భవిష్యోత్తర పురాణము లోని కథ
అన్నమాచార్యుల
కృతులలో మనకు తొండమాన్ చక్రవర్తి పేరు వినిపిస్తుంది. కలియుగ ప్రత్యక్ష దేవుడైన
శ్రీ వేంకటనాథునికి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి అయిన పద్మావతీ దేవిని
కన్యాదానమిచ్చిన మహానుభావుడు తొండమండలాధీశుడైన ఆకాశరాజు. తొండమానుడు ఆకాశరాజు
సోదరుడు. అమిత శ్రీనివాస భక్తుడు. స్వామి ఆజ్ఞపై తిరుమల భవ్య మందిర నిర్మాణము
చేయించిన ధన్యజీవి. బ్రహ్మాది దేవతలు నిత్యం వచ్చి శ్రీవేంకటపతిని సేవించుకునేది
తొండమానుడు కట్టించిన ఆలయంలోనే. తొండమానుడు ఎంతటి భక్తుడంటే నిత్యము స్వామితో
సంభాషణలు చేసేవాడు!
ఇలా
ఉండగా ఒకరోజు ఆకాశవాణి “ఆహా! ఎంత పుణ్యం చేసుకున్నావయ్యా! శ్రీనివాసుని ప్రతి
కైంకర్యుము నీచేతుల మీదిగా శ్రద్ధాభక్తులతో రంగ రంగ వైభవంగా చేయిస్తున్నావు. రాజా!
నీవంటి విష్ణుభక్తుడు లేడయ్యా” అని అన్నది. అంతవరకూ స్వామిగురించి తప్ప ఏమీ
ఆలోచించని తొండమానుడు “ఆకాశవాణి మాటలు నిజమే కదా! నావంటి భక్తుడు అరుదు” అని
అనుకున్నాడు.
అహంకారమెంత
దారుణమైనది. చివరికి మహనీయుడైన తొండమానుని సైతం విడువలేదు! అహంకారమే సకల దురుతాలకు
మూలము. అహంకారం గర్వం ఎంత కొంచమైనా అది ఉన్నవాడిని నిలువునా దహించివేస్తుంది. కానీ
స్వామి సామాన్యుడా? ఒక్కసారి త్రికరణశుద్ధిగా శరణువేడిన పరమ శత్రువునైనా
దరిజేరుస్తాడు. అలాంటిది సర్వసుగుణవంతుడు మహాభక్తుడు అయిన తొండమానుని పతనం
జరగనిస్తాడా? వెంటనే తొండమానునికి గుణపాఠం నేర్పాలని నిశ్చయించుకున్నాడు స్వామి.
ఒకరోజు
తొండమానుడు స్వామితో సంభాషించుచూ “నావంటి భక్తుడు ఈ ప్రపంచంలో లేడు. అసలు నేను
తప్ప నీకు నిజభక్తులు ఎవరైనా ఉన్నారా దేవాదిదేవా?” అని ప్రశ్నించాడు. జగన్నాటకసూత్రధారి
అప్పటికి చిరుమందహాసముతో సమాధానమిచ్చిఆ తొండమానునికి గుణపాఠం చెప్పే నాటకానికి
అప్పుడే శ్రీకారం చుట్టాడు.
ఒకరోజు
తొండమానుడు రోజూలానే ఉదయాన్నే స్వామి దర్శనము చేసుకొని నిశ్చల భక్తితో ఆ
పరమపురుషుని ధ్యానించి కలిదోషనివారణములైన శ్రీపాదలను చూశాడు. శ్రీహరిపాదం చుట్టూ
ఉన్న కోట్లాది సౌర్యమండలాల వలె ప్రకాశిస్తున్నాయి తొండమానుడు పూజించిన సువర్ణ
కమలాలు. కన్నులు మినుమిట్లు గొలిపే ఇంతటి
సువర్ణకాంతులలోను రాజుకు వాడిపోయి మట్టి అంటుకొని ఉన్న కమలాలు తులసీదళాలు
కనబడ్డాయి. “ఏమిటీ చిత్రమ్? వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి అయినా ఈ
సుమాలిక్కడికి ఎలా వచ్చాయి? నేను స్వామిని స్వర్ణ కమాలతో తప్ప పూజించను కదా!” అని
తర్కించుకొని నేరుగా స్వామినే ఈ ప్రశ్నవేశాడు. ఆ దయామయుడు చిరుమందహాసముతో ఇలా
సమాధానమిచ్చాడు.
“నాయనా!
ఇక్కడికి కొంత దూరములో ఉన్న పేదపల్లెలో ఒక సామాన్య కుమ్మరి ఉన్నాడు. అతని పేరు
భీముడు. పాపం అతనికి నేనంటే ఎనలేని భక్తి ప్రేమ. అతనుండే ఇంటి మట్టి గోడలో ఒక గూడు
చేసి అందులో నా కఱ్ఱబొమ్మ ఒకటి మలచి అందులో నన్ను భావించుకొంటూ పూజిస్తుంటాడు.
భక్తుడు ఎక్కడ భావిస్తే అక్కడ దీపించడం నా బాధ్యత కదా! ప్రహ్లాదుని కథ నీకు తెలియనిది
కాదుకదా! పాపం అతనికి మంత్రతంత్రాలు తపోయోగాలు ఏమీ తెలియవు. అయినా త్రికరణశుద్ధిగా
నిరంతరం నన్ను ధ్యానిస్తూనే ఉంటాడు. తాను కుండలు చేస్తున్నా అన్నం తింటున్నా
ఎప్పుడు నా ఊసే! నా ధ్యాసే!
తన
కులాచారం ధర్మం ఎల్లవేళలా పాటిస్తాడు. సూర్యోదయాత్పూర్వమే లేచి తనకు తెలిసిన
రీతిలో స్నానాది శౌచములు ఆచరించి నా పేరు స్మరిస్తూ తులసీదళాలు సమర్పిస్తాడు.
అక్కడ అతడు వేసిన దళాలే నీకిక్కడ కనబడుతున్నాయి. అతనే కాదయ్యా వారి కుటుంబమంతా
అంతే. నా మాట నా పాట తప్ప వారికేదీ రుచించదు. ఆ భీమ కులాలుని భక్తిపాశాలకు బంధీ
అయిపోయానయ్యా!”
విషయం
తెలిసింది తొండమానునికి. భాష్పపూరితనయనాలతో “ప్రభూ!” అని ఆర్తితో పిలిచి
స్వామిపాదాలపైపడి “జగన్నాథా! నా తప్పు క్షమించు. నావంటి భక్తుడు లేడని
అహంకరించాను. నేను చూసిన ప్రపంచమెంత? నా అనుభవం ఎంత? నాపై దయతో నా బుద్ధిదోషాన్ని
పోగొట్టి నిజమైన భక్తుని చేశావు తండ్రీ. ఇదుగో ఇప్పుడే వెళ్ళి భీముని దర్శనము
చేసుకొని వస్తాను. నాకు సెలవు ఇవ్వు” అని చెప్పి బయలుదేరాడు రాజు.
“నాహం వసామి వైకుంఠే నయోగి హృదయే రవౌ
|
మద్భక్తాః యత్రగాయంతి తత్ర తిష్ఠామి
నారద!”
అన్న
సూక్తి ప్రకారము భీముని దర్శనము తీర్థయాత్రగా భావించి రాజు నడుచుకుంటూ వెళ్ళాడు.
పుణ్యక్షేత్రాలకు కాలినడకనే ప్రయాణము చేయాలి కదా! భీముని ఇల్లు చేరాడు రాజు.
భీముని ఇల్లు స్వామి భజనలతో మారుమ్రోగుతున్నది. భీముని పాదాలపైపడి “అయ్యా! శ్రీ
వేంకటేశుని ద్వారా నీ మహాత్మ్యము తెలిసుకున్నాను. సాక్షాత్ ఆ శ్రీమన్నారాయణుడే నీ
భక్తిని కొనియాడాడయ్య! నీ పాదధూళి తాకి పునీతుడని అవుదామని వచ్చాను” అని అన్నాడు
తొండమానుడు. చక్రవర్తి ఏమిటి నా పాదలు తాకడం ఏమిటి అని వెనక్కు జరిగిపోయి చేతులు
జోడించి “రాజా! అంత పని చేయద్దు. స్వామికి దివ్యాలయం కట్టించిన మహానుభావుడవు నీవు”
అని అన్నాడు.
ఇంతలో
గరుడారూహుడై స్వామి లక్ష్మీదేవితో సహా ప్రత్యక్షమైనాడు. భీముని ఆనందానికి
అంతులేదు. “ఓ దయామయ! నా పూరి గుడిసెకు వచ్చావా! నీ లీలలే లీలలయ్యా. మా తప్పులెన్నక
దయావర్షం కురిపించే కాలమేఘానివి స్వామీ నీవు. నేను హనుమంతుని వలె వారధిదాటి నిన్ను
మెప్పించలేను, శబరివలె భక్తిశ్రద్ధలు చూపి నిన్ను ఆకట్టుకోలేను, జనకుని వలె సీతను
ఇవ్వలేను, నారదుని వలె గంధర్వగానముతో నీ గుణగణాలను కీర్తించలేను, జటాయువు వలె నీకై
నా ప్రాణాలు ఇవ్వలేను అయినా నిన్ను శరణువేడిన నన్ను కరుణించిన కరుణామూర్తివి నాయనా
నీవు” అని స్తుతించాడు. భీముడిలా తన్మయత్వంతో ఆడిన మాటలను వేదమంత్రాలు వింటున్నంత
ప్రీతితో విన్నాడు స్వామి.
మహాభక్తురాలైన
భీముని భార్య తమాలినీ కూడా గద్గద స్వరంతో అమ్మని కీర్తించింది. ఆదిదేవుడు
మహాలక్ష్మి స్వయంగా తన యింటికివచ్చారు. వారికి ఇవ్వదగినది ఏమీ లేదే అని
బిడియపడింది. అది గమనించి శ్రీనివాసుడు “తమాలినీ! నీ చేతితో ఏది వండి ఇచ్చినా
తింటానమ్మా” అని అన్నాడు. తమాలినీ సంతోషానికి పట్టపగ్గాలులేవు. తనకు పెద్దల వలన
తెలిసినంతలో యథాశక్తిగా శుచితో తామర తూడ్లతో వంటకాన్ని వండి లక్ష్మీనారాయణులకు
వడ్డించింది. తృప్తిగా ఆరగించారు అలమేలుమంగాశ్రీనివాసులు. తొండమానుడు చూస్తుండగానే
దివ్యశరీరధారులై వైకుంఠధామానికి చేరారు భీమకులాల దంపతులు.
ఇదంతా
ఆశ్చర్యంగా చూసిన తొండమాను “ప్రభూ! నా సంగతేమిటి” అని ప్రాధేయపడ్డాడు. అప్పుడు
జగన్నాథుడు “రాజా! తరువాత జన్మలో నీవు విరాగివై నా ఏకాంతభక్తుడవు అవుతావు. అప్పుడు
తప్పక నీకు ముక్తి లభిస్తుంది” అని చెప్పి తొండమానుని ఊరడించాడు. ఇలా తొండమానునికి
భీమునికి ముక్తిని ప్రసాదించాడు శ్రీవేంకటేశుడు.
అహంకారం
ఎంతవారికైనా ఎంతకొంచమైనా తగదు. మహనీయుడైన తొండమానునికే అహంకారము వలన భంగపాటు
తప్పలేదు. ఇక సామాన్యులమైన మనసంగతి ఏమిటి? కాబట్టి మనమెల్లప్పుడు వినయవిధేయతలతో ఉండాలి. కులధర్మం కర్తవ్యం పాటిస్తూ స్వామిని నిష్కల్మష
భక్తితో కొలిచే వారిని కరుణిస్తాడు భగవంతుడు అని నిరూపించాడు భీముడు. కులం కన్నా
గుణం ప్రధానమైనది.