పాలు మనుషులకు అవసరమా?!
పాలు ( మిల్క్ ) ఈ పదము వినని మనిషి ఉండడంటే అతిశయోక్తి కాదేమో..! పాలు నిత్య జీవితములో ఎంత భాగమయ్యాయి అంటే అవి నిత్యావసరాల కన్నా అత్యవసరాలయ్యాయి. మనం పిల్లలకి ఉగ్గుపాల కన్నా ముందు పాలు పరిచయం చేస్తున్నాము.
పాలల్లో రకాలు:
చనుబాలు, చన్నుపాలు (woman's milk, human milk.), ఆవు పాలు ( cow’s milk) ,గేదె పాలు, మేక పాలు , చెరుకుపాలు (the juice of the sugar cane.), టెంకాయపాలు (the white juice expressed from the coconut kernel by pounding. (టెంకాయనీళ్లు is the water in the coconut.), మర్రిపాలు (the milky juice of the banyan tree.), చెట్లయందు గలుగు తెల్లని రసము.
దేవుడు జీవులన్నిటినీ సమానంగా సృష్టించాడు కానీ మనిషికి మాత్రం కొంచెం తెలివి, బుద్ధి కుశలత అధికంగా ఇచ్చాడు. దేవుడి సృష్టి ప్రకారము మనిషి పాలు మనిషి తాగాలి. ఆవు పాలు, గేదెపాలు, మేకపాలు వాటికి పుట్టిన లేగదూడలు, మేకపిల్లలు తాగాలి. లోకం లో జీవులన్నీ సహజం గానే జీవిస్తున్నాయి. ఒక్క మనిషి మాత్రం తనకు దేవుడిచ్చిన తెలివితేటలను అతి తెలివితేటలుగా మార్చుకుని అతి అసహజంగా జీవనం సాగిస్తున్నాడు. మనిషి పాలను మనిషి తాగడమే కాక జంతువుల పాలను కూడా దోచుకుని మరీ తాగుతున్నాడు. అదీ వాటికి పుట్టిన దూడలకు కూడా దక్కనీయకుండా. పైగా ఆ పాలు అధికంగా రావడంకోసం వాటికి మందులను చేర్చి వాటి ప్రాణాలతో చెలగాటాలాడుతున్నాడు.
తల్లి పాలు – విశిష్టత:
పుట్టిన బిడ్డకు ఆరు నెలలు పాటు తల్లిపాలు ఇవ్వాలి. అలా ఇవ్వడం ద్వారా బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యం అందిస్తున్నట్టు. తల్లిపాలు బిడ్డ ఉదరములో సులభంగా జీర్ణమవుతాయి. జీర్ణకోశ ఇబ్బందులు రానివ్వవు. తల్లిపాలు తాగే పిల్లల ముక్కు, గొంతు లోపల ఒక రక్షిత పొర ఏర్పడుతుంది. దీనివలన పిల్లలకు ఆస్త్మా, చెవులకు సంబంధించిన అనారోగ్యాలు కలుగవు. పోతపాలు కొంతమంది పిల్లల్లో ఎలర్జీ తెస్తాయి.తల్లిపాలు తాగి పెరిగిన పిల్లల్లో స్థూలకాయం అంత త్వరగా రాదు. తల్లిపాలు మానసిక బంధానికి పనికొస్తాయట. తల్లిపాలు తాగిన పిల్లలు తల్లితో ఎంతో ప్రేమగా, నమ్రతతో ఉంటారని పరిశోధనలు చెప్తున్నాయి. పిల్లల మేధోశక్తిని పెంచగలిగినవి తల్లిపాలు. మెదడు ఎదుగుదలతో తల్లిపాలు పాత్ర వహిస్తాయి. తల్లిపాలు తాగిన పిల్లలకు జ్ఞాపక శక్తి ఎక్కువ ఉండి చురుకుగా ప్రవర్తిస్తారు. అంటు రోగాలు అంత త్వరగా సోకవు. బిడ్డకు ఇన్నిరకాలుగా మేలుచేస్తుంది కాబట్టి అమృతంతో తల్లిపాలును పోలుస్తారు.
మనిషి పాలలో 71 కిలో కేలరీలు , ఆవు పాలలో 69 కిలోకేలరీలు, గేదె పాలలో 100 కిలో కేలరీలు మరియు మేక పాలలో 66 కిలో కేలరీలు శక్తి ఉంటుంది.
దీని ప్రకారం చూస్తే.. మనిషి బ్రతకడానికి సరిపడా పిల్లలకి రెండు సంవత్సరాలు నిండే వరకు తల్లి పాలు సరిపోతాయి. కానీ వాటికి అదనంగా గేదె పాలను, ఆవుపాలను కూడా కలిపి పట్టిస్తున్నారు. మనం ఇందులోని వాస్తవాలను గమనిస్తే.. ఒక లేగ దూడ తన తల్లి పాలు తాగిన ఆరు నెలల్లో పూర్తి గా, ఊహకందని రీతిలో ఎదుగుతుంది. కానీ మనిషిలో మాత్రం రెండు సంవత్సరాలైనా శారీరక ఎదుగుదల అంతగా కనపడదు. మరి తల్లి పాల స్ధానంలో మనిషి ఆవు, గేదెల పాలు తాగితే మనిషి పెరుగుదల ప్రకృతికి విరుద్ధం గా ఉంటుంది. అది అసాధారణ రీతిలో ఉంటుంది. పదేళ్ళకే శారీరకంగా అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. తద్వారా బుద్ధి మందగించడం, బద్ధకం పెరుగుతాయి. తెలివితేటలు తగ్గిపోతాయి.
పుట్టుకతో ప్రతి బిడ్డ తన తల్లి పాలను మాత్రమే తాగుతాడు. పోత పాలను ( ఆవు,గేదె,మేక పాలను) ఇష్ట పడడు. కక్కుకుంటాడు. కానీ మనుషులు మాత్రం వాటికి అనేక రకాలైన రుచి కరమైన పదార్ధాలను చేర్చి మరీ వాళ్ళ చేత బలవంతంగా తాగిస్తారు. ఈ మార్పులు మనకి మామూలుగా అర్ధం కావు ఎందుకంటే ప్రతి ఒక్కరు తాగే వారే ఉన్నారు కనుక..!
పాలు ఎందుకు బలం? ఇది నిజమేనా?! మనిషికి మాత్రమే పాల అవసరం ఎందుకు వస్తున్నది? మనిషి పాలు మనిషి తాగిన తరువాత కూడా వేరే జంతువు పాలు ఎందుకు దోచుకుని మరీ తీసుకోవలసి వస్తున్నది?పాలు అనేది రక్తం. ఆడది తన రక్తాన్ని పాలుగా మార్చి తనకు పుట్టబోయే బిడ్డకు సంవత్సరాల పాటు అందిస్తుంది.ఆవులు, గేదెలు, మేకలు మాత్రము తల్లులు కావా?! వాటి పాలను దొంగిలించి మన పిల్లలకు పట్టడానికి మనకు ఎటువంటి అధికారం ఉన్నది? ఈ విధంగా చెయ్యడం వలన మన జాతికే ముప్పు వాటిల్లునట్టి పరిస్ధితులు ఏర్పడవా?! ఆ మూగజీవాలకి రక్షణ లేదని ఎవరూ అడిగే వాళ్ళని ఈ విధం గా చెయ్యడం భావ్యమేనా?!
ఇవన్నీ నా మట్టిబుర్రలో మెదలుతున్న సందేహాలు.. వీటికి కారణాలు లేకపోలేదు. యూ ట్యూబ్ వంటి వీడియో వెబ్ సైట్లలో ఒక సారి శ్రమ అనుకోకుండా మానవుల వలన ఆవులు, గేదెలు ఎంత ఘోరంగా బలౌతున్నాయో ఒక్క సారి చూడండి. వీటిలో మానవుల ప్రమేయము ప్రత్యక్షంగానే కాక పరోక్షంగా కూడా ఉన్నదేమో నని నా అభిప్రాయం. పాల కోసం ఆ మూగజీవాలకి చిత్రవిచిత్రమైన రసాయనాలని కలిపి అధికంగా పాలను ఇచ్చే విధం గా సంకర జాతులుగా మారుస్తున్నారు. వీటి ద్వారా అవి ఏళ్ళ పాటు ఇవ్వవలసిన పాలను కొన్ని నెలల్లోనే ఇచ్చి, అవి రోగగ్రస్ధ జీవులుగా మారుతున్నాయి. వాటిని అప్పుడు కూడా వదలకుండా బ్రతికున్న వాటిని యంత్రాలలో వేసి అతి క్రూరముగా చంపుతున్నారు. ఇంతటి గొప్ప అతితెలివి తేటలు కలిగిన కొందరు మానవులు చేస్తున్న ఈ ప్రయోగాలకు అవి అన్యాయంగా బలౌతున్నాయి. మనకి దేవుడు ఈ ప్రపంచంలో బ్రతికే హక్కును మాత్రమే ఇచ్చాడు. వేరొక జీవి స్వేచ్చను హరించే హక్కులను ఇవ్వలేదు. భగవంతుడు అందరికీ తండ్రి అంటారు కదా..! మరి ఒకరు ఇంకొక ప్రాణాలకు హాని కలిగిస్తుంటే ఆ భగవంతుడు చూస్తూ ఊరుకోడు కదా..! అకారణంగా ఊరు పేరు లేని ఎన్నో ప్రకృతి వైపరీత్యాలకి మానవాళి బలౌతోంది. వీటన్నిటికీ కారణం ఏమై ఉంటుంది?
ఈ సోది ఏంట్రా బాబూ.. అనుకున్నా పరవాలేదు నాదొక చిన్న విన్నపం. మనం మూగజీవాలని రక్షించనక్కరలేదు.. వాటి స్వేచ్చను, వాటి ప్రాణాలను భక్షించకుండా ఉంటే చాలు. మనకి దేవుడు జంతువుల రక్తాన్ని తాగే హక్కును ఇవ్వలేదు.
ఆవు పాలు, లేగ దూడలు తాగాలి, కుక్క పాలు కుక్కపిల్లలు తాగాలి, గేదెపాలు వాటికి పుట్టిన పిల్లలు తాగాలి. మేక పాలు మేకపిల్లలు తాగాలి, మనిషి పాలు మాత్రమే మనిషి తాగాలి, ఈ శరీరాలలో ఏ శరీరాన్ని మనిషి తన మేధోశక్తితో సృష్టించలేదు. అటువంటప్పుడు మనిషికి ఈ మూగజీవాల పాలు బలం అని ఏవిధమైన ఆధారాలతో నిరూపించగలడు? చదువులేని మొద్దు-కదలలేని ఎద్దు అన్నారు. చదువుకుని మేధోశక్తిని పెంచుకోవాల్సిన వయసులో వాటి పాలు తాగితే కదలలేని ఎద్దులకన్నా ఘోరంగా మనుషులు తయారౌతారు, అంతేకాదు వాటి శరీరాలు కూడా కదలలేని ఎద్దులలాగానే తయారౌతాయి. వీటికి సంబంధించి విస్తృతమైన పరిశోధనలు జరిగాయి. వాటన్నిటి ద్వారా తేల్చిన సత్యాలే ఇవి.
అందుచేత ఇంతకీ నా ఈ సోది పురాణము ద్వారా మీకు చెప్పదలచుకున్నది ఏమిటంటే.. మూగ జీవాల ఆహారము వాటి పిల్లల కోసం భగవంతుడు తయారు చేశాడు. వాటిని ఉపయోగించుకునే హక్కు మానవజాతికి లేదు. పాలను వదిలేసి జీవకోటిని పరిరక్షించుకుందాం.. పుట్టిన దగ్గరనుంచి ఆ జీవాలు మనకి చేసే మేలు ఒక్కటి కాదు. వ్యవసాయంలో అవి ఎంతగానో ఉపయోగపడతాయి. అవి మనకి అక్కరలేని వాటిని తిని బ్రతుకుతాయి. అవి చనిపోయిన తరువాత కూడా మనకి తోళ్ళని అందిస్తూ మన కాలి కింద చెప్పుల రూపంలో గుట్టుగా అణిగిమణిగి ఉంటాయి. అలాంటి వాటికి ద్రోహం చెయ్యడం ఎంత వరకు న్యాయం? మనకి తెలిసిన “మృదంగం”, “తబల” వంటి కొన్ని వాద్య పరికరాలు కూడా వాటి చర్మాలతోనే తయారు చేస్తారు. ఇలా అవి చేసే మేలు అనేకం ఉన్నాయి.
పాలు – ప్రత్యామ్నాయం:
ఉన్నట్టుండి పాలను మానడం మన వలన కాదు. అవి ఎంతగా దైనందిన జీవితంలో భాగం అయ్యాయంటే పాలు కాచడంతోనే అనేక ఇళ్ళల్లో దినచర్య మొదలవుతుందంటే అతిశయోక్తి కాదు. అంతగా అలవాటైన పాలను మానెయ్యడం మన వల్ల కాదు. కానీ మానడం వలన అనేక ఉపయోగాలున్నాయి.
కొబ్బరిపాలు, సోయాపాలు, గోధుమపాలు, ఇలా అనేక ధాన్యాలతో మనం పాలు తయారుచేసుకోవచ్చు. అంతే కాదు ముఖ్యమైన టీ,కాఫీలను కూడా కాచుకోవచ్చు. అంతే కాకుండా గ్లాసు జంతువులపాలతో వచ్చే కేలరీల కన్నా ఈ కొబ్బరి, సోయా, గోధుమ పాల వలన వచ్చే కేలరీలు చాలా ఎక్కువగా ఉంటాయి. పైగా అత్యంత శ్రేష్టమైనవి కూడా. వీటిని ఇష్టంగా కూడా పిల్లలు తాగుతారు. ఇది శాస్త్రవేత్తలు నిరూపించిన సత్యం, ఒక్కసారి ప్రయత్నించి చూడండి.
గమనిక: ఈ వ్యాసము ఎవ్వరినీ ఉద్దేశించి రాసినది కాదు. ఎవ్వరి మనసునయినా నొప్పించి ఉంటే క్షమించమని ప్రార్ధన. నేను యూట్యూబ్ లో మూగజీవాల హింస మీద కొన్ని వీడియోలను చూసాను. దానిలో అత్యంత క్రూరంగా మనుషులు వాటిని చంపడం చూసాను. రాయాలనిపించినట్టుగా కొంత సోది రాసాను. ఇది ఎవరినీ ఉద్దేశించి రాసినట్టిది మాత్రం కాదు. నాకు రాయడం అస్సలు చేతకాదు. ఎక్కడయిననూ తప్పులు ఉంటే మరోసారి క్షమించమని ప్రార్ధన.
http://www.tv5news.in/districtwide/hyderabad/item/3727-illegal-milk-business-in-ap
http://www.andhrabhoomi.net/content/m-113
On Milk causes cancer
http://www.youtube.com/watch?v=XDXxo5Sussk