Sunday, September 8, 2013

నాకు ఇష్టమైన దైవం వినాయకుడు





శుక్లాంబర ధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్సర్వ విఘ్నోప శాంతయే

అగజానన పద్మార్కం గజానన మహర్నిశం
అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నం కురు మే దేవ సర్వ కార్యేషు సర్వద


             మొదటగా వినాయకప్రార్థన చేసిన తరువాత మనం ఏ కార్యం మొదలుపెట్టినా అది నిర్విఘ్నంగా కొనసాగుతుందని లోకోక్తి. నాకు ఊహతెలిసిన తరువాత నేను తెలుసుకున్న తొలి పండుగ వినాయక చవితి. భాద్రపద శుద్ధ చతుర్ధి నాడు పొద్దున్నే లేచి కొత్తబట్టలు వేసుకుని చెట్ల దగ్గరకి వెళ్ళి పూజకు అవసరమైన పత్రిని తీసుకు రావడం, విగ్రహాన్ని తయారు చేయడం, వాటితో పూజ చేయడం, పుస్తకాలకు పసుపు పెట్టడం, ముఖ్యంగా ఉండ్రాళ్ళు పంచిపెట్టడం వంటి ఈ కార్యక్రమాలు నాకు భలే నచ్చేవి.  ఒకసారి వినాయక చవితికి విగ్రహాన్ని చేస్తున్నప్పుడు నాకు ఒక సందేహం కలిగింది.

            వినాయకుడు ఇంతగొప్పవాడు కదా! మరి ఈయనకి ఇటువంటి దేహం ఎందుకు వచ్చిందా అని..?! మరి ఆయన దేవుడు కదా.. మన కోరికలన్నిటినీ తీరుస్తాడంటారు కదా మరి అంతగొప్పవాడైన ఆయన దేహం ఇంత వికృతంగా ఎందుకుందా అని నాకు సందేహం కలిగింది. ఆయన ఎందుకు అందంగా లేడని బాధ కలిగింది. దేవుళ్ళందరిలోకి అత్యంత అందగాడు, తెలివి తేటలు గలవాడు, మేధోశాలి ఈయనే అన్న విషయం చాలాకాలం తర్వాత నాకు బోధపడింది.

                        వినాయకవ్రత కథ తెలుసుకున్నప్పుడు ఆ కథ నిజం కాదేమో కల్పించి చెప్పినదేమో అనిపించింది. ఒకసారి నేను అప్పుడే పుట్టిన ఒక పిల్లవాడిని చూశాను. ఆ పిల్లవాడు కూడా కొంత వినాయకుని పోలికలతో ఉన్నాడు. వికృతంగా ఉన్నది మొహమంతా. కొంతమంది ఆ పిల్లవాడిని అసహ్యించుకోసాగారు. నాకా పిల్లవాని మొహంలో వినాయకుడు కనిపించాడు. అప్పుడు నాకు,  ఇంతచిన్నవయసులోనే ఈ పిల్లవాడు ఇన్ని అవమానాలు పొందుతుంటే, అంత కాలం ఆ వినాయకులవారు ఇంకెన్ని అవమానాలు పొందారో అనిపించింది. అవన్నీ తట్టుకుని కూడా ఎంత గుండె నిబ్బరంతో ఉన్నారో అనిపించింది. ఇంతటి ఆకారంతో ఉండి ఆ స్వామివారు ఇన్ని విజయాలు సాధిస్తే అన్నీ సక్రమంగా ఉన్న మానవులు ఇంకెన్ని విజయాలు సాధించగలరో అనిపించింది.
            వినాయకుడు లోకంలోని దేవతాగణములకు అధిపతి గా ఖ్యాతినొందాడు. విఘ్నాలను తొలగించి తలపెట్టిన కార్యాలను నిర్విఘ్నంగా పూర్తిచేయించేవాడు. విజయానికీ, చదువులకూ, జ్ఞానానికీ మార్గదర్శిగా నిలుచువాడు. వినాయకుని భారీ కాయం, ఉదరం సమస్త జగత్తుకు ప్రతీక. ఆయన నయనాలు, శిరస్సు మేధోశక్తిని చిహ్నాలు. ఆయన వక్రతుండము’ "ఓం"కారనాదానికి మూలముగా చెప్పేవారట. ఉదరబంధనంగా విలసిల్లు నాగబంధనము శక్తి, సామర్ధ్యాలకు ప్రతీక. ఆయన ఆయుధాలు ఆయన ఆలోచనలు అన్నీ మన బుద్ధి మనసులకు సన్మార్గబోధన చేసే సాధనాలు. వ్యాసభగవానుడు భారతరచనకు సంకల్పించినపుడు వినాయకులవారు వారి దంతాన్ని విరిచి కలంగా ఇచ్చారని ప్రతీతి. గణాధ్యక్షునిగా ప్రసిద్ధిచెందినవారు. దేవతల చేత కూడా ప్రధమపూజలు అందుకునేవారు. తాండవనృత్యకళాకారుడు  కూడా.

            ఇన్నిరకాలైన ప్రఖ్యాతులు గణేశుని సొంతం. ఈశరీరంతో ఇంత పేరుప్రఖ్యాతులు సాధించిన గణేశుని చూసినతరువాత ఆయనను గురించి తెలుసుకున్న తరువాత ఆయనపై భక్తి పెరిగింది. వినాయకచవితినాడు మనం గణేశుని తలుచుకుని ఏదైనా కార్యసాధనకు పూనుకుంటే ఆకార్యం నిర్విఘ్నంగా కొనసాగుతుందని లోకోక్తి. ఇన్ని విషయాలు తెలుసుకున్న తరువాత నాకు ఒక ఆలోచన కలిగింది. మనం దేవతలను, దేవుళ్ళను చూసి వారి కథలను చదివి తెలుసుకోవలసిన విషయాలు అనేకం ఉన్నాయేమో అనిపించింది. మనకి అనేకమంది ఈ ప్రార్ధన ఇన్ని సార్లు చదువు అంటారు కానీ ఎందుకో చెప్పరు. అది అన్ని సార్లు చదివితే ఒక్కసారైనా అది మన మస్తిష్కాన్ని తాకుతుందేమో అని అన్నిసార్లు చెప్పారేమో అన్నది నా అభిప్రాయం. మనం దేవతలను గూర్చి తెలుసుకుని వారి కథలను చదివి, వారి వ్యక్తిత్వము గురించి తెలుసుకుని స్పూర్తి పొందాలి కానీ వారిని కోరికలు కోరరాదేమో అనిపించింది. దేవతలుగా కీర్తింపబడినవారందరూ వారివారి విషయాలలో ప్రావీణ్యులు. ఒక్కవినాయకుల విషయంలోనే మనకు ఇన్ని విషయాలు తెలిస్తే ఇంక తక్కిన దేవుళ్ళను గురించి తెలుసుకుంటే ఇంకెన్ని విషయాలు అవగతమవుతాయో అనిపించింది. మనం దేవుళ్ళను కోరికలు తీర్చమని కాక వారి జ్ఞానానికి, వారు ఈ రోజు ఈ స్థితిలో ఉండటానికి గల కారణాల్ని తెలుసుకుని వాటి సాధనకు పూనుకుంటే, వారి వ్యక్తిత్వ సాధనే మన ధ్యేయంగా మార్చుకుంటే మనం ఇంకా ఉన్నతస్థితిని సాధించడంతో పాటు దేవుళ్ళ అనుగ్రహంతో పాటుగా మోక్షాన్ని సాధించగలమేమో అనిపించింది. 
 
            ఆవినాయకులవారు మీకందరికీ విజయాలకీ, విద్యలకూ, జ్ఞానానికీ మార్గదర్శిగా నిలవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
 
            అందరికీ వినాయకచవితి శుభాకాంక్షలు.
 
 
గమనిక. ఎవరి మనోభావాలను అయినా దెబ్బతీసి ఉంటే మన్నించమని ప్రార్ధన.












Thursday, April 11, 2013

శ్రీ ’విజయ’ నామ సంవత్సర యుగాది శుభాకాంక్షలు..




ఉగాది








ఉగాదిని చైత్ర మాసంలోనే జరుపుకోవడానికి గల కారణాలు:

''ఉగ'' అంటే నక్షత్ర నడక అని, ''ఆది'' అంటే మొదలు అని అర్ధం. సృష్టి ఆరంభం లేదా కాలం మొదలవడాన్ని ''ఉగాది'' అన్నారు. మరోరకంగా చూస్తే ''యుగం'' అంటే రెండు అనే అర్ధం ఉంది. అంటే ఒకటి కాలం, రెండోది గ్రహాలు. కాలం రాశులలో ప్రవేశించడాన్ని బట్టి ''యుగము'' అన్నారు. ''యుగం'' ప్రారంభమైన రోజు కనుక ''యుగాది'' అన్నారు. అదే క్రమంగా ''ఉగాది'' అయింది. చైత్ర శుద్ధ పాడ్యమి చాంద్రమాన ఉగాది లేదా యుగాది పండుగ.
అసలు చైత్ర మాసానికి ఆ పేరు ఎందుకు వచ్చిందో చూద్దాం.పౌర్ణమినాడు చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రం పేరు ఆ మాసానికి వస్తుంది. ఈ పౌర్ణమి నాడు చంద్రుడు ''చిత్రా'' నక్షత్రంలో (దీన్నే చిత్తా నక్షత్రం అంటాం) ఉండటంవల్ల ఈ నెలకు ''చైత్రమాసం'' అనే పేరు వచ్చింది.
ఉగాదిని చైత్రమాసంలోనే ఎందుకు జరుపుకోవాలి? ఇతర నెలల్లో కూడా చంద్రుడు ఇతర నక్షత్రాలతో కూడి ఉంటాడు కదా.. మరి ఇతర నెలల్లో ఎందుకు జరుపుకోవడంలేదు? విఘ్నాలను తొలగించే వినాయకుని పండుగ వచ్చేది భాద్రపదమాసంలో. మరి భాద్రపదమాసం కంటే ఉత్క్రుష్టమైన నెల ఎదుంటుంది? ఆ నెలలో ఎందుకు ఉగాది జరుపుకోవడంలేదు? ముఖ్యంగా అన్ని నెలల్లోకెళ్ళా శ్రేష్ఠమైంది మార్గశిర మాసం. ''మాసానాం మార్గశీర్షోహం'' అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఉపదేశించాడు. అవును, లోకకళ్యాణార్ధం కృష్ణుడు గీతోపదేశం చేసింది మార్గశిరంలోనే. మరి అంట ఉత్తమమైన మార్గశిర శుద్ధ పాడ్యమి ఉగాది ఎందుకు కాలేదు? ఇక ఆశ్వయుజ మాసం కూడా ఘనమైందే. ఆశ్వయుజంలో అత్యంత ఉత్సాహంతో, భక్తిశ్రద్ధలతో , లక్ష్మీ, సరస్వతి, కనకదుర్గాదేవిల పూజలు నిర్వహిస్తాం. మనకు చాలా అవసరమైన చదువు, తెలివి డబ్బు, ధైర్యం అన్నిటినీ ప్రసాదించే దేవతల పూజలు నిర్వహించేది ఈ నెలలోనే. విజయదశమి పర్వదినం నాడు జైత్రయాత్రకు సన్నాహాలు జరుగుతాయి. పోనీ శ్రీరామనవమి, శ్రీకృష్ణ జన్మాష్టమి వచ్చే నెలలు ఎలా చూసినా పవిత్రమైనవే కదా! ఆ నెలల్లో ఎందుకు సంవత్సరాదిని చేసుకోము? చాతుర్మాసం మొదలయ్యే ఆషాఢంలోనో, ఉత్థాన ద్వాదశి వచ్చే కార్తీకమాసంలోలోనో ఉగాది ఎందుకు జరుపుకోము? ఇలా చూస్తే పన్నెండు నెలల్లో ఏడాది పొడుగునా అనేక ప్రత్యేకతలు, పర్వదినాలు ఉన్నాయి. కానీ వాటన్నిటినీ వదిలి చైత్ర శుద్ధ పాడ్యమినే ఉగాదిగా, సంవత్సరాదిగా జరుపుకుంటున్నాం..

చైత్ర శుద్ధ పాడ్యమినే కొత్త సంవత్సరంగా అంగీకరించడానికి, వేడుక చేసుకోడానికి కారణం ఋతువులు. నెలల కంటే ఋతువులు ప్రధానమైనవి.చైత్రమాసానికి శిశిర ఋతువు పోయి వసంత ఋతువు... అంటే చలికాలం పోయి వేసవికాలం వస్తుంది. ఆకులు రాలే కాలం అయిపోయి చెట్లు చిగుర్చి పూత పూస్తాయి. మల్లెలు గుబాళిస్తాయి.పక్షుల ఈకలు ఊడి కొత్తవి వస్తాయి. మనకు కూడా అప్పటిదాకా చర్మం పొడివారడం, పగుళ్ళు, పొట్టు ఊడటం లాంటి సమస్యలు పోయి కొత్త చర్మం వస్తుంది. ఈ నెలతో చెట్లు చిగురించడం మొదలై పూత, పిందెలు, పండ్లు - ఇలా అంతా లబ్దికరంగా సాగుతుంది. శరీరంలో పైకి కనిపించే మార్పులే కాదు.. మానసికంగా కూడా చైత్రమాసం నుండి ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటుంది. చలికాలంలో, వర్షాకాలంలో ఉండే మండగోడితనం వసంతఋతువు నుండి ఉండదు. ఒకవిధమైన చురుకుదనం ప్రవేశిస్తుంది. ఈ కారణంగానే చైత్రమాసంలో ఉగాదిని జరుపుకుంటాం.


ఉగాదిరోజున చేయవలసిన పనులు:

"నూతన సంవత్సర కీర్తనాత్ ప్రారంభః ప్రతి గృహ ధ్వజారోహణం 
నింబ పత్రాశనం సంవత్సర పంచాంగ శ్రవణం నవరాత్రారంభః"

సంవత్సరాదిని అంటే కొత్త సంవత్సరాన్ని కీర్తిస్తూ తలస్నానం చేయడంతో దినచర్య మొదలౌతుంది.ధ్వజారోహణం చేయాలి. కొన్ని వేపాకులు నమలాలి. వేపపూత కలిపి చేసిన ఉగాది పచ్చడి తినాలి.కొత్త దుస్తులు ధరించి నిత్యకర్మ పూర్తి చేసుకుని పంచభక్ష్య పరమాన్నాలతో భోజనం చేసి పంచాంగ శ్రవణం చేయాలి. ఉగాది నుండి వసంత నవరాత్రులు ప్రారంభమౌతాయి.

ఉగాది పచ్చడి తినడంవల్ల కలిగే ప్రయోజనాలు:

"శతాయుష్యం వజ్రదేహం దదాత్యర్ధం సుఖానిచ
సర్వారిష్ట వినాశనం చ నింబ కందళ భక్షణం"

వేపపూత, బెల్లం తినడం వల్ల శరీరం వజ్రంలా గట్టిపడుతుంది. సర్వసంపదలు వస్తాయి. ఎలాంటి కష్టాలైనా తీరిపోతాయి.
శాస్త్రం ప్రకారం చూస్తే చైత్ర మాసంలో భూమి సూర్యునికి చాలా దగ్గరగా ఉంటుంది. కనుకనే గ్రీష్మ తాపం ఎక్కువగా ఉంటుంది. ఈ వేడివల్ల కొన్ని రకాల వ్యాధులు రావడానికి, ప్రబలడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఈ ఉపద్రవాన్ని నివారించడానికి వేపపూత, బెల్లం తోడ్పడతాయి.
అనేక పురాణ కథల్లో ఉగాది ప్రస్తావన కనిపిస్తుంది. విష్ణుమూర్తి మత్స్యావతారం ఎత్తింది చైత్ర శుద్ధపాడ్యమి నాడే. సోమకుడు వేదాలను దొంగిలించగా వాటిని తీసుకొచ్చి బ్రహ్మదేవునికి అప్పగించేందుకు విష్ణుమూర్తి మత్స్యావతారం ఎత్తాడు. మహా విష్ణువును స్మరించుకుని ధ్యానించుకునే నిమిత్తమే ఉగాది పండుగ ప్రారంభమైంది.

చరిత్రలో అత్యంత పరాక్రమశాలి విక్రమార్కుడు. ఆ తేజోవంతుడైన విక్రమార్క చక్రవర్తి పట్టాభిషిక్తుడయ్యాడయ్యింది చైత్ర శుద్ధ పాద్యమినాడే. కనుకనే ఉగాదినాడు విక్రమార్కుని స్మరించుకుని ఉత్సాహం పొందుతారు.



షణ్ముఖం ద్వాదశ భుజం వ్యాఘ్రవాహన మాశ్రితమ్ !

వ్యాఘ్ర చర్మాంబరం వందే ఖగం విజయ సంజ్ఞకం !!

మిత్రులందరికీ 

శ్రీ విజయ నామ సంవత్సర యుగాది 

శుభాకాంక్షలు..


నవవర్షస్య శుభాశయా:









Tuesday, April 2, 2013

అందం

అందం.....


ఈ ప్రపంచంలో ప్రతి జీవికీ అందం అనేది సహజంగా వచ్చేస్తుంది.... ఈ రంగులను, ఈ రంగు రంగులతో కూడిన అందమైన పూలను, పళ్లను, పక్షులను, వాటినన్నిటినీ తనలో ఇముడ్చుకున్న ఈ ప్రకృతిని ఎవరు సృష్టించారో తెలీదు.. 

కొందరు భగవంతుడంతారు.. కొందరు ప్రకృతే సృష్టించింది అంటారు..

కానీ ఈ ప్రకృతిలో జీవ రాసులన్నిటిలోనో ఉన్న ఒకే ఒక్క తేడా ఆడ మగ...

మనము ఎన్ని తేడాలు ఏర్పరుచుకున్నప్పటికీ..  దేవుడు సృష్టించిన తేడా ఇదేనేమో... ( నాకు ఇంతకన్న తేడాలు ఏమున్నాయో తెలీదు మరి)
ఈ అందం అనే ఆలోచన మనిషికి వచ్చిందేనేమో.. లేకపోతే ఈ ఒక్క చిన్న విషయాన్ని గురించి ఆలోచిస్తూ ఎంతో మంది ఆత్మ విశ్వాసాన్ని కోల్పోతున్నారు.. ఎందరో తాము అందంగా లేమని పక్క వారితో పోల్చుకుని  భాదలు పడుతున్నారు..  మరి కొందరు అందాన్ని ఇనుమడించుకోవాలని తాము సంపాదించిన దానిని అంతా బ్యూటీ పార్లర్లకు సమర్పించు కుంటున్నారు....

మగ వారి సంగతి ఏమో గానీ ఆడవాళ్ళు మాత్రం అందం అనే విషయానికి అధిక ప్రాముఖ్యతని ఇస్తున్నారు...

అందుకేనేమో ఆడవాళ్ళ మీద వారి అందం మీద, వారు తయారు అవడానికి పట్టే సమయం మీద అనేక రకాల జోకులు పుట్టుకొచ్చాయి.

నిజానికి ఆడవాళ్ళు అందంగా ఉండరని ఎండలో కాసేపు పనిచేస్తే వారి అందం తరిగిపోతుందని అనేక మంది చెబుతుంటారు. 

అది నిజమే ననడానికి కొన్ని ఆధారాలు కూడా లేకపోలేదు. సృష్టిలో అందం అని చెప్పుకునే లక్షణాలన్నీ మగజాతికే ఉన్నాయి. ఉదాహరణకి మగ కోయిలే పాడుతుంది, మగ నెమలే పురి విప్పి నాట్యం చేస్తుంది, మగ సింహానికే జూలు ఉంటుంది, ఇలా చాలా ఉదాహరణలు ఉన్నాయి. 


        


కానీ మగ జాతికి అంత అందం ఎక్కడ నుంచి వచ్చిందంటారా??!!

అవన్నీ ఆడవారి రక్తమాంసాలతో తయారైన దేహాలు కదండీ.. అందుకే అంత అందం..

ఆడవారి అందం అంతా దేవుడు మగవారికి ఇచ్చేసి ఆడవారికి ’ మాతృత్వం’ అనే అందాన్ని ప్రసాదించాడు. దీనికి సంబంధించి ఒక కధ కూడా ఉందండీ.. ఒక సారి దేవుడు ఆడవాళ్లని అడిగాడట.. మీకు అందం కావాలా మాతృత్వం( తల్లి ప్రేమ ) కావాలా అని?! ఆడవాళ్ళు మాతృత్వం కావాలని కోరుకున్నారట. అంచేత ఆడవాళ్ళు తాము అందంగా లేమని బాధపడనక్కరలేదు, కృత్రిమ అందం కోసం తాపత్రయపడనక్కరలేదు.. ఎందుకంటే ఆడవారికి మాతృత్వమే ఎన్నటికీ తరగని అద్భుతమైన అందం.





 ఈ సోది అంతా ఎందుకు అంటారా?! నా చుట్టు ప్రక్కల అనేక మంది ఆడవాళ్ళు తాము అందంగా ఉండమని అనేకరకాల పయత్నాలు చేయడం చూసాను. ఒకళ్ళైతే ఫ్లాస్టిక్ సర్జరీ వరకూ వెళ్ళారు. ఇవన్నీ చూశాక నిజంగా అందానికి జీవితంలో అంత ప్రాధాన్యం ఉందా అనిపించింది. తల్లి ఇచ్చే పాలల్లో పిల్లలని అంత అందంగా మార్చే గుణమున్నదా అనిపించింది. అందం కన్నా మధురమైన మాతృత్వం ఆడవాళ్లకు వరంగా ఉండగా బాహ్య సౌందర్యం కోసం ప్రాకులాడటం మంచిది కాదేమో అనిపించింది.బాహ్య సౌందర్యం కన్నా అంతఃసౌందర్యం గొప్పది కదా...  నా అభిప్రాయాలు మీతో పంచుకోవాలని ఇలా రాసున్నాను. ఎవరి మనోభావాలయినా దెబ్బతిని ఉంటే మన్నించమని కోరుకుంటున్నాను.







Thursday, February 7, 2013

వివాహ చిహ్నములు-ప్రాముఖ్యత

వివాహ చిహ్నములు-ప్రాముఖ్యత:

                             శరీరము మనుగడకు ఆత్మ ఎంత అవసరమో, ఆత్మ మనుగడకు శరీరము అంతే అవసరము. ఈ విశ్వం లోని చరాచర సృష్టి అంతా  స్త్రీ పురుష ప్రకృతులుగా రూపు దాల్చి జీవిస్తోంది. విడివిడిగా జన్మించి కలిసి మనుగడ సాగిస్తోంది. ఎక్కడో మహా యోగులైన పురుషులను మినహాయిస్తే స్త్రీ, పురుషులు ఇద్దరూ ఒకరు లేకుండా ఇంకొకరు పరిపూర్ణ వంతులు కాలేరు. అందుకే ఆ ఇద్దరినీ కలిపి సంపూర్ణవంతులు అవ్వడం కోసం వారి బంధాన్ని పరిపూర్ణ బంధంగా మార్చే ధర్మకార్యం “వివాహము”.  ఈ వివాహము అనే కార్యము ఇద్దరు వ్యక్తులనే కాకుండా రెండు కుటుంబాలను కూడా కలుపుతుంది. స్త్రీ పురుషుల  ఇద్దరి జీవితాలలోనూ భౌతికముగా, అంతర్ముఖంగా అనేక మార్పులను తీసుకు వస్తుంది.
                             బయట నుంచి  చూస్తే వివాహం, వైవాహిక బంధం పురుషునిలో కన్నా స్త్రీలోనే ఎక్కువ మార్పులను తీసుకొస్తుంది. వస్త్రధారణ,అలంకరణలో అనేక ప్రత్యేకమైన మార్పులకు లోనౌతుంది. అనేక పరిధులు, పరిమితులు ఏర్పడతాయి. ఇదంతా స్త్రీలకు మాత్రమే మారుతుంది. వివాహమైన పురుషునిలో సాధారణంగా ఎటువంటి మార్పు కంటికి కనబడదు. కానీ వివాహమైన స్త్రీకి మాత్రం అనేక ఆభరణాలు వైవాహిక చిహ్నాలుగా చేరి ఆమె వివాహవతి అన్న విషయాన్ని ప్రపంచానికి  తెలియచేస్తాయి.ఇక్కడ ప్రపంచానికి తెలియ జేస్తాయి అంటే పురుష ప్రపంచానికి తెలియజేస్తాయి అనే.. వీటన్నిటివలనా ఆ స్త్రీ సుమంగళి అనీ, సౌభాగ్యవతి అనీ , పరస్త్రీ అని వ్యవహరించబడుతుంది.
            ప్రకృతిలో స్త్రీ పురుషులు ఇద్దరూ సమానులు అయినప్పుడు ఈ వివాహ చిహ్నాలను స్త్రీలు మాత్రమే ధరించడం లోని అంతరార్ధం స్త్రీ స్వేచ్చను హరించడం కాదా? స్త్రీని తొక్కివేయడం కాదా? ఇది అతి సున్నితమైన, అతి ముఖ్యమైన, అత్యంత ఆసక్తికరమైన విషయం. వివాహ చిహ్నాలను ధరించడం ఒక్క హైందవ మతంలోనే కాదు, ప్రపంచంలో ఏ వివాహ పద్ధతి చూసినా స్త్రీలు మాత్రమే ఈ చిహ్నాలను ధరించడం చూడవచ్చు.
                  కొన్ని మతాచారాలలో స్త్రీలకు పుట్టుకతోనే నుదుటన కుంకుమ ధరించడం, గాజులు ధరించడం మొదలౌతుంది. కానీ కొన్ని మతాలలో వివాహ సందర్భంలో భర్త భార్య నుదుటన, పాపిటలో పెట్టిన కుంకుమే ఆమె వివాహ బంధంలో ఉన్నది అన్న విషయాన్ని తెలుపుతుంది.
                    స్త్రీ వివాహిత అని తెలుపు చిహ్నాలలో ముఖ్యమైనవి తాళిబొట్టు(మాంగల్యము), పసుపు కుంకుమలు  గాజులు, మెట్టెలు(మట్టెలు), ముక్కుపుడక(అడ్డు బాస), కళ్యాణం ఉంగరం మొదలయినవి.

తాళిబొట్టు

                             స్త్రీకి వివాహమయిన తరువాత తప్పనిసరిగా ధరించే చిహ్నాలలో మొదటిది తాళిబొట్టు.దీనికే మంగళ సూత్రము, పుస్తెల తాడు అని నామాంతరాలు ఉన్నాయి. స్త్రీ కి వివాహ సమయములో రెండు మంగళసూత్రాలను (అత్తింటి వారిది ఒకటి, పుట్టింటి వారిది ఒకటి) గౌరీదేవి వద్ద పూజ చేయించి, పురుషుని చేత స్త్రీ మెడలో కట్టిస్తారు. పుట్టినింటికీ, మెట్టినింటికీ మధ్య వారధిలా నిలిచి, రెండు కుటుంబాల పేరు ప్రతిష్టలనీ,సంస్కృతీ సంప్రదాయాలనీ నిలబెట్టడానికి కృషి చేయమని సూచించడం మాంగల్య ధారణలో గల అంతరార్ధం.
                  ఈ రెండు సూత్రాలను ఎంత బీదవారయినా తప్పనిసరిగా బంగారముతోనే చేయిస్తారు. ఎందుకనగా బంగారము కుజగ్రహానికి చెప్పబడిన లోహము. కుజుడు అగ్ని. ఉష్ణాన్ని నియంత్రించడంలో బంగారము సాయపడుతుంది. శరీరము నందు ఉత్పన్నమయ్యే ఉష్ణ శక్తికి నియంత్రించి శరీరాన్ని ఆధీనములోకి తెచ్చే శక్తి బంగారానికి కలదు. అలాగే ఇది గర్భోత్పత్తికి సహాయకారిగా ఉండి, వంధ్యత్వమును పోగొట్టడంలో సహాయపడుతుంది. అందుకనే స్త్రీల ఒంటి మీద మాత్రమే ఎక్కువగా బంగారు ఆభరణాలు ధరింపజేస్తారు. “ అమృతం వైహిరణ్యం”, “ఆయుష్యం వర్చస్యగ్” అనే వివాహ మంత్రంలోనూ ఆయుష్షు పెంచుతుందని చెప్తూ దీన్ని ధరింపజేస్తారు.
కుంకుమ

                  స్త్రీలు మాత్రమే తప్పనిసరిగా కుంకుమ ధరించాలని ఉన్న నియమము ఈ నాటిది కాదు.హైందవ మతములో ప్రాచీనకాలము నుండి సంప్రదాయముగా వస్తున్నది. వివాహము అయిన స్త్రీలకూ కుంకుమ అతి ముఖ్యమయిన ఆభరణం. ప్రతి స్త్రీ దీనిని తప్పని సరిగా ధరిస్తుంది.కొన్ని కుటుంబాలలో కుంకుమ మాత్రమే ఆ స్త్రీ వివాహవతి అని చెప్పడానికి గుర్తు. వివాహానికి ముందు నుదుటన మాత్రమే ధరించే స్త్రీలు, వివాహము తరువాత పాపిటన కూడా ధరిస్తారు.కుంకుమ బొట్టును లక్ష్మీదేవిగా భావిస్తారు. ముఖాన గనుక సింధూరం  ఉంటేదృష్టి సోకదని, చెప్తారు. నుదుట తిలకం లేకపోతే ముఖం కళ తప్పి బోసిగా ఉండటమే కాదు, మంచిది కాదని పండితులు ఉద్బోధించారు. కనుక కుంకుమ కేవలం సౌందర్య చిహ్నం కాదని, మానవుల దృష్టి సోకకుండా ఉంటుందని అంటారు.
                  కుంకుమ లేదా తిలకం ఎర్రగా ఉంటుంది. ఎరుపు సూర్యునికి సంకేతం. నుదుట ధరించే సింధూరం సూర్యుని వేడిమి తాకకుండా చేస్తుంది. ఇంకా, శరీరంలోని అన్ని నాడులనూ కలుపుతూ, మెదడుకు సంకేతస్థానమై, ఎప్పుడూ చైతన్యంగా ఉండే అతి కీలకమైన “సుషుమ్న” నాడి ఉండేది లలాటం మీదనే. దాన్నే “జ్ఞాననేత్రం” అంటారు. ఈ జ్ఞాననేత్రానికి ఇతరుల దృష్టి సోకకుండా, సూర్యతాపం దానిమీద పడకుండా చేసేందుకు సిందూరం పెట్టుకునే ఆచారం జనించింది. అంటే రక్త ప్రసరణ వల్ల, ఆలోచనల వెల్లువ వల్ల కలిగే వేడి జ్ఞాననేత్రానికి తగలకుండా అది సురక్షితంగా ఉండేందుకు గానూ ఎప్పుడూ కుంకుమ ధరించి ఉండాలి అన్నారు.

 ఉంగరం ప్రత్యేకత:

                  కొన్ని మతాలలో వివాహ చిహ్నముగా ఉంగరమును ధరించడం ఆచారముగా ఉన్నది. ఈ ఉంగరమును స్త్రీలు వారి  ఎడమచేతి చిటికెనవేలు పక్కనున్న నాలుగవవేలుకు పెట్టుకుంటారు. ఎందుకంటే ఆ వేలు నుండి ఒక రక్త నాళము తిన్నగా హృదయానికి పోవును. అందుకే ఈ వేలుని “ఉంగరము వేలు” , “అనామిక” అని కూడా వ్యవహరిస్తారు. దీనిని ధరించడం వలన ఇక్కడ చర్మానికి స్పర్శ కలిగి హృదయం మన ఆధీనములో నియంత్రణ కలిగి ఉంటుంది. అందువలన ఉంగరమును ఆ వేలుకు మాత్రమే ధరింపజేయడం ఆచారముగా కొనసాగుతున్నది.

ముక్కుపుడక ప్రత్యేకత:

                  కొన్ని మతాలలో ముక్కుపుడకని వివాహ సందర్భంలో స్త్రీకి ధరింపజేయడం అనే ఆచారము ఉన్నది. ముక్కుపుడకకి అడ్డు బాస,ముక్కెర, అని నామాంతరాలు ఉన్నాయి. భాషని అడ్డగించడానికి దోహదపడేది కనుక దీనికి “అడ్డు బాస” అనే పేరు వచ్చింది. మాట్లాడేటపుడు ముక్కుకు రాపిడి జరిగి అడ్డంగా ఉండి మితంగా మాట్లాడమని హెచ్చరిస్తూ ఉంటుంది. స్త్రీలకి వివాహం తర్వాత ఇంటి బాధ్యతలు వస్తాయి. ఆ బాధ్యతలలో వచ్చే దోషాలను పోగొట్టడానికి కూడా ఇది సహాయకారిగా వ్యవహరిస్తుంది. ఇది కూడా బంగారపులోహంతో తయారయినటువంటిదే.అలంకారంగా స్థిరపడిన ముక్కెరను  కాబోయే భర్త మాత్రమే బహూకరించడం అనేది ప్రాచీన కాలంనుంచీ వస్తున్న సాంప్రదాయం.
                                    తాళిబొట్టు మాదిరిగానే వివాహసమయంలో ధరించిన ముక్కుపుడకను జీవితాంతం కొందరు తీయరు. అది ఉన్నంతకాలం భర్త క్షేమంగా ఉంటాడన్నది వారి నమ్మకం. అందుకే దీన్ని  సౌభాగ్యానికి సంకేతంగా చెబుతారు. ఎంత పేదవారైనా దీనిని మాత్రం బంగారంతోనే చేయించుకుంటారు. దక్షిణ భారతదేశంలో దీన్ని ఎక్కువగా కుడివైపు పెడితే, ఉత్తరాదిన మాత్రం ఎడమవైపు పెడుతుంటారు. ఈ ప్రస్తుతకాలంలో కూడా పెద్ద ముత్యపు ముక్కెరను( నాత్) మరాఠీ మహిళలు చాలా ఇష్టంగా ధరిస్తారు. కొందరిలో ఇది దాదాపు గడ్డం వరకు వస్తుంది. ఇప్పటికీ కొందరు ఆదివాసులలో పెద్దవైన బులాకీలు వాడతారు.

కాలిమట్టెలు-ప్రత్యేకత:

                 స్త్రీకి వివాహము అయిన తరువాత ధరించే వాటిలో అతి ముఖ్యమయినవిగా కాలి మట్టెల గురించి చెప్పుకోవచ్చు. గర్భకోశములో ఉన్న నరాలకు కాలి వేళ్ళకు సంబంధము ఉన్నది. స్త్రీత్వము నకు భంగము కలుగ కుండా ఉండాలంటే స్త్రీలు కాలికి మట్టెలు పెట్టుకోవాలని పురాణాలు చెపుతున్నాయి.                            
స్త్రీలు పురుషులకన్నా అధికులు అని చెప్పినట్టి పద్యం.
స్త్రీణాం ద్విగుణమాహారం బుద్ధిశ్యాపి చతుర్గుణమ్
సాహసం షడ్గుణం చైవ, కామోష్ట్య గుణి ముచ్యతే.
           భావం: పురుషులకంటే స్త్రీలకు  ఆహారం రెండు రెట్లు, బుద్ధి నాలుగు రెట్లు, సాహసం ఆరు రెట్లు, కామం ఎనిమిది రెట్లు ఎక్కువగా ఉంటుంది అని అర్ధం.
                             కామ,క్రోధములను నియంత్రించడానికి వీటిని ధరించడం అవసరము అని శాస్త్రాలు చెపుతున్నాయి. వీటిని ధరించడం వలన కాలివేళ్ళ మధ్య ఒరిపిడి జరిగి కోరికలను నియంత్రించడానికి సహాయపడుతుంది. సన్యాసులు పావుకోళ్ళను ధరించడంలో పరమార్ధం కూడా కోరికల నియంత్రణ కోసమే. కోరికలను అదుపులో ఉంచే నరము కాలి బొటనవేలుకు పక్కనున్న రెండవ వేలుకు సంబంధించి ఉంటుంది. ఈ రెండు వేళ్ళకు ఒత్తిడి కల్గడం కోసం సన్యాసులు పావుకోళ్ళను వేసుకుంటారు. స్త్రీలకు పూర్తిగా కోరికలను నాశనము చెయ్యడం ప్రకృతి విరుద్ధం కనుక ,పురుషులతో సమానంగా ఉండటం కోసం బొటన వేలు పక్కనున్న వేలుకు వెండి తో చేసిన మట్టెలను ధరింపజేస్తారు. ఇది కూడా దేహములో ఉష్ణాన్ని తగ్గించడంలో సహాయపడ్తుంది. వీటిని వివాహ సమయములో కొందరు అత్తగారి చేత పెట్టిస్తే, కొందరు భర్త చేత పెట్టిస్తారు. 
                              అలాగే ఈ చిహ్నాల గొప్పదనము ధరించిన వారికీ, ధరించని వారికీ మధ్య గల వ్యత్యాసాలు పరిశీలించినపుడు వాటి ఆవశ్యకత తెలుస్తుంది. ఇవి అలంకారాలు మాత్రమే కాక స్త్రీలలో వచ్చే కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు,ఒత్తిడులను తగ్గించడంలో, ఉష్ణాన్ని నియంత్రించడంలో సహాయకారిగా పనిచేస్తాయి.

గాజుల ప్రత్యేకత:

                రంగు రంగుల గాజులు మనకు అలంకరణ వస్తువులుగా, ఆభరణాలుగా మాత్రమే తెలుసు. చేతినిండా బంగారు గాజులు ధరించి, వాటిని ఆస్తిగా పరిగణిస్తాం. పూర్వపు రోజుల్లో భార్య చేతికి ఎన్ని బంగారు గాజులు ఉంటే అంత సంపాదనా పరుడిగా భర్తని లెక్కకట్టేవారట. అయితే గాజులు ధరించడం అనే ఆచారం ఎందుకు వచ్చిందో తెలుసా? గర్భాశయ నాడులను ఉద్దీపనం చేయడానికి ఉద్దేశించినవే గాజులు. మహిళలకు మణికట్టుకు ముంజేతికి మధ్య ఉండే నాడులు గర్భాశయ నాడులతో అనుసంధానమై ఉంటాయి. మణికట్టు నాడులు స్వల్పంగా ఒత్తిడికి లోనవుతుంటే, గర్భాశయ నాడులు కూడా అందుకు అనుగుణంగా ఉత్తేజితమవుతుంటాయి. దాంతో గర్భాశయం పనితీరు, కండరాల కదలికలు సవ్యంగా జరుగుతుంటాయి.ఇందుకు తప్పనిసరిగా గాజులనే ధరించాలా? ప్రత్యామ్నాయం లేదా అంటే... ఉంది. రోజూ కొంతసేపు మణికట్టు-ముంజేతి మధ్య చేత్తో నొక్కుకోవచ్చు. అలాగని మర్దన చేసినంత ఒత్తిడి పడకూడదు.
                అలాగే ఈ వివాహ చిహ్నాలను ధరించడం అనేది ఈనాడు వచ్చిన సంప్రదాయం కాదు, ప్రాచీన కాలము నాటిది. ఈ ఆచారాలు ధర్మ బద్ధమయినవి, మానవులకు మేలు చేసేవి కనుకనే కొన్ని వేలయేళ్ళ నాటి సంప్రదాయాలు నేటికీ ఆచరణలో ఉన్నాయి. అనేక సరిక్రొత్త రూపాలను పొంది స్త్రీల మనస్సులను దోచుకుంటున్నాయి.




Wednesday, January 16, 2013

ముగ్గులు





మిత్రులందరికీ 

మకర సంక్రాంతి శుభాకాంక్షలు...