Tuesday, November 13, 2012

దీపావళి


deepavali

 దీపం జ్యోతిః పరంబ్రహ్మ 
 దీపం సర్వతమోపహమ్ |
దీపేన సాధ్యతే సర్వమ్ 
 సంధ్యా దీప నమ్మోస్తుతే || 
దీపావళి అనగా దీపాల వరుస అని అర్ధం. దీపం అనేది తాను కరుగుతూ మరో కొందరికి వెలుగునిస్తుంది. ఈ దీపాన్ని ఆదర్శంగా తీసుకుని మనంకూడా మనతోపాటు మరికొందరికి కూడా వెలుగులు పంచుదాం. ఇది ఎలాగంటారా?! మన దగ్గర ఉన్న కాసిని టపాసులు ఏ అనాధ శరణాలయానికన్నా వెళ్ళి ఇచ్చామనుకోండి.. వారి ముఖాల వెలుగుల ముందు ఈ టపాసుల వెలుగులు ఎండుకు పనికొస్తాయి చెప్పండి?! దీపావళి గురించి  "చీకటి వెలుగుల రంగేళీ జీవితమే ఒక దీపావళి"  సినీ  కవి గారు అన్నట్లు ఇది ఒకరి జీవితంలో వెలుగులు నింపితే మరొకరి జీవితంలో విషాదం నింపుతుంది. ఆ విషాదాలను మనం ఈ వెలుగుజిలుగుల కాంతులలో మర్చిపోయేందుకు మనకు దొరికిన మార్గాలలో ఈ దీపావళి కూడా ఒకటి.  ఈ దీపాలు నిత్యం స్పూర్తినిస్తూ ఉన్నతంగా ముందుకు సాగటానికి మనకు ఎంతగానో దోహదం చేస్తాయి. వాటిని ఆదర్శంగా తీసుకుని దీపపువెలుగుల్లో మనం కూడా మన పయనాన్ని మొదలుపెడదాము.

దీపావళి పండుగ:
దీపావళి అనేది పిల్లలు పెద్దలు అందరూ సంబరంగా చేసుకునే పండుగ. కాసేపు అందరూ తమ తమ వయస్సు, హోదాలు అన్నీ మరిచిపోయి ఎంతో ఆనందంగా జరుపుకునే పండుగలలో ముఖ్యమైన పండుగ "దీపావళి"
ఆనంద ఉత్సాహాలతో జాతి, కుల, మత, వర్గ విభేదాలను విస్మరించి, సమైక్యంగా జరుపుకునే పండుగే ఈ  దీపావళి. జగతిని జాగృతం చేసే చైతన్య దీప్తుల శోభావళి. దీపావళినాడు నూనెలో లక్ష్మీదేవి, నదులు, బావులు, చెరువులు మొదలైన నీటి వనరులలో గంగాదేవి సూక్ష్మ రూపంలో నిండి వుంటారు. కనుక ఆ రోజు నువ్వుల నూనెతో తలంటుకుని సూర్యోదయానికి ముందు నాలుగు ఘడియలు అరుణోదయ కాలంలో అభ్యంగన స్నానం తప్పకుండా చేయాలి. ఇలా చేయుడం వల్ల దారిద్ర్యం తొలగుతుంది  అని పెద్దవాళ్ళు చెప్తారు, గంగానదీ స్నాన ఫలం లభిస్తుంది, నరక భయం ఉండదనేది పురాణాలు చెపుతున్నాయి. అమావాస్యనాడు స్వర్గస్థులైన పితరులకు తర్పణం విడవడం విధి కనుక దీపావళినాడు తైలాభ్యంగన స్నానం తరువాత పురుషులు జలతర్పణం చేస్తారు. 'యమాయ తర్పయామి, తర్పయామి తర్పయామి' అంటూ మూడుసార్లు దోసెట్లో నీరు విడిచిపెట్టడం వల్ల పితృదేవతలు సంతుష్టి చెంది ఆశీర్వదిస్తారు. స్త్రీలు అభ్యంగన స్నానానంతరం కొత్త బట్టలు కట్టుకుని ఇళ్ళ ముందు రంగురంగుల ముగ్గులు తీర్చి గుమ్మాలకు పసుపు , కుంకుమలు రాసి మామిడాకు తోరణాలు కట్టి, సాయంత్రం లక్ష్మీపూజకు సన్నాహాలు చేసుకొంటారు. రకరకాలైన, రుచికరమైన భక్ష్యభోగ్యాలతో నైవేద్యానికి పిండివంటలు సిద్దం చేయడం, మట్టి ప్రమిదలలో నువ్వుల నూనె పోసి పూజాగృహంలో, ఇంటి బయట దీప తోరణాలు అమర్చడం, ఆ రోజంతా ఎక్కడలేని హడావుడి, ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తాంటాయి అని అంటారు.
దిబ్బు దిబ్బు
 దీపావళి
దిబ్బు దిబ్బు
 దీపావళి
మళ్ళీ వచ్చే 
నాగులచవితి
అంటూ పిల్లలంతా గోగునార కట్టలకి చిన్న చిన్న గుడ్డ ముక్కల్ని కట్టి వెలిగించి దిష్టి తీయడాన్ని మనం సంప్రదాయంగా కొన్ని ప్రాంతాలల్లో చూస్తూంటాం. సాయంత్రం ప్రదోష సమయంలో దీపాలు వెలిగించి, ముందుగా పిల్లలు దక్షిణ దిశగా నిలబడి దీపం వెలిగించడాన్ని ఉల్కాదానం అంటారు. ఈ దీపం పితృదేవతలకు దారి చూపుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆ దీపం వెలిగించిన తరువాత, కాళ్ళు కడుక్కుని, ఇంటిలోపలకు వచ్చి, తీపి పదార్థం తింటారు. అటు తరువాత పూజాగృహంలో నువ్వులనూనెతో ప్రమిదలు వెలిగించి దీపలక్ష్మికి నమస్కరించి కలశంపై లక్ష్మీదేవిని అవాహన చేసి విధివిధానంగా పూజిస్తారు. పూజానంతరం అందరూ ఉత్సాహంగా బాణాసంచా కాల్చడానికి సంసిద్దులౌతారు. చిచ్చుబుడ్లు, విష్ణుచక్రాలు, భూచక్రాలు, మతాబులు, కాకరపువ్వొత్తులు, కళ్ళు మిరుమిట్లు గొలుపుతుంటే మరో ప్రక్క సీమటపాకాయల ఢమఢమ ధ్వనులతో మ్రోగుతుంటాయి పరిసరాలన్నీ. ఈ విధంగా బాణాసంచా కాల్చడానికి ఒక ప్రయోజనం చెప్పబడింది పురాణాలలో, ఆ వెలుగులో, శబ్దతరంగాలలో దారిద్ర్య దు:ఖాలు దూరంగా తరిమి వేయుబడి లక్ష్మీకటాక్షం సిద్దిస్తుందని, అంతేకాక వర్షఋతువులో ఏర్పడిన తేమవల్ల పుట్టుకువచ్చే క్రిమి కీటకాలు బాణాసంచా పొగలకి నశిస్తాయి.అసుర నాశనానికి, ధర్మ ప్రతిష్టాపనకు గుర్తుగా అమావాస్యనాడు జరుపుకునే దీపావళి పండుగనాడు లక్ష్మీదేవికి ప్రతీకగా వెలుగులు విరజిమ్మే దీపలక్ష్మిని పూజించడం సర్వశుభాలు ప్రసాదిస్తుంది.
పర్యావరణానికి హాని కలగకుండా దీపావళి :
ఈ పండుగ సంబరాలు మన సంస్కృతిలో ఒక భాగం. కాబట్టి పండుగను ఎలా జరుపుకోవాలనేది వారి వారి వ్యక్తిగత యిష్టాయిష్టాల మీద ఆధారపడి ఉంటుంది. అయితే ప్రస్తుత తరుణంలో ఇలాగే జరుపుకోవాలి అని చెప్పాల్సి వస్తోంది. ఒకప్పుడు పర్యావరణ సమస్యలు తీవ్రంగా లేనప్పుడు పండుగ ఎలా జరుపుకున్నా జరిగిపోయేది. అసలు అప్పట్లో ఇప్పటిలా టపాసులు పెద్ద ఎత్తున కాల్చేవారం కాదు. కొత్తబట్టలు వేసుకొని, పిండివంటలు చేసుకొని ఆటలు పాటలతో, మట్టిదీపాలతో అలంకరించుకుని, దివిటీలు తిప్పుతూ పండుగను జరుపుకునేవారు. ఇవి ప్రకృతికి పెద్దగా నష్టం కలిగించేవి కావు. కానీ, నేటి మన జీవన విధానం, పండుగలు చేసుకునే తీరు ప్రకృతి వనరులపై ఎనలేని భారాలను మోపుతున్నాయి. పర్యావరణ కాలుష్యాన్ని పెంచుతున్నాయి. భూగోళాన్ని వేడెక్కిస్తున్నాయి. ఫలితంగా వాతావరణంలో పెద్ద ఎత్తున మార్పులు వస్తున్నాయి. తీవ్ర వర్షాభావం, అదే తీవ్ర స్థాయిలో వరదలు ఒకే సంవత్సరం చూడగలుగుతున్నారు. అందువల్ల కొనసాగు తున్న మన జీవన విధానాన్ని, పండుగలు చేసుకునే తీరును ప్రకృతికి నష్టం కలిగించని రీతిలో మార్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది. పండుగ చేసుకునే సందర్భంలో కొన్ని జాగ్రత్తలు తీసుకొని ప్రకృతిపరంగా ఎక్కువ నష్టం జరగకుండా చూద్దాం. ఆటపాటలతో, దీపాలు వెలిగించి, పిండివంటలు చేసుకొని బంధుమిత్రులతో ఆనందంగా గడుపు కుందాం.  




4 comments:

శ్రీ said...

adbhutamgaa cheppaaru...abhinandnalu...meeku deepaavali subhaakaankshalu...@sri

శ్రీ said...

mee blog lo name ki vaadukunna fonts chaalaa baagunnaayi...link gaanee lekunte mee daggarunna inka telugu fontsgaanee naaku mail cheyagalaraa?
rvsssrinivas666@gmail.com...thank u ...@sri

Unknown said...

@ శ్రీ గారు..

మీకు ఆ ఫాంట్స్ మెయిల్ చేసాను సర్.
ఆ ఫాంట్ "పొన్నాల" ఫాంట్.

మీ అభినందనలకు ధన్యవాదాలు సర్..
మీకు కూడా దీపావళి శుభాకాంక్షలు.

dokka srinivasu said...

Prasuna madam gariki

Namaskaramu. Mee blogu chaalaa chaalaa bagundi. Prasuna madam garu ippude nenu mee bloguki membergaa join ayyanu.

Prasuna madam garu meeku, mee kutumba sabhyulaku mariyu mee snehithulaku naa Deepavali subhakamshalu.


Prasuna madam garu idi naa Deepavali sandesamu Lamps of India message (Bhaaratha Desamulo Deepamulu) ni nenu naa Heritage of India bloglo ponduparichitini.


http://indian-heritage-and-culture.blogspot.in/2013/09/lamps-of-india.html


Prasuna madam garu meeru naa Lamps of India message ni choosi oka manchi sandesamuni english lo ivvagaluaru.

Alage meeru naa bloguki memberga join avutharu ani aasisthunnanu.

Prasuna madam garu meeku naa Lamps of India message nachite danini mee facebook mariyu ithara friends networks lo share cheyagalaru.



Post a Comment