Thursday, December 6, 2012

చేరి వినవె శౌరి కృతి ( ఆధ్యాత్మిక రామాయణ కీర్తన )


చేరి వినవె శౌరి, చరితము-గౌరి, సుకుమారి గిరివరకుమారీ


సురటి రాగము - ఆదితాళము
పల్లవి 
చేరి వినవె శౌరి చరితము
గౌరి సుకుమారి గిరివరకుమారీ     చేరి 

అనుపల్లవి 
వారిజాక్షు డంతటను శ్రీ 
మీరి వేడ్కతో నయోధ్యకు
గోరి పోవుదారిలో నృప
వైరియైన పరశురాముడు
కారు మొగులు కరణి చాప
ధరుడై కాలమృత్యువో యనగ బం
క్తి రధు జేరి హరి యెదుటను నిలిచి పలికెను 
వీరాధివీరుడని యెఱుంగక      చేరి  

బెండువంటి నిల్లు నడిమికి
రెండు జేసి పెల్లు పొందు
కొండ నెనయు నా విల్లు
దండి వైరులకు ముల్లు
కడు గండు మిగిలి దీని నెక్కు బెట్టిన గాని రా
ముడనను నిన్ను నటు గా
కుండిన జంపుదు నన రాము డతని కో
దండము గొని చక్క నెక్కిడి య
ఖండాశుగము తగ
దొడిగి తెగ నింద దిగిచి భార్గ
వుడ నిను కాండాహత చరణు జేసి నృప
కాండాభి రాముడనౌదు ననిన
బుండరీకలోచను డి
తండని పూర్వకాల సంస్మృతి
పొడమి పొగడి భండప్రచండపండితుం డవ
జాండాధిపతి నవ్యయుడ వనెను     చేరి   

బాల్యమునను నేను ఘోర తపంబు సేయుచోను హరి వా
త్సల్య మొప్పగాను వేగ ప్రసన్నుడై పలికె దాను, సా
ఫల్య మయ్యె నీ తపము జన సమ్మతము నున్చి వంశయుతుడ వగు, సా
ఫల్యంబలుడ వగుచు బితృహననుడగు కార్తవీర్యు గెలిచి ఖలు నృపుల వై
కల్యాత్మకుల జంపి శమదమ ముఖ్యార్థితుడ వగుము నే గౌ
సల్యా గర్భమున రాముడన గల్యాణదాయినై జనించి య
హల్యాసతి బవిత్ర జేసి సీతను, గల్యాణమై నీకు దరిశనమ
తుల్యముగ నొసగుదునని జనియె దయ,తోనా హరియ నీవని చనియె IIచేరిII 2

స్వామి నేను మించి హేహయ వంశజులను ద్రుంచి శాంతుండ
నై ముదము దలంచి చెలగెద నీ మహా మహిమ నుంచి ఖగ
గామినీ బలంబు నీవు గొంటివి గాన నే ధన్యతముడ నైతిని
నీ మహనీయ దరిశనము గలిగె బితామహాదుల కగోచరుడవు శ్రీ
రామా మనోహరుడ వగు రఘురామా ప్రకృతికంటె పరుడవు
కామాద్యరివర్గ దూరు డ వహో మాధవ భవ రహితుండవు
కామకర్త గుణవర్జితు డవు నుదకమున ఫేన జాలములు ననలమున
ధూమమెటుల నటులనే యభిజనమును నీ మాయచే గల్పితం బనె.       చేరి

ఎందాక నరుండు మాయకు హితవు మీరకుండ వినువా
డందాక జడుండు వానికి నాత్మ గానరాకుండు తన
యందు గల్గు నవిచారమున విద్య మిగుల బ్రబలినదై విద్య నణచు
పొందు గానవిద్యాకృత మగుటను బంధుబింబితుండై జీవాత్మను
బొందు తను మనః ప్రాణమునబొందు నపుడె స్వాభిమానము
నొందు నపుడె సుఖదుఃఖముల నొందు నాత్మకు సంసృతి లే
దెందు జ్ఞాన మిపుడు బుద్ధికిని లే దిది నైజము వ్యాకృతమున బ్రకృతి
పొందుగాను సంసారి యయ్యేహుత భుగ్వార మేళనంపు క్రియ ననె    చేరి

ఎంతదాక నరుడు నీ పదహితుల పొత్తు జొరడు విను వా
డంత దాక నరుడు వలెను భవాబ్ధి దిరుగు పామరుండు ఏ
కాంతుడయి సుజన సంగతి వలనను గనిన భక్తి చేత నెపుడు నిన్ను న
నంతు నాశ్రయించి నపుడు మాయకు
నంత మజితుడును స్వప్రకాశుడును
శాంతాత్మకుడు నైన సద్గురు డంతవాని కగపడును సుని
శాంతానంద మతనిచే గని చింతల నెల్ల ద్రుంచి ని
రంతరాత్మ సుఖము జెందు నీ పద రాజీవయుగ భక్తి లేని నరు
లంతమొంది జ్ఞానముక్తి సుఖముల నంద వశముగాక చెడుదు రనె.     చేరి

ఈ శరణు శరణు దురిత వి
నా శరణు శరణు సుజన
క్లేశ హరణ శరణూ జయ జయ శ్రీరా
మ శరణు శరణు నే జేసినట్టి పుణ్యమెల్ల నీదు మ
హాశుగమున కొసగినాడ నను దయ
జేసి బ్రోవు మన బరశురామునకు సీతా విభుడు ప్రసన్నుడై పలికె
వాసి నీ మనంబునను వరము గోరు నిను కృప
జేసినానన భృగుకులుడు భాసిల్లుచు నీదు పద రజో
లేశమునకు నే వరంబు సమ మఖి
లేశ భక్తి నిమ్మన గృతార్థుని జేసి పనుప జనియె జామదగ్ని ని
జేచ్ఛం దనుజ రిపు నుతించుచు జనె                   చేరి

ప్రీతుడయ్యె జలా దశరథ విభు డంతట వీలా గుణముల
చేత నలరి తగ పురి జేరి చక్రి యావేళ భూ
జాత నరసి తనరె, ననుజులు నిజ సతుల రతుల విభవ స
మేతుడు జగత్ప్రభుడు బ్రధితగుణ
జాతు డవ్యయానందమూర్తి సం
గీతానంత కీర్తి సుగుణ భూతాద్యఖిల సాక్షి మాయా
జాతాఖిల కలుషహరుడు సాకేతాధిపు డై యుండె హరి ద
యాతిశయత నిదియు జెప్పె సుబ్రహ్మణ్య కవి శేషగిరీశుపేర వి
ఖ్యాతి మీఱ నధ్యాత్మ రామాయణాఖ్యానమున బాలకాండ మిది          చేరి

Tuesday, November 13, 2012

దుడుకు గల నన్నే దొర కృతి


పంచరత్న కృతులలో ఒక కృతి:
దుడుకు గల నన్నే దొర
 త్యాగరాజవిరచితం గౌళరాగం, ఆదితాళం


దుడుకు గల నన్నే దొర

కొడుకు బ్రోచురా ఎంతో
దుడుకు గల నన్నే దొర

కడు దుర్విషయాకృశ్టుడై గడియ గడియకు నిండారు
దుడుకు గల నన్నే దొర

శ్రీ వనితా హృత్కుముదాబ్జ వాంగ్మానసాగోచర
దుడుకు గల నన్నే దొర

సకల భూతముల యందు నీవై యుండగ మదిలేక పోయిన
దుడుకు గల నన్నే దొర

చిరుత ప్రాయమున నాడే భజనామృత రసవిహీన కుతర్కుడైన
దుడుకు గల నన్నే దొర

పర ధనముల కొరకు నొరుల మదిని
కరగబలికి కడుపు నింప దిరిగినట్టి
దుడుకు గల నన్నే దొర

తనమదిని భువిని సౌఖ్యపు జీవనమే
యనుచు సదా దినములు గడిపెడి
దుడుకు గల నన్నే దొర

తెలియని నటవిట క్షుద్రులు వనితలు స్వవశమౌట కుపదశించి
సంతసిల్లి స్వరలయంబు లెరుంగకను శిలాత్ముడై
సుభక్తులకు సమానమను
దుడుకు గల నన్నే దొర

దృష్టికి సారంబగు లలనా సదనార్భక సేనామిత ధనాదులను
దేవాది దేవ నెరనమ్మితిని గాకను పదాబ్జ భజనంబు మరచిన
దుడుకు గల నన్నే దొర

చక్కని ముఖ కమలంబునను సదా నా మదిలో స్మరణ లేకనే
దుర్మదాంధ జనుల కోరి పరితాపములచే దగిలి నొగిలి దుర్విషయ
దురాశలను రోయలేక సతత మపరాధినై చపల చిత్తుడైన
దుడుకు గల నన్నే దొర

మానవతను దుర్లభ మనుచు నెంచి పరమానంద మొందలేక
మద మత్సర కామ లోభ మోహములకు దాసుడై మోసబోతి గాక
మొదటి కులజుడగుచు భువిని శూద్రుల పనులు సల్పుచునుంటిని గాక
నారాధములను రోయ సారహీన మతములను సాధింప తారుమారు
దుడుకు గల నన్నే దొర

సతులకై కొన్నాళ్ళాస్థికై సుతులకై కొన్నాళ్ళు
ధన తతులకై తిరిగితి నయ్య త్యాగరాజాప్త ఇటువంటి
దుడుకు గల నన్నే దొర కొడుకు బ్రోచురా ఎంతో
దుడుకు గల నన్నే దొర


దీపావళి


deepavali

 దీపం జ్యోతిః పరంబ్రహ్మ 
 దీపం సర్వతమోపహమ్ |
దీపేన సాధ్యతే సర్వమ్ 
 సంధ్యా దీప నమ్మోస్తుతే || 
దీపావళి అనగా దీపాల వరుస అని అర్ధం. దీపం అనేది తాను కరుగుతూ మరో కొందరికి వెలుగునిస్తుంది. ఈ దీపాన్ని ఆదర్శంగా తీసుకుని మనంకూడా మనతోపాటు మరికొందరికి కూడా వెలుగులు పంచుదాం. ఇది ఎలాగంటారా?! మన దగ్గర ఉన్న కాసిని టపాసులు ఏ అనాధ శరణాలయానికన్నా వెళ్ళి ఇచ్చామనుకోండి.. వారి ముఖాల వెలుగుల ముందు ఈ టపాసుల వెలుగులు ఎండుకు పనికొస్తాయి చెప్పండి?! దీపావళి గురించి  "చీకటి వెలుగుల రంగేళీ జీవితమే ఒక దీపావళి"  సినీ  కవి గారు అన్నట్లు ఇది ఒకరి జీవితంలో వెలుగులు నింపితే మరొకరి జీవితంలో విషాదం నింపుతుంది. ఆ విషాదాలను మనం ఈ వెలుగుజిలుగుల కాంతులలో మర్చిపోయేందుకు మనకు దొరికిన మార్గాలలో ఈ దీపావళి కూడా ఒకటి.  ఈ దీపాలు నిత్యం స్పూర్తినిస్తూ ఉన్నతంగా ముందుకు సాగటానికి మనకు ఎంతగానో దోహదం చేస్తాయి. వాటిని ఆదర్శంగా తీసుకుని దీపపువెలుగుల్లో మనం కూడా మన పయనాన్ని మొదలుపెడదాము.

దీపావళి పండుగ:
దీపావళి అనేది పిల్లలు పెద్దలు అందరూ సంబరంగా చేసుకునే పండుగ. కాసేపు అందరూ తమ తమ వయస్సు, హోదాలు అన్నీ మరిచిపోయి ఎంతో ఆనందంగా జరుపుకునే పండుగలలో ముఖ్యమైన పండుగ "దీపావళి"
ఆనంద ఉత్సాహాలతో జాతి, కుల, మత, వర్గ విభేదాలను విస్మరించి, సమైక్యంగా జరుపుకునే పండుగే ఈ  దీపావళి. జగతిని జాగృతం చేసే చైతన్య దీప్తుల శోభావళి. దీపావళినాడు నూనెలో లక్ష్మీదేవి, నదులు, బావులు, చెరువులు మొదలైన నీటి వనరులలో గంగాదేవి సూక్ష్మ రూపంలో నిండి వుంటారు. కనుక ఆ రోజు నువ్వుల నూనెతో తలంటుకుని సూర్యోదయానికి ముందు నాలుగు ఘడియలు అరుణోదయ కాలంలో అభ్యంగన స్నానం తప్పకుండా చేయాలి. ఇలా చేయుడం వల్ల దారిద్ర్యం తొలగుతుంది  అని పెద్దవాళ్ళు చెప్తారు, గంగానదీ స్నాన ఫలం లభిస్తుంది, నరక భయం ఉండదనేది పురాణాలు చెపుతున్నాయి. అమావాస్యనాడు స్వర్గస్థులైన పితరులకు తర్పణం విడవడం విధి కనుక దీపావళినాడు తైలాభ్యంగన స్నానం తరువాత పురుషులు జలతర్పణం చేస్తారు. 'యమాయ తర్పయామి, తర్పయామి తర్పయామి' అంటూ మూడుసార్లు దోసెట్లో నీరు విడిచిపెట్టడం వల్ల పితృదేవతలు సంతుష్టి చెంది ఆశీర్వదిస్తారు. స్త్రీలు అభ్యంగన స్నానానంతరం కొత్త బట్టలు కట్టుకుని ఇళ్ళ ముందు రంగురంగుల ముగ్గులు తీర్చి గుమ్మాలకు పసుపు , కుంకుమలు రాసి మామిడాకు తోరణాలు కట్టి, సాయంత్రం లక్ష్మీపూజకు సన్నాహాలు చేసుకొంటారు. రకరకాలైన, రుచికరమైన భక్ష్యభోగ్యాలతో నైవేద్యానికి పిండివంటలు సిద్దం చేయడం, మట్టి ప్రమిదలలో నువ్వుల నూనె పోసి పూజాగృహంలో, ఇంటి బయట దీప తోరణాలు అమర్చడం, ఆ రోజంతా ఎక్కడలేని హడావుడి, ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తాంటాయి అని అంటారు.
దిబ్బు దిబ్బు
 దీపావళి
దిబ్బు దిబ్బు
 దీపావళి
మళ్ళీ వచ్చే 
నాగులచవితి
అంటూ పిల్లలంతా గోగునార కట్టలకి చిన్న చిన్న గుడ్డ ముక్కల్ని కట్టి వెలిగించి దిష్టి తీయడాన్ని మనం సంప్రదాయంగా కొన్ని ప్రాంతాలల్లో చూస్తూంటాం. సాయంత్రం ప్రదోష సమయంలో దీపాలు వెలిగించి, ముందుగా పిల్లలు దక్షిణ దిశగా నిలబడి దీపం వెలిగించడాన్ని ఉల్కాదానం అంటారు. ఈ దీపం పితృదేవతలకు దారి చూపుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆ దీపం వెలిగించిన తరువాత, కాళ్ళు కడుక్కుని, ఇంటిలోపలకు వచ్చి, తీపి పదార్థం తింటారు. అటు తరువాత పూజాగృహంలో నువ్వులనూనెతో ప్రమిదలు వెలిగించి దీపలక్ష్మికి నమస్కరించి కలశంపై లక్ష్మీదేవిని అవాహన చేసి విధివిధానంగా పూజిస్తారు. పూజానంతరం అందరూ ఉత్సాహంగా బాణాసంచా కాల్చడానికి సంసిద్దులౌతారు. చిచ్చుబుడ్లు, విష్ణుచక్రాలు, భూచక్రాలు, మతాబులు, కాకరపువ్వొత్తులు, కళ్ళు మిరుమిట్లు గొలుపుతుంటే మరో ప్రక్క సీమటపాకాయల ఢమఢమ ధ్వనులతో మ్రోగుతుంటాయి పరిసరాలన్నీ. ఈ విధంగా బాణాసంచా కాల్చడానికి ఒక ప్రయోజనం చెప్పబడింది పురాణాలలో, ఆ వెలుగులో, శబ్దతరంగాలలో దారిద్ర్య దు:ఖాలు దూరంగా తరిమి వేయుబడి లక్ష్మీకటాక్షం సిద్దిస్తుందని, అంతేకాక వర్షఋతువులో ఏర్పడిన తేమవల్ల పుట్టుకువచ్చే క్రిమి కీటకాలు బాణాసంచా పొగలకి నశిస్తాయి.అసుర నాశనానికి, ధర్మ ప్రతిష్టాపనకు గుర్తుగా అమావాస్యనాడు జరుపుకునే దీపావళి పండుగనాడు లక్ష్మీదేవికి ప్రతీకగా వెలుగులు విరజిమ్మే దీపలక్ష్మిని పూజించడం సర్వశుభాలు ప్రసాదిస్తుంది.
పర్యావరణానికి హాని కలగకుండా దీపావళి :
ఈ పండుగ సంబరాలు మన సంస్కృతిలో ఒక భాగం. కాబట్టి పండుగను ఎలా జరుపుకోవాలనేది వారి వారి వ్యక్తిగత యిష్టాయిష్టాల మీద ఆధారపడి ఉంటుంది. అయితే ప్రస్తుత తరుణంలో ఇలాగే జరుపుకోవాలి అని చెప్పాల్సి వస్తోంది. ఒకప్పుడు పర్యావరణ సమస్యలు తీవ్రంగా లేనప్పుడు పండుగ ఎలా జరుపుకున్నా జరిగిపోయేది. అసలు అప్పట్లో ఇప్పటిలా టపాసులు పెద్ద ఎత్తున కాల్చేవారం కాదు. కొత్తబట్టలు వేసుకొని, పిండివంటలు చేసుకొని ఆటలు పాటలతో, మట్టిదీపాలతో అలంకరించుకుని, దివిటీలు తిప్పుతూ పండుగను జరుపుకునేవారు. ఇవి ప్రకృతికి పెద్దగా నష్టం కలిగించేవి కావు. కానీ, నేటి మన జీవన విధానం, పండుగలు చేసుకునే తీరు ప్రకృతి వనరులపై ఎనలేని భారాలను మోపుతున్నాయి. పర్యావరణ కాలుష్యాన్ని పెంచుతున్నాయి. భూగోళాన్ని వేడెక్కిస్తున్నాయి. ఫలితంగా వాతావరణంలో పెద్ద ఎత్తున మార్పులు వస్తున్నాయి. తీవ్ర వర్షాభావం, అదే తీవ్ర స్థాయిలో వరదలు ఒకే సంవత్సరం చూడగలుగుతున్నారు. అందువల్ల కొనసాగు తున్న మన జీవన విధానాన్ని, పండుగలు చేసుకునే తీరును ప్రకృతికి నష్టం కలిగించని రీతిలో మార్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది. పండుగ చేసుకునే సందర్భంలో కొన్ని జాగ్రత్తలు తీసుకొని ప్రకృతిపరంగా ఎక్కువ నష్టం జరగకుండా చూద్దాం. ఆటపాటలతో, దీపాలు వెలిగించి, పిండివంటలు చేసుకొని బంధుమిత్రులతో ఆనందంగా గడుపు కుందాం.  




Friday, November 9, 2012

పాలు మనుషులకు అవసరమా?!


పాలు మనుషులకు అవసరమా?!


                             పాలు ( మిల్క్ ) ఈ పదము వినని మనిషి ఉండడంటే అతిశయోక్తి కాదేమో..! పాలు నిత్య జీవితములో ఎంత భాగమయ్యాయి అంటే అవి నిత్యావసరాల కన్నా అత్యవసరాలయ్యాయి. మనం పిల్లలకి ఉగ్గుపాల కన్నా ముందు పాలు పరిచయం చేస్తున్నాము.
పాలల్లో రకాలు:
                             చనుబాలు, చన్నుపాలు (woman's milk, human milk.), ఆవు పాలు ( cow’s milk) ,గేదె పాలు, మేక పాలు , చెరుకుపాలు (the juice of the sugar cane.), టెంకాయపాలు (the white juice expressed from the coconut kernel by pounding. (టెంకాయనీళ్లు is the water in the coconut.), మర్రిపాలు (the milky juice of the banyan tree.), చెట్లయందు గలుగు తెల్లని రసము.
                             దేవుడు జీవులన్నిటినీ సమానంగా సృష్టించాడు కానీ మనిషికి మాత్రం కొంచెం తెలివి, బుద్ధి కుశలత అధికంగా ఇచ్చాడు. దేవుడి సృష్టి ప్రకారము మనిషి పాలు మనిషి తాగాలి. ఆవు పాలు, గేదెపాలు, మేకపాలు వాటికి పుట్టిన లేగదూడలు, మేకపిల్లలు తాగాలి. లోకం లో జీవులన్నీ సహజం గానే జీవిస్తున్నాయి. ఒక్క మనిషి మాత్రం తనకు దేవుడిచ్చిన తెలివితేటలను అతి తెలివితేటలుగా మార్చుకుని అతి అసహజంగా జీవనం సాగిస్తున్నాడు. మనిషి పాలను మనిషి తాగడమే కాక జంతువుల పాలను కూడా దోచుకుని మరీ తాగుతున్నాడు. అదీ వాటికి పుట్టిన దూడలకు కూడా దక్కనీయకుండా. పైగా  ఆ పాలు అధికంగా రావడంకోసం  వాటికి మందులను చేర్చి వాటి ప్రాణాలతో చెలగాటాలాడుతున్నాడు.


cows,milk,paintings


తల్లి పాలు – విశిష్టత:
                             పుట్టిన బిడ్డకు ఆరు నెలలు పాటు తల్లిపాలు ఇవ్వాలి. అలా ఇవ్వడం ద్వారా బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యం అందిస్తున్నట్టు. తల్లిపాలు బిడ్డ ఉదరములో సులభంగా జీర్ణమవుతాయి. జీర్ణకోశ ఇబ్బందులు రానివ్వవు. తల్లిపాలు తాగే పిల్లల ముక్కు, గొంతు లోపల ఒక రక్షిత పొర ఏర్పడుతుంది. దీనివలన పిల్లలకు ఆస్త్మా, చెవులకు సంబంధించిన అనారోగ్యాలు కలుగవు. పోతపాలు కొంతమంది పిల్లల్లో ఎలర్జీ తెస్తాయి.తల్లిపాలు తాగి పెరిగిన పిల్లల్లో స్థూలకాయం అంత త్వరగా రాదు. తల్లిపాలు మానసిక బంధానికి పనికొస్తాయట. తల్లిపాలు తాగిన పిల్లలు తల్లితో ఎంతో ప్రేమగా, నమ్రతతో ఉంటారని పరిశోధనలు చెప్తున్నాయి. పిల్లల మేధోశక్తిని పెంచగలిగినవి తల్లిపాలు. మెదడు ఎదుగుదలతో తల్లిపాలు పాత్ర వహిస్తాయి. తల్లిపాలు తాగిన పిల్లలకు జ్ఞాపక శక్తి ఎక్కువ ఉండి చురుకుగా ప్రవర్తిస్తారు. అంటు రోగాలు అంత త్వరగా సోకవు. బిడ్డకు ఇన్నిరకాలుగా మేలుచేస్తుంది కాబట్టి అమృతంతో తల్లిపాలును పోలుస్తారు.
                        మనిషి పాలలో 71 కిలో కేలరీలు , ఆవు పాలలో 69 కిలోకేలరీలు, గేదె పాలలో 100 కిలో కేలరీలు మరియు మేక పాలలో 66 కిలో కేలరీలు శక్తి ఉంటుంది.
                             దీని ప్రకారం చూస్తే.. మనిషి బ్రతకడానికి సరిపడా పిల్లలకి రెండు సంవత్సరాలు నిండే వరకు తల్లి పాలు సరిపోతాయి. కానీ వాటికి అదనంగా గేదె పాలను, ఆవుపాలను కూడా కలిపి పట్టిస్తున్నారు. మనం ఇందులోని వాస్తవాలను గమనిస్తే.. ఒక లేగ దూడ తన తల్లి పాలు తాగిన ఆరు నెలల్లో పూర్తి గా, ఊహకందని రీతిలో ఎదుగుతుంది. కానీ మనిషిలో మాత్రం రెండు సంవత్సరాలైనా శారీరక ఎదుగుదల అంతగా  కనపడదు. మరి తల్లి పాల స్ధానంలో మనిషి ఆవు, గేదెల పాలు తాగితే మనిషి పెరుగుదల ప్రకృతికి విరుద్ధం గా ఉంటుంది. అది అసాధారణ రీతిలో ఉంటుంది. పదేళ్ళకే శారీరకంగా అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. తద్వారా బుద్ధి మందగించడం, బద్ధకం పెరుగుతాయి. తెలివితేటలు తగ్గిపోతాయి.
                             పుట్టుకతో ప్రతి బిడ్డ తన తల్లి పాలను మాత్రమే తాగుతాడు. పోత పాలను ( ఆవు,గేదె,మేక పాలను) ఇష్ట పడడు. కక్కుకుంటాడు. కానీ మనుషులు మాత్రం వాటికి అనేక రకాలైన రుచి కరమైన పదార్ధాలను చేర్చి మరీ వాళ్ళ చేత బలవంతంగా తాగిస్తారు. ఈ మార్పులు మనకి మామూలుగా అర్ధం కావు ఎందుకంటే ప్రతి ఒక్కరు తాగే వారే ఉన్నారు కనుక..!
                             పాలు ఎందుకు బలం? ఇది నిజమేనా?! మనిషికి మాత్రమే పాల అవసరం ఎందుకు వస్తున్నది? మనిషి పాలు మనిషి తాగిన తరువాత కూడా వేరే జంతువు పాలు ఎందుకు దోచుకుని మరీ తీసుకోవలసి వస్తున్నది?పాలు అనేది రక్తం. ఆడది తన రక్తాన్ని పాలుగా మార్చి తనకు పుట్టబోయే బిడ్డకు సంవత్సరాల పాటు అందిస్తుంది.ఆవులు, గేదెలు, మేకలు  మాత్రము తల్లులు కావా?! వాటి పాలను దొంగిలించి మన పిల్లలకు పట్టడానికి మనకు ఎటువంటి అధికారం ఉన్నది? ఈ విధంగా చెయ్యడం వలన మన జాతికే ముప్పు వాటిల్లునట్టి పరిస్ధితులు ఏర్పడవా?! ఆ మూగజీవాలకి రక్షణ లేదని ఎవరూ అడిగే వాళ్ళని ఈ విధం గా చెయ్యడం భావ్యమేనా?!
                             ఇవన్నీ నా మట్టిబుర్రలో మెదలుతున్న సందేహాలు.. వీటికి కారణాలు లేకపోలేదు. యూ ట్యూబ్ వంటి వీడియో వెబ్ సైట్లలో ఒక సారి శ్రమ అనుకోకుండా మానవుల వలన ఆవులు, గేదెలు ఎంత ఘోరంగా బలౌతున్నాయో ఒక్క సారి చూడండి. వీటిలో మానవుల ప్రమేయము ప్రత్యక్షంగానే కాక పరోక్షంగా కూడా ఉన్నదేమో నని నా అభిప్రాయం. పాల కోసం ఆ మూగజీవాలకి చిత్రవిచిత్రమైన రసాయనాలని కలిపి అధికంగా పాలను ఇచ్చే విధం గా సంకర జాతులుగా మారుస్తున్నారు. వీటి ద్వారా అవి ఏళ్ళ పాటు ఇవ్వవలసిన పాలను కొన్ని నెలల్లోనే ఇచ్చి, అవి రోగగ్రస్ధ జీవులుగా మారుతున్నాయి. వాటిని అప్పుడు కూడా వదలకుండా బ్రతికున్న వాటిని యంత్రాలలో వేసి అతి క్రూరముగా చంపుతున్నారు. ఇంతటి గొప్ప అతితెలివి తేటలు కలిగిన కొందరు మానవులు చేస్తున్న ఈ ప్రయోగాలకు అవి అన్యాయంగా బలౌతున్నాయి. మనకి దేవుడు ఈ ప్రపంచంలో బ్రతికే హక్కును మాత్రమే ఇచ్చాడు. వేరొక జీవి స్వేచ్చను హరించే హక్కులను ఇవ్వలేదు. భగవంతుడు అందరికీ తండ్రి అంటారు కదా..! మరి ఒకరు ఇంకొక ప్రాణాలకు హాని కలిగిస్తుంటే ఆ భగవంతుడు చూస్తూ ఊరుకోడు కదా..! అకారణంగా ఊరు పేరు లేని ఎన్నో ప్రకృతి వైపరీత్యాలకి మానవాళి బలౌతోంది. వీటన్నిటికీ కారణం ఏమై ఉంటుంది?
                             ఈ సోది ఏంట్రా బాబూ.. అనుకున్నా పరవాలేదు నాదొక చిన్న విన్నపం. మనం మూగజీవాలని రక్షించనక్కరలేదు.. వాటి స్వేచ్చను, వాటి ప్రాణాలను భక్షించకుండా ఉంటే చాలు. మనకి దేవుడు జంతువుల రక్తాన్ని తాగే హక్కును ఇవ్వలేదు.
                             ఆవు పాలు, లేగ దూడలు తాగాలి, కుక్క పాలు కుక్కపిల్లలు తాగాలి, గేదెపాలు వాటికి పుట్టిన పిల్లలు తాగాలి. మేక పాలు మేకపిల్లలు తాగాలి, మనిషి పాలు మాత్రమే మనిషి తాగాలి, ఈ శరీరాలలో ఏ శరీరాన్ని మనిషి తన మేధోశక్తితో సృష్టించలేదు. అటువంటప్పుడు మనిషికి ఈ మూగజీవాల పాలు బలం అని ఏవిధమైన ఆధారాలతో నిరూపించగలడు? చదువులేని మొద్దు-కదలలేని ఎద్దు అన్నారు. చదువుకుని మేధోశక్తిని పెంచుకోవాల్సిన వయసులో వాటి పాలు తాగితే కదలలేని ఎద్దులకన్నా ఘోరంగా మనుషులు తయారౌతారు, అంతేకాదు వాటి శరీరాలు కూడా కదలలేని ఎద్దులలాగానే తయారౌతాయి. వీటికి సంబంధించి విస్తృతమైన పరిశోధనలు జరిగాయి. వాటన్నిటి ద్వారా తేల్చిన సత్యాలే ఇవి.

                             అందుచేత ఇంతకీ నా ఈ సోది పురాణము ద్వారా మీకు చెప్పదలచుకున్నది ఏమిటంటే.. మూగ జీవాల ఆహారము వాటి పిల్లల కోసం భగవంతుడు తయారు చేశాడు. వాటిని ఉపయోగించుకునే హక్కు మానవజాతికి లేదు. పాలను వదిలేసి జీవకోటిని పరిరక్షించుకుందాం.. పుట్టిన దగ్గరనుంచి ఆ జీవాలు మనకి చేసే మేలు ఒక్కటి కాదు. వ్యవసాయంలో అవి ఎంతగానో ఉపయోగపడతాయి. అవి మనకి అక్కరలేని వాటిని తిని బ్రతుకుతాయి. అవి చనిపోయిన తరువాత కూడా మనకి తోళ్ళని అందిస్తూ మన కాలి కింద చెప్పుల రూపంలో గుట్టుగా అణిగిమణిగి  ఉంటాయి. అలాంటి వాటికి ద్రోహం చెయ్యడం ఎంత వరకు న్యాయం? మనకి తెలిసిన “మృదంగం”, “తబల”  వంటి కొన్ని వాద్య పరికరాలు కూడా వాటి చర్మాలతోనే తయారు చేస్తారు. ఇలా అవి చేసే మేలు అనేకం ఉన్నాయి.



పాలు – ప్రత్యామ్నాయం:
                                ఉన్నట్టుండి పాలను మానడం మన వలన కాదు. అవి ఎంతగా దైనందిన జీవితంలో భాగం అయ్యాయంటే పాలు కాచడంతోనే అనేక ఇళ్ళల్లో దినచర్య మొదలవుతుందంటే అతిశయోక్తి కాదు. అంతగా అలవాటైన పాలను మానెయ్యడం మన వల్ల కాదు. కానీ మానడం వలన అనేక ఉపయోగాలున్నాయి.
                                 కొబ్బరిపాలు, సోయాపాలు, గోధుమపాలు, ఇలా అనేక ధాన్యాలతో మనం పాలు తయారుచేసుకోవచ్చు. అంతే కాదు ముఖ్యమైన టీ,కాఫీలను కూడా కాచుకోవచ్చు. అంతే కాకుండా గ్లాసు జంతువులపాలతో వచ్చే కేలరీల కన్నా ఈ కొబ్బరి, సోయా, గోధుమ పాల వలన వచ్చే కేలరీలు చాలా ఎక్కువగా ఉంటాయి. పైగా అత్యంత శ్రేష్టమైనవి కూడా. వీటిని ఇష్టంగా కూడా పిల్లలు తాగుతారు. ఇది శాస్త్రవేత్తలు నిరూపించిన సత్యం, ఒక్కసారి ప్రయత్నించి చూడండి.

గమనిక: ఈ వ్యాసము ఎవ్వరినీ ఉద్దేశించి రాసినది కాదు. ఎవ్వరి మనసునయినా నొప్పించి ఉంటే క్షమించమని ప్రార్ధన. నేను యూట్యూబ్ లో మూగజీవాల హింస మీద కొన్ని వీడియోలను చూసాను. దానిలో అత్యంత క్రూరంగా మనుషులు వాటిని చంపడం చూసాను. రాయాలనిపించినట్టుగా కొంత సోది రాసాను. ఇది ఎవరినీ ఉద్దేశించి రాసినట్టిది మాత్రం కాదు. నాకు రాయడం అస్సలు చేతకాదు. ఎక్కడయిననూ తప్పులు ఉంటే మరోసారి క్షమించమని ప్రార్ధన.

http://www.tv5news.in/districtwide/hyderabad/item/3727-illegal-milk-business-in-ap
http://www.andhrabhoomi.net/content/m-113
On Milk causes cancer
 http://www.youtube.com/watch?v=XDXxo5Sussk


Friday, November 2, 2012

మరుగేలరా ఓ రాఘవా త్యాగరాజ కృతి



మరుగేలరా ఓ రాఘవా త్యాగరాజ కృతి


త్యాగరాజ విరచితము

జయంతి శ్రీ రాగము

పల్లవి:
మరుగేలరా ఓ రాఘవా
మరుగేలరా ఓ రాఘవా..!!

అనుపల్లవి:
మరుగేల చరాచరరూప 
పరాత్పర సూర్యసుధాకరలోచనా..!!

చరణం:
అన్నినీవనుచూ అంతరంగమున
తిన్నగా వెదకి తెలిసి కొంటినయ్యా
నిన్నెగాని మది నేనెన్నజాల నొరుల
నన్ను బ్రోవవయ్యా త్యాగరాజనుత..!!



Tuesday, October 30, 2012

సీతమ్మ మాయమ్మ కృతి


సీతమ్మ మాయమ్మ కృతి:

త్యాగ రాజ విరచితము:

వసంత రాగమురూపకతాళము


పల్లవి:
 సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మాకు తండ్రి (2)

అనుపల్లవి: 
వాతాత్మజ ,సౌమిత్రి ,వైనతేయ, 
రిపు, మర్దన ,ధాతా, భరతాదులు, 
సోదరులు, మాకు ఓ మనసా..

చరణము:
పరమేశ ,వశిష్ట, పరాశర,నారద, 
శౌనకా, శుక,సురపతి ,గౌతమ, 
లంబో ధర ,గుహ, సనకాదులు
ధరనిజ భాగవతాగ్రేసరులెల్లరు
 వారెల్లను వర త్యాగరాజునకు
 పరమ బాంధవులు మనసా..

సీతమ్మ మాయమ్మ శ్రీ రాముడు మాకు తండ్రి..
సీతమ్మ మాయమ్మ..!!


Sunday, October 21, 2012

తెలుగు భాష - ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్


తెలుగు భాష - ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్



తెలుగు భాషకి గల గొప్పతనమును గురించి చెప్పే ప్రతి సారీ చాలా మంది  తెలుగు ని ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని తెలుగు భాషని ఎక్కడో వాడుకలో ఉన్న ఇటలీ భాషతో పోలుస్తారు.

తెలుగు అజంత భాష. అనగా దాదాపు ప్రతి పదము ఒక అచ్చుతో అంతము అవుతుంది. ఇటాలియన్ భాష కూడా అచ్చుతోనే అంతము అవుతుంది.
హిందీ మొదలయిన చాలా భారతీయ భాషలు హలంత భాషలు అనగా హల్లులతో అంతమయ్యే భాషలు. 

దీన్ని గమనించే 15వ శతాబ్దములో ఇటాలియన్ యాత్రికుడు నికొలో డా కాంటి తెలుగుని ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్  గా అభివర్ణించాడు. హెన్రీ మారిస్ మరియు చార్లెస్ ఫిలిఫ్ బ్రౌన్ లు కనుగొన్న విషయం ఇటాలియన్ భాష,తెలుగు భాష రెండింటి ఉచ్ఛారణలో ఉన్న సారుప్యాన్ని కనుగొన్నారు.

ఇటాలియన్ భాష లో ప్రతి పదం పలికేటప్పుడు చివర లో ఉచ్చరించేది “ఒక అచ్చు” ను అదే విధానం తెలుగుకూ ఉండటం తో “తెలుగు ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ ” అయ్యింది.ఒక ఇటాలియను పదం ఉదాహరణ గా మనకి తెలిసిన “ఫియట్” కారుని  విస్తరిస్తే ఫాబ్రికానా ఇటాలియానాఆటోమొబైలో టొరినో గా ప్రతి పదం చివర అచ్చు వచ్చి చేరుతుంది.

అచ్చుతో అంతమయ్యే విషయం వల్ల ఇది సంగీతపరంగా సంగీతకారులకు చాలా ఇష్టమైన భాష. ముఖ్యముగా కర్ణాటక సంగీతం లోని చాలా కృతులు తెలుగు భాషలోనే ఉన్నాయి. త్యాగరాజు, భద్రాచల రామదాసు, క్షేత్రయ్య, అన్నమయ్య, వంటివారు తమ తమ కృతులతో, కీర్తన లతో, తెలుగును సంగీతపరంగా సుసంపన్నం చేసినారు. 

పంతొమ్మిదవ శతాబ్దానికి చెందిన యూరోపియనులు తెలుగును “ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్” (Italian of the east) అని పిలుచుకున్నారు.నిజానికి ఇటాలియను కంటే తెలుగు పురాతనమైనది.కనుక్ల మనము ఇటాలియను భాషను  “తెలుగు ఆఫ్ యూరోపు” అని పిలుచుకోవచ్చు.



భామాకలాపం



భామాకలాపం


          ప్రసిద్ధమూ, ప్రాచీనమూ అయిన జానపద కళారూపాలలో కలాపం ఒకటి.కలాపం అనగానే అందరికీ భామా కలాపం, గొల్లకలాపం ముఖ్యంగా గుర్తుకు వస్తాయి.“కలాపముఅంటే ప్రదర్శించునది. ప్రదర్శనకు యోగ్యమయినది అని అర్ధం. భామా కలాపం, గొల్ల కలాపం, చోడిగాని కలాపం  ఇలా చాలారకాల కలాపాలు ఉన్నాయి.యక్షగానాలకు, ప్రబంధాలకు గల ముఖ్యమైన రూపాంతరాలే కలాపం, బుర్రకథ, హరికథ. ఒక నాయిక పాత్రను ధరించి ఆడుతూ, పాడుతూ తన కథను తానే మనకు చెప్పే యక్షగాన రూపమే కలాపం. భామాకలాపం, గొల్లకలాపం వంటివి మార్గశాఖకు చెందినవి.కలాపం ముఖ్య లక్షణం ఆడిపాడి అభినయించడం. తాండవ కదలికలు, స్త్రీ కదలికలు ఇందు ప్రధానముగా ఉంటాయి.

భామాకలాపము పుట్టిన విధానం

            శ్రీకాకుళంలోని ఆంధ్రవిష్ణువు దేవాలయంలో దేవదాసీలు భగవంతుని సేవగా చేసే నృత్యాన్ని, ఉడిపిలో సంగీత, సాహిత్య అభినయాలను అభ్యసించిన వారు సిద్దేంద్ర యోగి. "పారిజాతాపహరణం" కథనే తెలుగులో "పారిజాతం" అనే పేరుతో నృత్యనాటికగా సిద్ధేంద్రయోగి రచించారు. అదే "భామాకలాపం"గా ప్రసిద్ధి చెందింది. భామాకలాపాన్ని కూచిపూడిలోని బ్రాహ్మణుల పిల్లలకు బోధించారు. కూచిపూడిలో పుట్టిన ప్రతిమగపిల్లవానికి సిద్ధేంద్రుని పేరుచెప్పి, ముక్కు కుట్టి, కాలిగజ్జె కట్టి, పిల్లవాడు పెద్దయ్యాక వృత్తిని అవలంబించినా గాని స్వామి సన్నిధిలో భామవేషం వేసి తీరాలని, స్త్రీలకు కళలో ప్రవేశం ఉండరాదని సిద్ధేంద్రుడు శాసించాడు. నియమం చాలాకాలంవరకూ కొనసాగింది.



భామాకలాపం

          'కలాపము' అంటే "ప్రదర్శించునది,'కలత' లేదా 'కలహము' అని అర్ధము.
"భామ"  శ్రీ కృష్ణుడి  అందమైన, అసూయాపరురాలైన సత్యభామ.  17 శతాబ్దంలో  సిద్దేంధ్ర యోగి దీని రూపకల్పన చేశారు.హాస్యము, శృంగార రసములు ఇందులో ప్రధానముగా ప్రదర్శింపబడతాయి.

          సత్యభామ అందం, జాణతనం, అహంకారం, తెలివెతేటలు, వీరత్వం కలిగిన పాత్ర. సగటు భారత మహిళ మనస్తత్వము సత్యభామలో ప్రస్పుటముగా గోచరిస్తుందిశ్రీ కృష్ణుడిని కాలితో తన్నినపుడు బాధ పడేదీ సత్యభామే.. తక్కిన సవతులతో తనకు తాను పోల్చుకునేదీ సత్యభామే.. సత్యభామ ఆలోచించే విధానం,రెప్ప పాటయినా పతి వియోగాన్ని భరించలేని సత్యభామ అవస్థలు, ఆలోచనలు, నడవడిక అంతా భామాకలాపములో చాలా చక్కగా కనిపిస్తుంది.
          సుమారు ఐదు వందల సంవత్సరాల  క్రితం  ఆరంభమైన భామాకలాపం కళారీతి ప్రస్తుతం మూడు రీతులలో ప్రవర్ధిల్లుతున్నది. కృష్ణ, గుంటూరు జిల్లాలలో ప్రచారంలో ఉన్న భామాకలాపం కూచిపూడి సంప్రదాయంపశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాలో దేవదాసీలు ప్రచారం చేసిన శైలి లాస్యపద్ధతి. విశాఖ, గోదావరి జిల్లాల లో "ద్రుపద బాణీ" ప్రచారంలో ఉన్నది.సమస్త జీవనానికి అర్ధం అయ్యేలా దీని సాహిత్యం ఉండటం, నవరసభరితంగా ఉండటం వలన ఇవి జనంలోకి అంతగా కలిసిపోయాయి.

భామాకలాపం - వివరణ

          భామకలాపము "శ్రీగదితము" అనే నృత్య రూపకమునకు  చెందినది. ఇది ఏకాంకిక.ఇందులో నాయకుడు శ్రీకృష్ణుడు. కలాపం వాగ్వాపారమునకు చెందిన భారతీ వృత్తి. విఘ్నేశ్వర స్తుతి,సరస్వతీ ప్రార్ధన ఇందులో మొదట కనిపిస్తాయి.

భామనే సత్యభామనే
భామరో శృంగార జగదభిరానే
ముఖవిజిత హేమాధామనే
ద్వారకాపురాఢ్యురామనే
వయ్యారి సత్యాభామనే


           అత్తమామల ప్రశస్తి, భూదేవిని ప్రశంసించదం,వెన్నెల పదము, మరికొన్ని దరువులు,దశావతార వర్ణన,మంగళహారతి  ఇందులో ముఖ్యంగా కనిపిస్తాయి...
           కాలక్రమంగా భామాకలాపం అనేక మార్పులు  పొందింది. వాటిలో ముఖ్యమైన మార్పు సత్యభామ అష్టవిధ కథానాయికలుగా అభినయించడం. అలా మార్పులు చేసినవారిలో ముఖ్యుడు పశ్చిమ గోదావరి జిల్లాకుచెందిన ఆకివీడు వాస్తవ్యుడు జగన్నాధుడు సిద్ధేంద్రునికి రెండువందల సంవత్సరాల తరువాతివాడు.
            మొదట్లో వీటిని కూచిపూడి భాగవతులలో మగవారు మాత్రమే  స్త్రీగా వేషం మార్చుకుని ప్రదర్శించేవారు. తరువాత మహిళలు ఇచ్చే ప్రదర్శనలే ఎక్కువగా కనిపిస్తునాయి.
             ఈ కలాపమంతా  సంపూర్ణముగా శ్రీ కృష్ణుని జగన్నాటకముగా రూపొందించ బడింది. దశవిధ కామావస్థలు, వేదాంతం పరమార్ధం,వేదాంత ప్రబోధలు దీనిలో అంతర్గతముగా చెప్పే విషయాలు.

భామాకలాపం సాహిత్యం

భామనే..సత్యభామనే!
సత్యభామనేసత్యభామనే!
వయ్యారి..ముద్దుల!
వయ్యారి..ముద్దుల!
సత్యభామనే!సత్యభామనే!

భామనే పదిఆరువేలా కోమలులందరిలోనా!
భామనే పదిఆరువేలా కోమలులందరిలో!
లలనా చెలియా మగువా సఖియా
రామరో గోపాల దేవుని ప్రేమనూ దోచిన దానా!!
రామరో గోపాల దేవుని ప్రేమనూ దోచిన
సత్యభామనే !సత్యభామనే !

ఇంతినే చామంతినే మరుదంతినే విరిబంతినే!
ఇంతినే చామంతినే మరుదంతినే విరిబంతినే!
జాణతనమున సతులలో
నెరజాణనై నెరజాణనై
నెరజాణనై వెలిగేటి దాన!
సత్యభామనే!సత్యభామనే!

భామనే..సత్యభామనే!
సత్యభామనేసత్యభామనే!
వయ్యారి..ముద్దుల!
వయ్యారి..ముద్దుల!
సత్యభామనే!సత్యభామనే!


అందమున ఆనందమున గోవిందునకు నెరవిందునై!
నంద నందనుడు ఎందుగానక 
డెందమందున్న క్రుంగుచున్న!!

భామనే..సత్యభామనే!
సత్యభామనేసత్యభామనే!
వయ్యారి..ముద్దుల!
వయ్యారి..ముద్దుల!
సత్యభామనే!సత్యభామనే!


కూరిమి సత్రాజిత్తు కూతురై ఇందరిలోన!
నాదు మగనిని బాసితల జాలకా యున్నట్టి దాన!!

భామనే..సత్యభామనే!
సత్యభామనే!సత్యభామనే!
వయ్యారి..ముద్దుల!
వయ్యారి..ముద్దుల!
సత్యభామనే!సత్యభామనే!