పుష్పవిలాపం
కొందరు కవులు రాసిన వర్ణనలను చదివినప్పుడు ఆడవారికి పూలకు విడదీయలేని అవినాభావసంబంధమేదో ఉందనిపించేది. పుష్పవిలాపం గురించి విననంత వరకూ.. పూలను మానవుల అవసరాల కోసం, సంతోషం కోసం, పూజాధికాల కోసం దేవుడు సృష్ఠించాడేమో అనుకునేదాన్ని. కానీ ఈ కావ్యం చదివిన తరువాత పూలకు మనసుంటుందా? అవి ఇంతలా బాధపడ్తాయా అనిపించింది. మన ఆహ్లాదం కోసం వాటికి ఇబ్బంది కల్గించకూడదేమో అనిపించింది. 'నాకు పూలు నచ్చవు' అని చెప్పే ఆడవారిని మనం అరుదుగా చూస్తుంటాం. ఇది చదివిన తరువాత ఆడవారికి పూలపట్ల మనసు పోదేమోననిపించింది..! జంధ్యాల గారి కావ్యానికి ఘంటసాల గారి గానం కలగలిసి మనసును కరిగించేస్తుంది ఈ కావ్యం.
పుష్ప విలాపం పద్యాలు - కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి
చేతులారంగ నిన్ను పూజించుకొరకు
కోడి కూయంగనే మేలుకొంటి నేను;
గంగలో మున్గి ధౌత వల్కలము గట్టి
పూలు కొనితేర నరిగితి పుష్పవనికి
నీ పూజ కోసం పూలు కోసుకొద్దామని పొద్దున్నే మా తోటలోనికి వెళ్ళాను ప్రభూ
ఉదయశ్రీ అరుణారుణ కాంతులతో ఉద్యానవనం కలకలలాడుతోంది పూల బాలలు తల్లి ఒడిలో
అల్లారు ముద్దుగా ఆడుకుంటున్నాయి అప్పుడు...
నే నొక పూలమొక్క కడ నిల్చి చివాలున కొమ్మవంచి గో
రానెడు నంతలోన విరు లన్నియు జాలిగ నోళ్ళు విప్పి "మా
ప్రాణము తీతువా" యనుచు బావురు మన్నవి; క్రుంగిపోతి; నా
మానసమం దెదో తళుకు మన్నది పుష్పవిలాప కావ్యమై..!
అంతలో ఒక సన్నజాజికన్నె సన్నని గొంతుకతో నన్ను చూసి యిలా అంది ప్రభూ...
తల్లి యొడిలోన తలిరాకు తల్ప మందు
ఆడుకొను మమ్ములను బుట్టలందు చిదిమి
అమ్ముకొందువె మోక్ష విత్తమ్ము కొరకు!
హౄదయమే లేని నీ పూజ లెందుకోయి?
జడమతుల మేము; జ్ఞానవంతుడవు నీవు;
బుధ్ధి యున్నది; భావ సమౄద్ధి గలదు;
బండబారె నటోయి నీ గుండెకాయ!
శివునకై పూయదే నాల్గు చిన్ని పూలు?
ఆయువు గల్గు నాల్గు గడియల్ కని పెంచిన తీవతల్లి జా
తీయత దిద్ది తీర్తు ము; తదీయ కరమ్ములలోన స్వేచ్ఛమై
నూయల లూగుచున్ మురియుచుందుము; ఆయువు దీరినంతనే
హాయిగ కన్ను మూసెదము ఆయమ చల్లని కాలి వ్రేళ్ళపై.
ఎందుకయ్యా మా స్వేచ్చ జీవనానికి అడ్డు వస్తావు..? మేము నీకేం అపకారము చేసాము???
గాలిని గౌరవింతుము సుగంధము పూసి; సమాశ్రయించు భృం
గాలకు విందు చేసెదము కమ్మని తేనెలు; మిమ్ము బోంట్ల నే
త్రాలకు హాయిగూర్తుము; స్వతంత్రుల మమ్ముల స్వార్ధ బుద్ధితో
తాళుము త్రుంప బోవకుము; తల్లికి బిడ్డకు వేరు సేతువే!
యింతలో ఒక గులాబి బాల కోపంతో మొగమంతా ఎర్రబడి యిలా అంది ప్రభూ..!
ఆత్మ సుఖమ్ము కోసమయి అన్యుల గొంతులు కోసి తెచ్చు పు
ణ్యాత్ముడ! నీకు మోక్ష మెటు లబ్బును? నెత్తురు చేతి పూజ వి
శ్వాత్ముడు స్వీకరించునె? చరాచర_వర్తి ప్రభుండు మా పవి
త్రాత్మల నందుకోడె! నడమంత్రపు నీ తగులాట మేటికిన్?
ఊలు దారాలతో గొంతు కురి బిగించి
గుండెలో నుండి సూదులు గ్రుచ్చి కూర్చి
ముడుచు_కొందురు ముచ్చట ముడుల మమ్ము
అకట! దయలేని వారు మీ యాడువారు
గుండె తడి లేక నూనెలో వండి పిండి
అత్తరులు చేసి మా పేద నెత్తురులను
కంపు దేహాలపై గుమాయింపు కొరకు
పులుముకొందురు హంత! మీ కొలము వారు.
అక్కట! హాయి మేము మహిషాసురు లెందరొ నాల్గు ప్రక్కలన్
ప్రక్కల మీద చల్లుకొని మా పసిమేనులు పాడు కాళ్ళతో
ద్రొక్కుచు దొర్లి - దొర్లి - మరు రోజుదయాననె వాడి వత్తలై
రెక్కలు జారిపోఁ పరిహరింతురు మమ్ముల పెంటదిబ్బ పై.
మా వెలలేని ముగ్ధ సుకుమార సుగంధ మరంద మాధురీ
జీవిత మెల్ల మీకయి త్యజించి కృశించి నశించిపోయె; మా
యౌవన మెల్ల కొల్లగొని ఆ పయి చీపురుతోడ చిమ్మి మ
మ్మావల పారబోతురు గదా! నరజాతికి నీతి యున్నదా !
వోయీ మానవుడా..........!!
బుద్ధ దేవుని భూమిలో పుట్టినావు
సహజ మగు ప్రేమ నీలోన చచ్చెనేమి?
అందమును హత్య చేసెడి హంతకుండ!
మైలపడిపోయె నోయి! నీ మనుజ జన్మ.
పూజ లేకున్న బాబు నీ పున్నె మాయె!
కోయ బోకుము మా పేద కుత్తుకలను
అకట! చేసేత మమ్ముల హత్య చేసి
బాపుకొన బోవు ఆ మహా భాగ్య మేమి?
ఇట్లు పుష్పాలు నన్ను చీవాట్లు పెట్టి
నట్లుగాన్ - పూలు కోయ చేయాడలేదు;
ఏమి తోచక దేవర కెరుక సేయ
వట్టి చేతులతో ఇటు వచ్చినాను..
సారాంశం
పాపయ్య శాస్త్రి గారు సృష్టించిన మధుర మనోజ్ఞ కరుణ రస భావ కావ్యమిది.
భక్తుడు దైవ పూజ కోసం పూలు కోయబోయే సమయంలో ఆ పూలు 'మా ప్రాణాలు తీయబోకు..'
అని బావురుమని ఏడ్చాయి.
''తల్లి ఒడిలో ఆడుకునే మమ్మల్ని కోసి,
బుట్టల్లో అదిమి.. చిదిమి.. అమ్మేస్తున్నారు. మోక్షమనే విత్తం కోసమే కదా మీ
ఆరాటం'' అని ఈసడించాయి. ''అమాయకులమైన మేము తీగతల్లిని అంటుకుని నాలుగు
ఘడియలు ఆనందంగా గడిపి.. ఆ తల్లి చల్లటి పాదాలపైనే రాలి, కన్నుమూస్తాం.
జీవించి ఉన్నంత కాలం మేం నిస్వార్థంతో సుగంధమిచ్చి గాలిని గౌరవిస్తాం.
తుమ్మెదలకు మకరందం అందించి విందు చేస్తాం. మీలాంటి మనుషులకు కనువిందు
చేస్తాం. అలాంటి స్వతంత్రులైన మమ్మల్ని మా తల్లి నుంచి వేరు చేయొద్దు''.
అని ప్రాధేయపడ్డాయి.
''మీ సంతోషం, తృప్తి కోసం ఊలు దారాలతో
మా గొంతులకు ఉరి బిగించి.. గుండెల్లో సూదులు గుచ్చి.. మాలలు కట్టి
ఆడవాళ్లు.. పడకల మీద చల్లుకుని మగవాళ్లు.. మమ్మల్ని అనుభవిస్తారు. మా
గొంతులు కోసి దైవ పూజ చేస్తారు''.
''దైవం మాలో లేడా..!
విశ్వాత్ముడైన పరమాత్మ మీ నెత్తుటి పూజను స్వీకరిస్తాడా..? చివరికి
మమ్మల్ని చీపుళ్లతో బయటకు ఊడ్చేస్తారు. కొందరైతే నూనెలో వండి అత్తర్లుగా
చేసి.. తమ కంపు దేహాలపై పులుముకుంటారు. మీ మానవులంతా హంతకులు.. మీకు నీతి
లేదు... బుద్ధుడు పుట్టిన పవిత్ర భూమిలో పుట్టిన మీలో సహజంగా ఉండే ప్రేమ
ఎందుకు చచ్చిపోయింది...? పూల హంతకులుగా మారి మానవతకు మచ్చతేవద్దు'' అని
పూలు భక్తుడిని వేడుకుంటాయి. ఆ ప్రార్థన, చీవాట్లు విన్న భక్తుడు ఏం చేయాలో
తోచక వట్టి చేతులతో వెనుదిరిగి వెళతాడు.
ఈ కావ్యం ఘంటసాల గారి గళమునందు..!!