకుని
సంపాదనాపరుడౌతాడు. భార్య ఇందిర పిల్లల బాగోగులు చూసుకుంటూ కాలం వెళ్లదీస్తుంది.
వాళ్ళని చూస్తూ వాళ్ళని సంతోషపెట్టలేకపోయానని బాధపడ్తూ చివరికి చనిపోతాడు.
ముగింపు:
ఈ పాత్రలన్నిటి ద్వారా మనకు అనేక విషయాలు తెలుస్తాయి. మానవులు చేసే పనులు
అన్నిటికీ మనసే ప్రధానము, అది పరిపరి విధాల ఆలోచిస్తుంది. మనస్సు చెప్పిన దాని
ప్రకారమే పాత్ర తీరు, నడవడిక ఆలోచనలు నడుచు కుంటాయి. బుద్ధి ఒకటి చెప్తుంది, మనసు
ఒకటి చెప్తుంది, నడవడిక మరొకటి చెప్తుంది. బుద్ధి, మనస్సు , నడవడిక అన్నీ మన
నియంత్రణలోనే ఉంటాయి. మంచి చెడ్డలను విడదీసుకుని మానవత్వానికి ప్రాధాన్యము
కల్పిస్తూ ధర్మ న్యాయ నీతిబద్ధముగా ఆలోచిస్తూ, సత్యానికి ఎక్కువ ప్రాధాన్యము ఇస్తూ
ఉంటే మన జీవితము పూలబాటలా సాగుతుంది. వీటన్నిటినీ కూడా ఆచరణలో ఎట్టడానికి మనో
నియంత్రణ అతి ముఖ్యము. మనస్తత్వ విశ్లేషణల ద్వారా మాత్రమే మనో పరిణతి
సాధించబడ్తుందని గ్రహించి సాహిత్యములో మనో విశ్లేషణాత్మకతని పరిచయము చేశారు. దీని
ద్వారా ఎట్లా జీవితము మొదలు పెట్టిన వారైనా ఎంత గొప్పవారైనా మనసు అదుపులో
ఉంచుకోనట్లైతే ఎట్లా మారగలరో మనకు నవలలలో పాత్రల ద్వారా రచయితలు నిరూపించారు. ఈ
నవలలలో పాత్రలు అన్నీ మనకు మార్గదర్శకాలు. వీటిలో నిజానిజాలను గ్రహించి మన
జీవితాల్లో అవి జరగకుండా చూసుకుంటూ, వాటిని నిరంతరము గుర్తు చేసుకుంటూ ఉండాలి.
ఆత్మస్థైర్యాన్ని, మనోనిగ్రహాన్ని అలవరుచుకోవాలి. మానసిక విశ్లేషణచేసుకోవాలి. వాటిని జ్ఞప్తికి తెచ్చుకుంటూ జీవనము కొనసాగిస్తే మన జీవితము ఆనందమయము
అవుతుంది.