Wednesday, October 31, 2018

జీవితం

జీవితంలో ఎన్నో పరిచయాలు,
కొన్ని మధురానుభూతులు
కొన్ని విషాధ ఛాయలు

నిరంతరం దేనికోసమో అన్వేషణ,దేనికోసమో నిరీక్షణ,
దేనికోసమో వెదుకులాట

ప్రతి క్షణం  నవ్వులపువ్వులు పూయించే పసివారు ఒకప్రక్క,
ఆ మితిమీరిన కోపాలతో కస్సుబుస్సులాడేవారు ఒక ప్రక్క,
ప్రేమాభిమానాలతో ముంచెత్తే వారు ఒక ప్రక్క
నమ్మకద్రోహాలు చేసి ముంచే వారు ఒక ప్రక్క...

మనం చేసిన చిలిపి సరదా అల్లర్లు,
మనకు తగిలిన అనుభవాలు
మనల్ని వెంటాడిన  జ్ఞపకాలు,
మనం వెంటపడి సాధించుకున్న ఆనందాలు.
కన్నులముందే కరిగిపోతున్న కాలం,
ఆ కరిగిన కాలం ఒడిలో ఎదిగిన జీవితం...
రెప్పపాటు జీవితంలో ఎందుకో ఇన్ని అంతర్మధనాలు?
ఎందుకో ఇన్ని ఆటుపాట్లు?

ఎన్నో జీవితాలలో అలుముకున్న చీకటిని మింగిన ఉదయకాంతి,  మనసుపొరల్లో దాగిన చీకట్లని కూడా పారద్రోలి మౌనాన్ని చేదించి  ఏకాంతాన్ని తరిమిగొట్టాలి.

ఈ ఏకాంతసమయాన కలం నుండి కదిలిన మాటలు పెదవిదాటి రావెందుకని......???
మౌనానికి, నిశ్శబ్దానికి కూడా తోడుంటే ఎంత బాగుణ్ణో??!!

:)

నాలోని అణువణువునూ నిలువెల్లా దహించివేస్తూ వెలుగుదివ్వెనవుతున్న... ఆ వెలుగులోనైనా నన్ను గుర్తిస్తావేమోనని.. నా అంతరాత్మ నీకు కనిపిస్తుందేమోనని.. నా ఆశ...
నా ఆశ ఫలించకపోగా చిమ్మచీకటిలో కలిసిపోతానేమోనని  బాధ గా ఉంది.

:)

కబంద హస్తాల నుండి
తేనెపూసిన కత్తులనుండి
మోసపూరిత హృదయాలనుండి
వెన్నుపోటులనుండి
నమ్మకద్రోహుల నుండి
రెండు నాల్కల మాటలనుండి
బంధాలను తుంచేసేవారినుండి
అపార్థాలను సృష్టించేవారినుండి
మనసులు ముక్కలుచేసేవారి నుండి
మాకందరికి విముక్తి కలిగించు...
దేవుడా.....
నన్ను నా దేశాన్ని రక్షించు.....
సమసమాజస్థాపన చేయి.....
మనుష్యజాతినైనా ఒక్కటిగా చేయి.....

🙏🙏🙏🙏🙏🙏

Sunday, June 3, 2018

ఓ మనిషీ మేలుకో....!

ఓ మనిషీ మేలుకో....!

ప్రేమాభిమానాలతో మసలుకో
కులమతాలను, పగలను, ప్రతీకారద్వేషాలను వదులుకో

జీవితం బుద్బుదప్రాయం
గర్భస్థనరకాన్ని జయించగలవేమో.....
మరణాన్ని జయించలేవు....!

అబద్ధపుసాక్ష్యాలు చెప్పగలవేమో కానీ
అంతరాత్మలో
మనస్సాక్షిని జయించలేవు....!

మోసాలతో ధనార్జనచేసి
కోట్లు గడించగలవేమో కానీ
పిడికెడు ప్రేమ సంపాదించలేవు...!

ఆత్మవంచన చేసుకోగలవేమో కానీ ఆప్యాయతానురాగాలు
గెలవలేవు

బంధాలను వదలుకోగలవేమో....
ఋణానుబంధాలను తీర్చుకోలేవు

ఎందుకీ వ్యామోహం
ఎందుకీ వెంపర్లాట
దేనికోసమీ వెదుకులాట

మనిషిని మనిషిగా చూడు
జీవాన్ని ప్రేమతో చూడు
భావోద్వేగాలను జయించిచూడు
ప్రేమతో  మసలి చూడు
సర్వజనహితసాధనకై శ్రమించు
విశ్వశాంతి శ్రేయస్సుకై ప్రాకులాడు
....

సర్వం పరికించిచూడు
సర్వం పరిత్యజించి చూడు

విశ్వం నీకు దాసోహమంటుంది
సమస్తవిశ్వాంతరాళం నీ
 పాదాలచెంత ప్రణమిల్లుతుంది

ఓ మనిషీ అంతరాత్మ ఆశయసాధనకై శ్రమించు
ఆ సాధన నిన్ను ఆకాశసౌధాన నిలబెడుతుంది

ఆ విజయంతో నీవు
విశ్వవిజేతగా అవతరిస్తావు
విశ్వమానవవేదికపై విజయబాగుటా ఎగురవేస్తావు

జీవితం బుద్బుదప్రాయం

ఒంటరిగా వస్తావు
ఒంటరిని చేస్తావు
నిన్ను చేరని జీవి ఉండదు
నిన్ను తలచుకునే జీవి ఉండదు
సంతోషాలను మరపిస్తావు
కన్నీటిని మిగులుస్తావు
నీకై ఎదురుచూసే కన్నులకు అడియాసలను మిగిల్చి
పసిప్రాణాలను బలిగొంటావు
నీమనసెందుకింత కర్కశత్వం?
నీ ఒడిలో ఆనందంగా నిద్రించే కనులుండవా??
నీ రాక కోసం తపించే మనసులుండవా....
అనందంగా తమ జీవితంలోకి నిన్ను ఆహ్వానించే తనువులుండవా....
సృష్టిలో అన్నిటినీ ఆనందంగా ఆహ్వానిస్తాం....
స్వీకరిస్తాం....
ఒక్క నిన్ను తప్ప.....
అన్నిటినీ సంతోషంగా ఆహ్వానించే వాళ్ళె నిన్ను కూడా  సంతోషంగా స్వీకరిస్తే
ఈ కపటప్రేమలు, నాటకాలూ, బాధలు, ఆవేశాలు,  ఆగ్రహజ్వాలలు ఉండవేమో.....
నిన్ను ఆనందంగా ఆహ్వానించే మనసుల  కోసం 
నీ ప్రేమకోసం
ఎదురుచూస్తూ............

Saturday, May 5, 2018

అగ్నిధార


Tuesday, April 24, 2018

వెన్నెల

వెన్నెల

జీవితకాల నేస్తం

ఒక్కరోజు ఉన్నా వంద ఊసులు చెప్పి పోతుంది

మళ్ళీ వస్తానని ధైర్యం చెప్పి 
ఎదురుచూపులోని విరహబాధను 
రుచి చూపిస్తుంది

మనసు లోతులు వెతికి చూస్తుంది

జ్ఞాపకాల తెరలని తెరచి పెడుతుంది

మధురానుభవాలని నెమరువేస్తుంది

బిగికౌగిలిలో ఒదిగిపోతుంది

సాగర సడులను వినిపిస్తుంది

నిశ్శబ్దం విలువ తెలుపుతుంది

మౌనంగా ఎదగమని హితవు చెబుతుంది

పలకరింపులలో తీయని ప్రేమను రుచిచూపిస్తుంది.

జీవితాంతం బాసటగా నిలుస్తానని బాస చేస్తుంది

రేకెత్తే ఆలోచనలను తన పిల్లగాలులతో జో కొట్టి
నిశిరాత్రిలో కమ్మని కలగా లీలగా 
నలుపుతెలుపుల ఇంద్రధనుస్సును 
ఆవిష్కరింపజేస్తుంది

Thursday, June 25, 2015

తొండమాన్ చక్రవర్తి కథ

          భవిష్యోత్తర పురాణము లోని కథ
          అన్నమాచార్యుల కృతులలో మనకు తొండమాన్ చక్రవర్తి పేరు వినిపిస్తుంది. కలియుగ ప్రత్యక్ష దేవుడైన శ్రీ వేంకటనాథునికి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి అయిన పద్మావతీ దేవిని కన్యాదానమిచ్చిన మహానుభావుడు తొండమండలాధీశుడైన ఆకాశరాజు. తొండమానుడు ఆకాశరాజు సోదరుడు. అమిత శ్రీనివాస భక్తుడు. స్వామి ఆజ్ఞపై తిరుమల భవ్య మందిర నిర్మాణము చేయించిన ధన్యజీవి. బ్రహ్మాది దేవతలు నిత్యం వచ్చి శ్రీవేంకటపతిని సేవించుకునేది తొండమానుడు కట్టించిన ఆలయంలోనే. తొండమానుడు ఎంతటి భక్తుడంటే నిత్యము స్వామితో సంభాషణలు చేసేవాడు!
          ఇలా ఉండగా ఒకరోజు ఆకాశవాణి “ఆహా! ఎంత పుణ్యం చేసుకున్నావయ్యా! శ్రీనివాసుని ప్రతి కైంకర్యుము నీచేతుల మీదిగా శ్రద్ధాభక్తులతో రంగ రంగ వైభవంగా చేయిస్తున్నావు. రాజా! నీవంటి విష్ణుభక్తుడు లేడయ్యా” అని అన్నది. అంతవరకూ స్వామిగురించి తప్ప ఏమీ ఆలోచించని తొండమానుడు “ఆకాశవాణి మాటలు నిజమే కదా! నావంటి భక్తుడు అరుదు” అని అనుకున్నాడు.
          అహంకారమెంత దారుణమైనది. చివరికి మహనీయుడైన తొండమానుని సైతం విడువలేదు! అహంకారమే సకల దురుతాలకు మూలము. అహంకారం గర్వం ఎంత కొంచమైనా అది ఉన్నవాడిని నిలువునా దహించివేస్తుంది. కానీ స్వామి సామాన్యుడా? ఒక్కసారి త్రికరణశుద్ధిగా శరణువేడిన పరమ శత్రువునైనా దరిజేరుస్తాడు. అలాంటిది సర్వసుగుణవంతుడు మహాభక్తుడు అయిన తొండమానుని పతనం జరగనిస్తాడా? వెంటనే తొండమానునికి గుణపాఠం నేర్పాలని నిశ్చయించుకున్నాడు స్వామి.
          ఒకరోజు తొండమానుడు స్వామితో సంభాషించుచూ “నావంటి భక్తుడు ఈ ప్రపంచంలో లేడు. అసలు నేను తప్ప నీకు నిజభక్తులు ఎవరైనా ఉన్నారా దేవాదిదేవా?” అని ప్రశ్నించాడు. జగన్నాటకసూత్రధారి అప్పటికి చిరుమందహాసముతో సమాధానమిచ్చిఆ తొండమానునికి గుణపాఠం చెప్పే నాటకానికి అప్పుడే శ్రీకారం చుట్టాడు.
          ఒకరోజు తొండమానుడు రోజూలానే ఉదయాన్నే స్వామి దర్శనము చేసుకొని నిశ్చల భక్తితో ఆ పరమపురుషుని ధ్యానించి కలిదోషనివారణములైన శ్రీపాదలను చూశాడు. శ్రీహరిపాదం చుట్టూ ఉన్న కోట్లాది సౌర్యమండలాల వలె ప్రకాశిస్తున్నాయి తొండమానుడు పూజించిన సువర్ణ కమలాలు.  కన్నులు మినుమిట్లు గొలిపే ఇంతటి సువర్ణకాంతులలోను రాజుకు వాడిపోయి మట్టి అంటుకొని ఉన్న కమలాలు తులసీదళాలు కనబడ్డాయి. “ఏమిటీ చిత్రమ్? వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి అయినా ఈ సుమాలిక్కడికి ఎలా వచ్చాయి? నేను స్వామిని స్వర్ణ కమాలతో తప్ప పూజించను కదా!” అని తర్కించుకొని నేరుగా స్వామినే ఈ ప్రశ్నవేశాడు. ఆ దయామయుడు చిరుమందహాసముతో ఇలా సమాధానమిచ్చాడు.         
          “నాయనా! ఇక్కడికి కొంత దూరములో ఉన్న పేదపల్లెలో ఒక సామాన్య కుమ్మరి ఉన్నాడు. అతని పేరు భీముడు. పాపం అతనికి నేనంటే ఎనలేని భక్తి ప్రేమ. అతనుండే ఇంటి మట్టి గోడలో ఒక గూడు చేసి అందులో నా కఱ్ఱబొమ్మ ఒకటి మలచి అందులో నన్ను భావించుకొంటూ పూజిస్తుంటాడు. భక్తుడు ఎక్కడ భావిస్తే అక్కడ దీపించడం నా బాధ్యత కదా! ప్రహ్లాదుని కథ నీకు తెలియనిది కాదుకదా! పాపం అతనికి మంత్రతంత్రాలు తపోయోగాలు ఏమీ తెలియవు. అయినా త్రికరణశుద్ధిగా నిరంతరం నన్ను ధ్యానిస్తూనే ఉంటాడు. తాను కుండలు చేస్తున్నా అన్నం తింటున్నా ఎప్పుడు నా ఊసే! నా ధ్యాసే!
          తన కులాచారం ధర్మం ఎల్లవేళలా పాటిస్తాడు. సూర్యోదయాత్పూర్వమే లేచి తనకు తెలిసిన రీతిలో స్నానాది శౌచములు ఆచరించి నా పేరు స్మరిస్తూ తులసీదళాలు సమర్పిస్తాడు. అక్కడ అతడు వేసిన దళాలే నీకిక్కడ కనబడుతున్నాయి. అతనే కాదయ్యా వారి కుటుంబమంతా అంతే. నా మాట నా పాట తప్ప వారికేదీ రుచించదు. ఆ భీమ కులాలుని భక్తిపాశాలకు బంధీ అయిపోయానయ్యా!”
          విషయం తెలిసింది తొండమానునికి. భాష్పపూరితనయనాలతో “ప్రభూ!” అని ఆర్తితో పిలిచి స్వామిపాదాలపైపడి “జగన్నాథా! నా తప్పు క్షమించు. నావంటి భక్తుడు లేడని అహంకరించాను. నేను చూసిన ప్రపంచమెంత? నా అనుభవం ఎంత? నాపై దయతో నా బుద్ధిదోషాన్ని పోగొట్టి నిజమైన భక్తుని చేశావు తండ్రీ. ఇదుగో ఇప్పుడే వెళ్ళి భీముని దర్శనము చేసుకొని వస్తాను. నాకు సెలవు ఇవ్వు” అని చెప్పి బయలుదేరాడు రాజు.
“నాహం వసామి వైకుంఠే నయోగి హృదయే రవౌ |
మద్భక్తాః యత్రగాయంతి తత్ర తిష్ఠామి నారద!”
అన్న సూక్తి ప్రకారము భీముని దర్శనము తీర్థయాత్రగా భావించి రాజు నడుచుకుంటూ వెళ్ళాడు. పుణ్యక్షేత్రాలకు కాలినడకనే ప్రయాణము చేయాలి కదా! భీముని ఇల్లు చేరాడు రాజు. భీముని ఇల్లు స్వామి భజనలతో మారుమ్రోగుతున్నది. భీముని పాదాలపైపడి “అయ్యా! శ్రీ వేంకటేశుని ద్వారా నీ మహాత్మ్యము తెలిసుకున్నాను. సాక్షాత్ ఆ శ్రీమన్నారాయణుడే నీ భక్తిని కొనియాడాడయ్య! నీ పాదధూళి తాకి పునీతుడని అవుదామని వచ్చాను” అని అన్నాడు తొండమానుడు. చక్రవర్తి ఏమిటి నా పాదలు తాకడం ఏమిటి అని వెనక్కు జరిగిపోయి చేతులు జోడించి “రాజా! అంత పని చేయద్దు. స్వామికి దివ్యాలయం కట్టించిన మహానుభావుడవు నీవు” అని అన్నాడు.
          ఇంతలో గరుడారూహుడై స్వామి లక్ష్మీదేవితో సహా ప్రత్యక్షమైనాడు. భీముని ఆనందానికి అంతులేదు. “ఓ దయామయ! నా పూరి గుడిసెకు వచ్చావా! నీ లీలలే లీలలయ్యా. మా తప్పులెన్నక దయావర్షం కురిపించే కాలమేఘానివి స్వామీ నీవు. నేను హనుమంతుని వలె వారధిదాటి నిన్ను మెప్పించలేను, శబరివలె భక్తిశ్రద్ధలు చూపి నిన్ను ఆకట్టుకోలేను, జనకుని వలె సీతను ఇవ్వలేను, నారదుని వలె గంధర్వగానముతో నీ గుణగణాలను కీర్తించలేను, జటాయువు వలె నీకై నా ప్రాణాలు ఇవ్వలేను అయినా నిన్ను శరణువేడిన నన్ను కరుణించిన కరుణామూర్తివి నాయనా నీవు” అని స్తుతించాడు. భీముడిలా తన్మయత్వంతో ఆడిన మాటలను వేదమంత్రాలు వింటున్నంత ప్రీతితో విన్నాడు స్వామి.
          మహాభక్తురాలైన భీముని భార్య తమాలినీ కూడా గద్గద స్వరంతో అమ్మని కీర్తించింది. ఆదిదేవుడు మహాలక్ష్మి స్వయంగా తన యింటికివచ్చారు. వారికి ఇవ్వదగినది ఏమీ లేదే అని బిడియపడింది. అది గమనించి శ్రీనివాసుడు “తమాలినీ! నీ చేతితో ఏది వండి ఇచ్చినా తింటానమ్మా” అని అన్నాడు. తమాలినీ సంతోషానికి పట్టపగ్గాలులేవు. తనకు పెద్దల వలన తెలిసినంతలో యథాశక్తిగా శుచితో తామర తూడ్లతో వంటకాన్ని వండి లక్ష్మీనారాయణులకు వడ్డించింది. తృప్తిగా ఆరగించారు అలమేలుమంగాశ్రీనివాసులు. తొండమానుడు చూస్తుండగానే దివ్యశరీరధారులై వైకుంఠధామానికి చేరారు భీమకులాల దంపతులు.
          ఇదంతా ఆశ్చర్యంగా చూసిన తొండమాను “ప్రభూ! నా సంగతేమిటి” అని ప్రాధేయపడ్డాడు. అప్పుడు జగన్నాథుడు “రాజా! తరువాత జన్మలో నీవు విరాగివై నా ఏకాంతభక్తుడవు అవుతావు. అప్పుడు తప్పక నీకు ముక్తి లభిస్తుంది” అని చెప్పి తొండమానుని ఊరడించాడు. ఇలా తొండమానునికి భీమునికి ముక్తిని ప్రసాదించాడు శ్రీవేంకటేశుడు.
          అహంకారం ఎంతవారికైనా ఎంతకొంచమైనా తగదు. మహనీయుడైన తొండమానునికే అహంకారము వలన భంగపాటు తప్పలేదు. ఇక సామాన్యులమైన మనసంగతి ఏమిటి? కాబట్టి మనమెల్లప్పుడు వినయవిధేయతలతో ఉండాలి.  కులధర్మం కర్తవ్యం పాటిస్తూ స్వామిని నిష్కల్మష భక్తితో కొలిచే వారిని కరుణిస్తాడు భగవంతుడు అని నిరూపించాడు భీముడు. కులం కన్నా గుణం ప్రధానమైనది.