Tuesday, October 30, 2012

సీతమ్మ మాయమ్మ కృతి


సీతమ్మ మాయమ్మ కృతి:

త్యాగ రాజ విరచితము:

వసంత రాగమురూపకతాళము


పల్లవి:
 సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మాకు తండ్రి (2)

అనుపల్లవి: 
వాతాత్మజ ,సౌమిత్రి ,వైనతేయ, 
రిపు, మర్దన ,ధాతా, భరతాదులు, 
సోదరులు, మాకు ఓ మనసా..

చరణము:
పరమేశ ,వశిష్ట, పరాశర,నారద, 
శౌనకా, శుక,సురపతి ,గౌతమ, 
లంబో ధర ,గుహ, సనకాదులు
ధరనిజ భాగవతాగ్రేసరులెల్లరు
 వారెల్లను వర త్యాగరాజునకు
 పరమ బాంధవులు మనసా..

సీతమ్మ మాయమ్మ శ్రీ రాముడు మాకు తండ్రి..
సీతమ్మ మాయమ్మ..!!


Sunday, October 21, 2012

తెలుగు భాష - ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్


తెలుగు భాష - ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్



తెలుగు భాషకి గల గొప్పతనమును గురించి చెప్పే ప్రతి సారీ చాలా మంది  తెలుగు ని ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని తెలుగు భాషని ఎక్కడో వాడుకలో ఉన్న ఇటలీ భాషతో పోలుస్తారు.

తెలుగు అజంత భాష. అనగా దాదాపు ప్రతి పదము ఒక అచ్చుతో అంతము అవుతుంది. ఇటాలియన్ భాష కూడా అచ్చుతోనే అంతము అవుతుంది.
హిందీ మొదలయిన చాలా భారతీయ భాషలు హలంత భాషలు అనగా హల్లులతో అంతమయ్యే భాషలు. 

దీన్ని గమనించే 15వ శతాబ్దములో ఇటాలియన్ యాత్రికుడు నికొలో డా కాంటి తెలుగుని ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్  గా అభివర్ణించాడు. హెన్రీ మారిస్ మరియు చార్లెస్ ఫిలిఫ్ బ్రౌన్ లు కనుగొన్న విషయం ఇటాలియన్ భాష,తెలుగు భాష రెండింటి ఉచ్ఛారణలో ఉన్న సారుప్యాన్ని కనుగొన్నారు.

ఇటాలియన్ భాష లో ప్రతి పదం పలికేటప్పుడు చివర లో ఉచ్చరించేది “ఒక అచ్చు” ను అదే విధానం తెలుగుకూ ఉండటం తో “తెలుగు ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ ” అయ్యింది.ఒక ఇటాలియను పదం ఉదాహరణ గా మనకి తెలిసిన “ఫియట్” కారుని  విస్తరిస్తే ఫాబ్రికానా ఇటాలియానాఆటోమొబైలో టొరినో గా ప్రతి పదం చివర అచ్చు వచ్చి చేరుతుంది.

అచ్చుతో అంతమయ్యే విషయం వల్ల ఇది సంగీతపరంగా సంగీతకారులకు చాలా ఇష్టమైన భాష. ముఖ్యముగా కర్ణాటక సంగీతం లోని చాలా కృతులు తెలుగు భాషలోనే ఉన్నాయి. త్యాగరాజు, భద్రాచల రామదాసు, క్షేత్రయ్య, అన్నమయ్య, వంటివారు తమ తమ కృతులతో, కీర్తన లతో, తెలుగును సంగీతపరంగా సుసంపన్నం చేసినారు. 

పంతొమ్మిదవ శతాబ్దానికి చెందిన యూరోపియనులు తెలుగును “ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్” (Italian of the east) అని పిలుచుకున్నారు.నిజానికి ఇటాలియను కంటే తెలుగు పురాతనమైనది.కనుక్ల మనము ఇటాలియను భాషను  “తెలుగు ఆఫ్ యూరోపు” అని పిలుచుకోవచ్చు.



భామాకలాపం



భామాకలాపం


          ప్రసిద్ధమూ, ప్రాచీనమూ అయిన జానపద కళారూపాలలో కలాపం ఒకటి.కలాపం అనగానే అందరికీ భామా కలాపం, గొల్లకలాపం ముఖ్యంగా గుర్తుకు వస్తాయి.“కలాపముఅంటే ప్రదర్శించునది. ప్రదర్శనకు యోగ్యమయినది అని అర్ధం. భామా కలాపం, గొల్ల కలాపం, చోడిగాని కలాపం  ఇలా చాలారకాల కలాపాలు ఉన్నాయి.యక్షగానాలకు, ప్రబంధాలకు గల ముఖ్యమైన రూపాంతరాలే కలాపం, బుర్రకథ, హరికథ. ఒక నాయిక పాత్రను ధరించి ఆడుతూ, పాడుతూ తన కథను తానే మనకు చెప్పే యక్షగాన రూపమే కలాపం. భామాకలాపం, గొల్లకలాపం వంటివి మార్గశాఖకు చెందినవి.కలాపం ముఖ్య లక్షణం ఆడిపాడి అభినయించడం. తాండవ కదలికలు, స్త్రీ కదలికలు ఇందు ప్రధానముగా ఉంటాయి.

భామాకలాపము పుట్టిన విధానం

            శ్రీకాకుళంలోని ఆంధ్రవిష్ణువు దేవాలయంలో దేవదాసీలు భగవంతుని సేవగా చేసే నృత్యాన్ని, ఉడిపిలో సంగీత, సాహిత్య అభినయాలను అభ్యసించిన వారు సిద్దేంద్ర యోగి. "పారిజాతాపహరణం" కథనే తెలుగులో "పారిజాతం" అనే పేరుతో నృత్యనాటికగా సిద్ధేంద్రయోగి రచించారు. అదే "భామాకలాపం"గా ప్రసిద్ధి చెందింది. భామాకలాపాన్ని కూచిపూడిలోని బ్రాహ్మణుల పిల్లలకు బోధించారు. కూచిపూడిలో పుట్టిన ప్రతిమగపిల్లవానికి సిద్ధేంద్రుని పేరుచెప్పి, ముక్కు కుట్టి, కాలిగజ్జె కట్టి, పిల్లవాడు పెద్దయ్యాక వృత్తిని అవలంబించినా గాని స్వామి సన్నిధిలో భామవేషం వేసి తీరాలని, స్త్రీలకు కళలో ప్రవేశం ఉండరాదని సిద్ధేంద్రుడు శాసించాడు. నియమం చాలాకాలంవరకూ కొనసాగింది.



భామాకలాపం

          'కలాపము' అంటే "ప్రదర్శించునది,'కలత' లేదా 'కలహము' అని అర్ధము.
"భామ"  శ్రీ కృష్ణుడి  అందమైన, అసూయాపరురాలైన సత్యభామ.  17 శతాబ్దంలో  సిద్దేంధ్ర యోగి దీని రూపకల్పన చేశారు.హాస్యము, శృంగార రసములు ఇందులో ప్రధానముగా ప్రదర్శింపబడతాయి.

          సత్యభామ అందం, జాణతనం, అహంకారం, తెలివెతేటలు, వీరత్వం కలిగిన పాత్ర. సగటు భారత మహిళ మనస్తత్వము సత్యభామలో ప్రస్పుటముగా గోచరిస్తుందిశ్రీ కృష్ణుడిని కాలితో తన్నినపుడు బాధ పడేదీ సత్యభామే.. తక్కిన సవతులతో తనకు తాను పోల్చుకునేదీ సత్యభామే.. సత్యభామ ఆలోచించే విధానం,రెప్ప పాటయినా పతి వియోగాన్ని భరించలేని సత్యభామ అవస్థలు, ఆలోచనలు, నడవడిక అంతా భామాకలాపములో చాలా చక్కగా కనిపిస్తుంది.
          సుమారు ఐదు వందల సంవత్సరాల  క్రితం  ఆరంభమైన భామాకలాపం కళారీతి ప్రస్తుతం మూడు రీతులలో ప్రవర్ధిల్లుతున్నది. కృష్ణ, గుంటూరు జిల్లాలలో ప్రచారంలో ఉన్న భామాకలాపం కూచిపూడి సంప్రదాయంపశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాలో దేవదాసీలు ప్రచారం చేసిన శైలి లాస్యపద్ధతి. విశాఖ, గోదావరి జిల్లాల లో "ద్రుపద బాణీ" ప్రచారంలో ఉన్నది.సమస్త జీవనానికి అర్ధం అయ్యేలా దీని సాహిత్యం ఉండటం, నవరసభరితంగా ఉండటం వలన ఇవి జనంలోకి అంతగా కలిసిపోయాయి.

భామాకలాపం - వివరణ

          భామకలాపము "శ్రీగదితము" అనే నృత్య రూపకమునకు  చెందినది. ఇది ఏకాంకిక.ఇందులో నాయకుడు శ్రీకృష్ణుడు. కలాపం వాగ్వాపారమునకు చెందిన భారతీ వృత్తి. విఘ్నేశ్వర స్తుతి,సరస్వతీ ప్రార్ధన ఇందులో మొదట కనిపిస్తాయి.

భామనే సత్యభామనే
భామరో శృంగార జగదభిరానే
ముఖవిజిత హేమాధామనే
ద్వారకాపురాఢ్యురామనే
వయ్యారి సత్యాభామనే


           అత్తమామల ప్రశస్తి, భూదేవిని ప్రశంసించదం,వెన్నెల పదము, మరికొన్ని దరువులు,దశావతార వర్ణన,మంగళహారతి  ఇందులో ముఖ్యంగా కనిపిస్తాయి...
           కాలక్రమంగా భామాకలాపం అనేక మార్పులు  పొందింది. వాటిలో ముఖ్యమైన మార్పు సత్యభామ అష్టవిధ కథానాయికలుగా అభినయించడం. అలా మార్పులు చేసినవారిలో ముఖ్యుడు పశ్చిమ గోదావరి జిల్లాకుచెందిన ఆకివీడు వాస్తవ్యుడు జగన్నాధుడు సిద్ధేంద్రునికి రెండువందల సంవత్సరాల తరువాతివాడు.
            మొదట్లో వీటిని కూచిపూడి భాగవతులలో మగవారు మాత్రమే  స్త్రీగా వేషం మార్చుకుని ప్రదర్శించేవారు. తరువాత మహిళలు ఇచ్చే ప్రదర్శనలే ఎక్కువగా కనిపిస్తునాయి.
             ఈ కలాపమంతా  సంపూర్ణముగా శ్రీ కృష్ణుని జగన్నాటకముగా రూపొందించ బడింది. దశవిధ కామావస్థలు, వేదాంతం పరమార్ధం,వేదాంత ప్రబోధలు దీనిలో అంతర్గతముగా చెప్పే విషయాలు.

భామాకలాపం సాహిత్యం

భామనే..సత్యభామనే!
సత్యభామనేసత్యభామనే!
వయ్యారి..ముద్దుల!
వయ్యారి..ముద్దుల!
సత్యభామనే!సత్యభామనే!

భామనే పదిఆరువేలా కోమలులందరిలోనా!
భామనే పదిఆరువేలా కోమలులందరిలో!
లలనా చెలియా మగువా సఖియా
రామరో గోపాల దేవుని ప్రేమనూ దోచిన దానా!!
రామరో గోపాల దేవుని ప్రేమనూ దోచిన
సత్యభామనే !సత్యభామనే !

ఇంతినే చామంతినే మరుదంతినే విరిబంతినే!
ఇంతినే చామంతినే మరుదంతినే విరిబంతినే!
జాణతనమున సతులలో
నెరజాణనై నెరజాణనై
నెరజాణనై వెలిగేటి దాన!
సత్యభామనే!సత్యభామనే!

భామనే..సత్యభామనే!
సత్యభామనేసత్యభామనే!
వయ్యారి..ముద్దుల!
వయ్యారి..ముద్దుల!
సత్యభామనే!సత్యభామనే!


అందమున ఆనందమున గోవిందునకు నెరవిందునై!
నంద నందనుడు ఎందుగానక 
డెందమందున్న క్రుంగుచున్న!!

భామనే..సత్యభామనే!
సత్యభామనేసత్యభామనే!
వయ్యారి..ముద్దుల!
వయ్యారి..ముద్దుల!
సత్యభామనే!సత్యభామనే!


కూరిమి సత్రాజిత్తు కూతురై ఇందరిలోన!
నాదు మగనిని బాసితల జాలకా యున్నట్టి దాన!!

భామనే..సత్యభామనే!
సత్యభామనే!సత్యభామనే!
వయ్యారి..ముద్దుల!
వయ్యారి..ముద్దుల!
సత్యభామనే!సత్యభామనే!