Thursday, April 2, 2015

చాటువులు

 చాటువులు

 ‘‘వాక్య రసాత్మకం కావ్యం’ అన్న లోకోక్తికి చాటు పద్యాలు చక్కని నిదర్శనాలు. ‘‘చాటు’’ అనే సంస్కృతపదం తెలుగులో చాటువుగా మారినది. ‘చాటు’ అంటే ప్రియమైనమాట అని అర్ధం.  కొందరు  కవులు ఆశువుగా చెప్పిన పద్యాలే చాటువులుగా మారాయని లోకోక్తి. నచ్చిన భావాన్ని నచ్చినట్టు ఏ నియమనిబంధనలు లేకుండా రాయగలిగేది చాటుపద్యం. సంక్షిప్తత, సూటిదనం, క్లుప్తత, స్పూర్తి  చాటు పద్యానికి ఉంటాయి. విజ్ఞాన సముపార్జనకు, వినోదానికి నిలయమైనవి  చాటువులు. వేటూరి ప్రభాకరశాస్త్రి గారు, దీపాల పిచ్చయ్య శాస్త్రిగారు చాటు వాఙ్మయంపై పరిశోధన చేసి ‘చాటు పద్య మణిమంజరి’, ‘చాటుపద్య రత్నావళి’ అన్న ప్రశస్తమైన గ్రంధాలని వెలువరించారు. రామాయణావతరణానికి దారితీసిన ‘మానిషాద’ శ్లోకము చాటువే. క్రౌంచపక్షి పతనాన్ని చూసిన వాల్మీకి గుండె ఆక్రోశించింది. ఆ శోకం శ్లోకంగా అవతరించిందని లోకోక్తి గలదు. చాటుపద్యాలను ఏ కవి రచించాడో నిర్ణయించటం చాలా కష్టం. కొన్నిసార్లు పద్యం ప్రసిద్ధికెక్కినా కవిపేరు మరుగున పడిపోవడం జరుగుతుంది.
ఒక సరదా చాటువు :
     వడపై నావడపై పకోడీపయి  హల్వాతుంటిపై బూంది యూం
     పొడిపై నుప్పిడి పై  రవిడ్డిలిపయిం బొండాపయిన్సేమీయీ
     సుడిపై బారు భవత్క్రుపారసము నిచ్చో గొంత రానిమ్మునే
     నుడుకుం గాఫిని ,యొక్క గ్రుక్క గొనెవే యో   కుంభదంభోధరా!!!!
భావం -  చిరుతిండ్ల మీద ఆసక్తి ఉన్న ఒక భోజన ప్రియునిపై ప్రయోగించిన పద్యమిది..
గారెల మీద, పెరుగు వడ మీద, పకోడీల  పైన , హల్వా ముక్కమీద, బూంది మీద, ఉప్మా మీద, రవ్వ ఇడ్లీ పైన, బోండా పైన, సేమియా పాయసం పైన నీ దయా రసం చక్కగా ప్రసరించి సుష్టుగా  వాటిని అరగించావు కదా, నన్ను ఎందుకు చిన్నచూపు చూస్తావు? అటువంటి దయారసాన్ని నా మీద కూడా కొంచెం ప్రసరించు.. వేడి వేడి కాఫీ ని నన్ను కూడా ఆరగించు, నీకు నమస్కరిస్తున్నాను, అని కాఫీ ఆ భోజనప్రియుడ్ని వేడుకొంటున్నది.
చదువు యొక్క గొప్పదనాన్ని మానవాళికి తెలియజెప్పే చాటువు :
     అక్షరంబు వలయు  కుక్షి జీవనులకు 
     నక్షరంబు జిహ్వాకిక్షురసము
     అక్షరంబు తన్ను రక్షించు గావున 
     నక్షరంబు లోకరక్షితంబు
మానవులకు చదువు ఎంతో అవసరమైనది. చదువు దాహంతో అలమటించే నాలుకకు చెరుకు రసం వంటిది. చదువుకుంటే  అది మనకు విచక్షణను, విజ్ఞానాన్ని, మంచి నడవడికను, వ్యక్తిత్వాన్ని అలవరుస్తుంది. కాబట్టి మనం చదువును రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది.
లోకప్రశస్తి చెందిన శ్రీనాధుని చాటువు :
    సిరిగల వానికి చెల్లును
    తరుణుల బదునారు వేలం దగ బెండ్లాడన్
    తిరిపెమున కిద్దరాండ్రా
    పరమేశా! గంగను విడుము పార్వతిచాలున్!’’
ఓ పరమేశా! డబ్బుగలవాడికి పదహారువేలమందిని చేసుకున్నా పోయేదేమీ ఉండదు. బిచ్చమెత్తుకుని బ్రతికే నీకు ఇద్దరు భార్యలు అవసరమా? ఆ పార్వతిని నీవుంచుకుని ఆ గంగాదేవిని మాకు విడిచిపెట్టు. అని మొరపెట్టుకున్నాడు. శ్రీనాధుడి ప్రాంతం నీటిఎద్దడికి ప్రసిద్ధి చెందినది. ఆ బాధని శ్రీనాధుడు వ్యంగ్యంగా ఇలా పద్యంలో వివరించాడు.

తిరుమలరాయలనే రాజు తెనాలి రామలింగని పిలిచి తనను పొగడమన్నాడట. ఆ పొగడ్త సహజంగా ఉండాలని, గోరంతదాన్ని కొండంత చేసి చెప్పకూడదన్న నియమం పెట్టాడట. అప్పుడు చెప్పిన పద్యం
 
అన్నాతి గూడ హరుడగు
అన్నాతి గూడకున్న నసురగురుడౌ
అన్నా! తిరుమలరాయా
కన్నొక్కటిలేదు కాని కౌరవపతివే!
 ఆ రాజు ఒంటికంటివాడు సహజంగానే వర్ణిస్తే భీభత్సంగా ఉంటుంది. మహా కవులకు సాధ్యం కానిదేముంది? శివునికి మూడు కన్నులు. తిరుమలరాయుడు భార్యతో కలిసి ఉన్నప్పుడు శివుడు. భార్య లేనప్పుడు శుక్రాచార్యుడు. ఆ కన్ను కూడా లేకపోతే నీవు ధృతరాష్ట్రుడవే అని ఎంత నేర్పుగా చమత్కరించినాడు. 

Sunday, March 22, 2015

పుష్ప విలాపం

పుష్పవిలాపం

కొందరు కవులు రాసిన వర్ణనలను చదివినప్పుడు ఆడవారికి పూలకు విడదీయలేని అవినాభావసంబంధమేదో ఉందనిపించేది. పుష్పవిలాపం గురించి విననంత వరకూ.. పూలను మానవుల అవసరాల కోసం, సంతోషం కోసం, పూజాధికాల కోసం దేవుడు సృష్ఠించాడేమో అనుకునేదాన్ని. కానీ ఈ కావ్యం చదివిన తరువాత పూలకు మనసుంటుందా? అవి ఇంతలా బాధపడ్తాయా అనిపించింది. మన ఆహ్లాదం కోసం వాటికి ఇబ్బంది కల్గించకూడదేమో అనిపించింది.  'నాకు పూలు నచ్చవు' అని చెప్పే ఆడవారిని మనం అరుదుగా చూస్తుంటాం. ఇది చదివిన తరువాత ఆడవారికి పూలపట్ల మనసు పోదేమోననిపించింది..! జంధ్యాల గారి కావ్యానికి ఘంటసాల గారి గానం కలగలిసి మనసును కరిగించేస్తుంది ఈ కావ్యం.

పుష్ప విలాపం పద్యాలు - కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి

చేతులారంగ నిన్ను పూజించుకొరకు
కోడి కూయంగనే మేలుకొంటి నేను;
గంగలో మున్గి ధౌత వల్కలము గట్టి
పూలు కొనితేర నరిగితి పుష్పవనికి


నీ పూజ కోసం పూలు కోసుకొద్దామని పొద్దున్నే మా తోటలోనికి వెళ్ళాను ప్రభూ ఉదయశ్రీ అరుణారుణ కాంతులతో ఉద్యానవనం కలకలలాడుతోంది పూల బాలలు తల్లి ఒడిలో అల్లారు ముద్దుగా ఆడుకుంటున్నాయి అప్పుడు...

నే నొక పూలమొక్క కడ నిల్చి చివాలున కొమ్మవంచి గో
రానెడు నంతలోన విరు లన్నియు జాలిగ నోళ్ళు విప్పి "మా
ప్రాణము తీతువా" యనుచు బావురు మన్నవి; క్రుంగిపోతి; నా
మానసమం దెదో తళుకు మన్నది పుష్పవిలాప కావ్యమై..!

అంతలో ఒక సన్నజాజికన్నె సన్నని గొంతుకతో నన్ను చూసి యిలా అంది ప్రభూ...

తల్లి యొడిలోన తలిరాకు తల్ప మందు
ఆడుకొను మమ్ములను బుట్టలందు చిదిమి
అమ్ముకొందువె మోక్ష విత్తమ్ము కొరకు!
హౄదయమే లేని నీ పూజ లెందుకోయి?

జడమతుల మేము; జ్ఞానవంతుడవు నీవు;
బుధ్ధి యున్నది; భావ సమౄద్ధి గలదు;
బండబారె నటోయి నీ గుండెకాయ!
శివునకై పూయదే నాల్గు చిన్ని పూలు?

ఆయువు గల్గు నాల్గు గడియల్ కని పెంచిన తీవతల్లి జా
తీయత దిద్ది తీర్తు ము; తదీయ కరమ్ములలోన స్వేచ్ఛమై
నూయల లూగుచున్ మురియుచుందుము; ఆయువు దీరినంతనే
హాయిగ కన్ను మూసెదము ఆయమ చల్లని కాలి వ్రేళ్ళపై.

ఎందుకయ్యా మా స్వేచ్చ జీవనానికి అడ్డు వస్తావు..? మేము నీకేం అపకారము చేసాము???

గాలిని గౌరవింతుము సుగంధము పూసి; సమాశ్రయించు భృం
గాలకు విందు చేసెదము కమ్మని తేనెలు; మిమ్ము బోంట్ల నే
త్రాలకు హాయిగూర్తుము; స్వతంత్రుల మమ్ముల స్వార్ధ బుద్ధితో
తాళుము త్రుంప బోవకుము; తల్లికి బిడ్డకు వేరు సేతువే!

యింతలో ఒక గులాబి బాల కోపంతో మొగమంతా ఎర్రబడి యిలా అంది ప్రభూ..!

ఆత్మ సుఖమ్ము కోసమయి అన్యుల గొంతులు కోసి తెచ్చు పు
ణ్యాత్ముడ! నీకు మోక్ష మెటు లబ్బును? నెత్తురు చేతి పూజ వి
శ్వాత్ముడు స్వీకరించునె? చరాచర_వర్తి ప్రభుండు మా పవి
త్రాత్మల నందుకోడె! నడమంత్రపు నీ తగులాట మేటికిన్?

ఊలు దారాలతో గొంతు కురి బిగించి
గుండెలో నుండి సూదులు గ్రుచ్చి కూర్చి
ముడుచు_కొందురు ముచ్చట ముడుల మమ్ము
అకట! దయలేని వారు మీ యాడువారు

గుండె తడి లేక నూనెలో వండి పిండి
అత్తరులు చేసి మా పేద నెత్తురులను
కంపు దేహాలపై గుమాయింపు కొరకు
పులుముకొందురు హంత! మీ కొలము వారు.

అక్కట! హాయి మేము మహిషాసురు లెందరొ నాల్గు ప్రక్కలన్
ప్రక్కల మీద చల్లుకొని మా పసిమేనులు పాడు కాళ్ళతో
ద్రొక్కుచు దొర్లి - దొర్లి - మరు రోజుదయాననె వాడి వత్తలై
రెక్కలు జారిపోఁ పరిహరింతురు మమ్ముల పెంటదిబ్బ పై.

మా వెలలేని ముగ్ధ సుకుమార సుగంధ మరంద మాధురీ
జీవిత మెల్ల మీకయి త్యజించి కృశించి నశించిపోయె; మా
యౌవన మెల్ల కొల్లగొని ఆ పయి చీపురుతోడ చిమ్మి మ
మ్మావల పారబోతురు గదా! నరజాతికి నీతి యున్నదా !

వోయీ మానవుడా..........!!

బుద్ధ దేవుని భూమిలో పుట్టినావు
సహజ మగు ప్రేమ నీలోన చచ్చెనేమి?
అందమును హత్య చేసెడి హంతకుండ!
మైలపడిపోయె నోయి! నీ మనుజ జన్మ.

పూజ లేకున్న బాబు నీ పున్నె మాయె!
కోయ బోకుము మా పేద కుత్తుకలను
అకట! చేసేత మమ్ముల హత్య చేసి
బాపుకొన బోవు ఆ మహా భాగ్య మేమి?

ఇట్లు పుష్పాలు నన్ను చీవాట్లు పెట్టి
నట్లుగాన్ - పూలు కోయ చేయాడలేదు;
ఏమి తోచక దేవర కెరుక సేయ
వట్టి చేతులతో ఇటు వచ్చినాను..

సారాంశం
పాపయ్య శాస్త్రి గారు సృష్టించిన మధుర మనోజ్ఞ కరుణ రస భావ కావ్యమిది. భక్తుడు దైవ పూజ కోసం పూలు కోయబోయే సమయంలో ఆ పూలు 'మా ప్రాణాలు తీయబోకు..' అని బావురుమని ఏడ్చాయి.
''తల్లి ఒడిలో ఆడుకునే మమ్మల్ని కోసి, బుట్టల్లో అదిమి.. చిదిమి.. అమ్మేస్తున్నారు. మోక్షమనే విత్తం కోసమే కదా మీ ఆరాటం'' అని ఈసడించాయి. ''అమాయకులమైన మేము తీగతల్లిని అంటుకుని నాలుగు ఘడియలు ఆనందంగా గడిపి.. ఆ తల్లి చల్లటి పాదాలపైనే రాలి, కన్నుమూస్తాం. జీవించి ఉన్నంత కాలం మేం నిస్వార్థంతో సుగంధమిచ్చి గాలిని గౌరవిస్తాం. తుమ్మెదలకు మకరందం అందించి విందు చేస్తాం. మీలాంటి మనుషులకు కనువిందు చేస్తాం. అలాంటి స్వతంత్రులైన మమ్మల్ని మా తల్లి నుంచి వేరు చేయొద్దు''. అని ప్రాధేయపడ్డాయి.



''మీ సంతోషం, తృప్తి కోసం ఊలు దారాలతో మా గొంతులకు ఉరి బిగించి.. గుండెల్లో సూదులు గుచ్చి.. మాలలు కట్టి ఆడవాళ్లు.. పడకల మీద చల్లుకుని మగవాళ్లు.. మమ్మల్ని అనుభవిస్తారు. మా గొంతులు కోసి దైవ పూజ చేస్తారు''.
''దైవం మాలో లేడా..! విశ్వాత్ముడైన పరమాత్మ మీ నెత్తుటి పూజను స్వీకరిస్తాడా..? చివరికి మమ్మల్ని చీపుళ్లతో బయటకు ఊడ్చేస్తారు. కొందరైతే నూనెలో వండి అత్తర్లుగా చేసి.. తమ కంపు దేహాలపై పులుముకుంటారు. మీ మానవులంతా హంతకులు.. మీకు నీతి లేదు... బుద్ధుడు పుట్టిన పవిత్ర భూమిలో పుట్టిన మీలో సహజంగా ఉండే ప్రేమ ఎందుకు చచ్చిపోయింది...? పూల హంతకులుగా మారి మానవతకు మచ్చతేవద్దు'' అని పూలు భక్తుడిని వేడుకుంటాయి. ఆ ప్రార్థన, చీవాట్లు విన్న భక్తుడు ఏం చేయాలో తోచక వట్టి చేతులతో వెనుదిరిగి వెళతాడు.

ఈ కావ్యం ఘంటసాల గారి గళమునందు..!!

Monday, September 29, 2014

సామెతలు

పెళ్లి, భర్త, భార్య, ప్రేమ విషయాలపై కొన్ని సామెతలు... (సేకరణ)

















ధన్యవాదములు...!! 

Monday, April 14, 2014

వాక్కు అంటే అగ్ని..! కొంచెం జాగ్రత్త..!


వాక్కు అంటే అగ్ని..! కొంచెం జాగ్రత్త..!

 -->              వాక్కు అనేది అగ్ని. ఆ వాగ్బాణాలు మన నోటి నుండి వెలువడినప్పుడు అవి ఎదుటివారికి వెచ్చదనాన్ని ఇవ్వాలి గానీ..! ఎదుటివారి మనసును నొప్పించకూడదు. ఆ వెచ్చదనాన్ని అందించే శక్తి మన వాక్కుకు లేనప్పుడు దానిని ఎదుటివారిపై ప్రయోగించకపోవడమే ఉత్తమం. "తనకోపమె తన శత్రువు తనశాంతమె తనకు రక్ష" అన్నట్టు మనకి కోపం అనిపిస్తే మనము మౌనంగా ఉండటమే మంచిది.
-->       మౌనం యొక్క శక్తి ఎంతటిదో చెప్పలేము. దానికి కొలమానాలు లేవు. బ్రహ్మానందం అని చెప్పబడేది ఈ పరిపూర్ణ మౌనమే. ఈ శక్తికి అసాధ్యమన్నదేదీ లేదు. మౌనం అన్నదే వాక్కు. మనవాటి లాగా అనేక వాక్కుల సమూహం కాదది. అది ఒక్కటే వాక్కు.
-->       మౌనం అఖండ వాక్కు. 
-->       వాక్కు - భాషావిశేషాలు
            వాక్కు – పరా, పశ్యన్తి, మధ్యమ, వైఖరి అని నాలుగు విధాలు. ఈ వాక్కు ఎలా పుడుతుందో వ్యాకరణం చెబుతుంది. ఈ వాక్కు వెలువడిన తర్వాత అది ’శబ్దం’గా పరిగణిస్తాం. ప్రతి శబ్దానికి నిర్దుష్టంగా ఒక అర్థం ఉంటుంది. అలా నిర్దుష్టమైన అర్థం కలిగిన శబ్దాన్ని ’వాచకం’లేదా ’అభిద’ అంటారు. ఆ శబ్దం తాలూకు అర్థాన్ని ’వాచ్యం’ అంటారు.
-->       చెడువాక్కులు నాలుగువిధాలుగా ఉంటాయి.
-->       పారుష్యం అనగా కఠినంగా మాట్లాడడం. కష్టం కలిగించే విధంగా మాట్లాడితే కష్టాలు, సమస్యలే కాక మిత్రులు కూడా శత్రువులు అవుతారు. అందువలన అశాంతి, దుఃఖం కలుగుతుంది. ఇతరులు వారితో మాట్లాడేందుకు సంకోచిస్తారు**.
-->       అనృతం అనగా అసత్యం చెప్పడం. దీనివల్ల ఆత్మ, మనస్సు కలుషితమౌతాయి. సత్యం దేవతల వ్రతం అని, అసత్యం చెప్పడం అసురుల స్వభావమని వేదవిదులు అంటున్నారు. అసత్యవాదులు జీవించినా మరణించిన వారితో సమానమని వేదోక్తి.
-->       పైశున్యం అనగా చాడీలు చెప్పడం. దీనివలన కుటుంబాలలో కలహాలు, సన్నిహితులతో విరోధాలు ఏర్పడతాయి. పరస్పరం అసూయ, అసహనం ఏర్పడతాయి ఇతరుల నుండి అవమానాల్ని, అవహేళనల్ని పొందాల్సి ఉంటుంది. వీరు సాంఘిక జీవనం కోల్పోతారు.
-->       అసందర్భ ప్రలాపం : పరమాత్మ ప్రసాదించిన వాక్కును ఆచితూచి వినియోగించాలి. అనవసరంగా, అసందర్భంగా వ్యర్ధంగా మాట్లాడకూడదు. ఇడతెగకుండ మాట్లాడుతుంటే ఇతరులకు చిరాకుపెడుతుంది.

-->       సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్
            న బ్రూయాత్ సత్య మప్రియం
            ప్రియం చ నానృతం బ్రూయాత్
            ఏష ధర్మ స్సనాతన:!! (మనుస్మృతి)
భావం.     సత్యాన్నే పలుకు, ప్రియాన్నే మాట్లాడు, సత్యమైనా అప్రియాన్నిపలక్కుఇదే సనాతన ధర్మం అని శ్లోక తాత్పర్యం. ఇది చెప్పేవాడికి చెప్పే లక్షణ శ్లోకంలా కనిపిస్తుంది.కానీ అడిగే వాడెలాంటి విషయం వింటానికి అడగాలో,ఏది వినాలో చెప్పే చమత్కారం కూడా యిందులో వుంది. సత్యాన్నేవిను, ప్రియమైన దాన్నే విను.సత్యమైనా అప్రియంగా వుంటే వినకు.అలాగే ప్రియంగా వుందని అసత్యాన్ని వినకు.అలాంటి లక్షణాలతో చెప్పేవాడు, వినేవాడూ వున్నప్పుడు ఆ చెప్పిన విషయం హృదయానికి హత్తుకుని ఎల్ల కాలం గుర్తుంటుంది. అనగా ఇతరులకు ప్రియం కానిది అది సత్యమైనా మనం చెప్పకూడదు. అందులో కాఠిన్యముండడమే కారణం. అలాగే జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడకపోతే అది సత్యమైనా తగవులాటకు కారణమవుతుంది. అందుకే నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ అన్నారు. అటువంటివిషయాల జోలికి పోకపోవడం ఉత్తమమేమో…!
-->       వాక్కు గురించి వేమన పలికిన మాటలు
-->       వాక్కువలన గలుగు పరమగు మోక్షంబు
            వాక్కువలన గలుగు వరలు ఘనత
            వాక్కువలన గలుగు నెక్కుడైశ్వర్యంబు
            విశ్వదాభిరామ వినురవేమ!
భావం.    మోక్షం, గౌరవం, ఐశ్వర్యం అన్నీ మాటలను బట్టే లభిస్తాయి. కనుక తగిన విధంగా మాట్లాడడం నేర్చుకోవాలి.
 -->      వాక్కు శుద్ధి లేనివాడు చండాలుడు
            ప్రేమ శుద్ధి లేక పెట్టు టెట్లు?
            నొసలు భక్తుడైన నోరు తోడేలయా!
            విశ్వదాభిరామ వినురవేమ!
 భావం.    వాక్కుశుద్ధిలేనివాడే చండాలుడు. అతని మాటల్లో మంచితనం ఉండదు. అతని నొసటన భక్తి చిహ్నాలు ఉంటే ఉండొచ్చు గాని నోటికి మాత్రం క్రూరమృగాల లక్షణాలే ఉంటాయి అంటున్నాడు వేమన. దేనికైనా త్రికరణ శుద్ధి ముఖ్యం అని సారాంశం.
            మహాభారతంలోని ఆదిపర్వమునందలి చతుర్థాశ్వాసంలో వాక్కు, సత్యవాక్కుల గురించిన  ప్రస్తావన వస్తుంది. ఎటువంటి మాటలు మాట్లాడాలి?! వాక్కు అంటే ఏంటి? అన్న అనేకప్రశ్నలకి సమాధానాలు ఈ సందర్భంలో లభిస్తాయి.
చ.         నుతజల పూరితంబు లగు నూతులు నూఱిటికంటె సూనృత
            వ్రత యొక బావి మేలు మఱి బావులు నూఱిటికంటె నొక్క స
            త్క్రతు వది మేలు తత్క్రతుశతంబునకంటె సుతుండు మేలు త
            త్సుత శతకంబుకంటె నొక సూనృతవాక్యము మేలు సూడఁగన్.
భావం.    తియ్యటి నీటితో నిండివున్న నూఱు నూతులకంటె ఒక దిగుడుబావి మేలు, అట్టి బావులు నూఱిటికంటె ఒక సత్క్రతువు మేలు, అట్టి నూఱు క్రతువులకంటె ఒక కుమారుడు మేలు, అట్టి నూర్గురు కుమారులకంటె కూడా, ఓ సూనృతవ్రతుడ వైన రాజా ! ఒక సత్యమైన మాట మేలయ్యా. అని అంటూ ఇంకా సత్యాన్నిగురించిన గొప్పదనాన్ని ఇలా వర్ణిస్తుంది.
క.          వెలయంగ నశ్వమేధం, బులు వేయును నొక్క సత్యమును నిరుగడలం
            దుల నిడి తూఁపఁగ సత్యము, వలనన ములు సూపు గౌరవంబున పేర్మిన్. 
భావం.     వెయ్యి అశ్వమేధ యాగాల ఫలాన్నిఒకవేపు, సత్యవాక్యాన్ని ఇంకోవేపు త్రాసులో ఉంచి తూస్తే త్రాసు యొక్క ముల్లు సత్యం వైపే మొగ్గును చూపిస్తుంది సత్యము యొక్క భారాతిశయము చేత.
తే.         సర్వతీర్థాభిగమనంబు సర్వ వేద, సమధిగమము సత్యంబుతో సరియుఁ గావు
            నెఱుఁగు మెల్ల ధర్మంబుల కెందుఁ బెద్ద, యండ్రు సత్యంబు ధర్మజ్ఞు లైన వారు. 
భావం.     అన్ని తీర్థాలను సేవించగా వచ్చే ఫలితం, సర్వవేదాల్ని పొందుట కూడా సత్యముతో సరిగావు. అన్ని ధర్మాలలోకెల్లా సత్యమే పెద్ద అని ధర్మజ్ఞులైనవారు చెప్తారు, తెలుసుకో.  మోక్షం, గౌరవం, ఐశ్వర్యం అన్నీ మాటలను బట్టే లభిస్తాయి. కనుక తగిన విధంగా మాట్లాడడం నేర్చుకోవాలి.
            వాక్కు అనేది బాణం వంటిది. వాస్తవానికి మనుష్యుల వచనాలు, పదాలు, మాటలు ఎదుటివారిని తాకుతాయి. వారు పలికిన పలుకులను బట్టి ఆ వాక్కు యొక్క ఫలితాలు కూడా తిరిగి వారినే చేరతాయి. ఆ ఫలితం మంచిదైతే గౌరవాభిమానాలు లభిస్తాయి. చెడ్డవైతే ఛీత్కారాలు లభిస్తాయి. కనుక వాగ్బాణాలను వదిలేముందు ఒకటికి వందసార్లు సరిచూసుకుంటే మంచిది.
             ఒకవేళ పొరపాటుగా కొన్ని అనుచిత వాక్యాలు ప్రయోగించినట్టయితే, వారు  పశ్చాత్తాపం చెంది క్షమించమని అడిగేందుకు సిద్ధపడతారు. అంటే మనుష్యులు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే మనం మాట్లాడే మాటలతో సమాజంలో ఒక సంచలనం సృష్టించవచ్చు. లేదా ప్రజలను సంఘటితం చేయవచ్చు, వ్యవస్థను ఆనందింప చేయగలం అన్న విషయాన్ని. కొందరు వ్యక్తులు సమయం, సందర్భం స్థితి స్థానాన్ని దృష్టిలో ఉంచుకోకుండా మాట్లాడుతూ ఉంటారు. దీనివల్ల ముందడుగు వేయడం మాట అటుంచి వెనకడుగు మాత్రం ఖాయం. వ్యర్థ ప్రసంగాల ద్వారా ఇతరులతో సంబంధాలను  తెంచుకోవడం మంచిది కాదు.
-->       మనుష్యుల మాటల ద్వారా అతని స్వభావం సంస్కారం తెలుస్తుంది. జ్ఞానవంతుడు అయిన మనిషి తన మాటలను అదుపులో పెట్టుకుంటాడు.
-->       ఆంగ్లభాషలో ఒక సూక్తి ఉంది. “Let us agree to disagree”' అంటే ఒక విషయంపట్ల అనంగీకారమును తెలిపే ముందు అంగీకారం తెలియబరచు.. ఒక విషయంలోని తప్పును చెప్పే ముందు ముందు ఆ విషయాన్ని ఒప్పు అని ఒప్పుకుని ఆ తరువాత అది ఎందుకు తప్పో తెలియబరిచే ప్రయత్నం చేస్తే ఎదుటివారి మనసును నొప్పించకుండా విషయమును సానుకూలంగా పరిష్కరించడం సులభం అవుతుంది.

 -->       వాక్కు అంటే అగ్ని..! కొంచెం జాగ్రత్త..!
            వాక్కుకు అధిదేవత సరస్వతి అందుకే ఆవిడకి వాగ్దేవి అని పేరు. ఆ వాక్కును మనం దుర్వినియోగం చేస్తే, ఎదుటి వారిని చెడగొట్టి వారిని మన స్వార్థ పూరితమైన మన కోర్కెలు తీర్చుకోవడానికి వాడుకోవడానికి ప్రయత్నిస్తే, ఆవిడ మొదట మన అంతరాత్మలో బావనా రూపంలో మన ఆలోచనల్లో ఒక ఆలోచనై, వచ్చి నిలిచి, మనల్ని రహస్యంగా హెచ్చరిస్తుంది. మనం వినకుండా మళ్ళీ అవే పనులు చేస్తూ మన అతి తెలివినీ ప్రదర్శిస్తూ పోయామనుకోండి.. అప్పుడు మొదట బంధువులూ ఆ తరువాత మిత్రుల ద్వారా ముందు సున్నితంగానూ తరువాత గట్టిగానూ నిలదీయించి, హెచ్చరిస్తుంది. ఆ హెచ్చరికలను కూడా లెక్క చెయ్యకుండా మనం ముందుకు దూకుతూ వున్నా మనుకోండి.. అప్పుడు ఆ వాగ్దేవి మన చుట్టూ వున్న ప్రతి మనిషి హృదయం లోనికీ ప్రవేశించి హెచ్చరిస్తూనే ఉంటుంది, మనం ఆమెను తల్లిగా గుర్తించక పోయినా తల్లి గా తన బాధ్యతను నిర్వర్తిస్తూ మన బుద్దిని మళ్ళీ మళ్ళీ ఖండిస్తుంది. అప్పటికీ తెలుసుకోకుండా మారకుండా అంతులేని స్వార్ధాన్నీ అతి తెలివినీ ప్రదర్శిస్తే ఇహ సహనం నశించి, ఆమె తన విశ్వరూపం చూపించి, తనలోని సర్వశక్తులతో మనల్ని అధపాతాళానికి తొక్కేస్తుంది.
            అదికూడా ఎందుకో తెలుసా? కోపంతో కాదు. కలుపు మొక్కని తీసిపారెయ్యాలి కనుక. మనతో పాటు మిగిలిన వారంతా కూడ ఆమె పుత్రులె కనుక. వారిని మన నుంచి కాపడడానికి..! మనకు మన డబ్బూ పరువూ, పేరూ, ప్రతిష్టా అన్నీ సర్వనాశనమయ్యాక చిట్ట చివరికి అప్పుడర్థమౌతుంది.మనకు ! " ఈ సరస్వతీ,'' ''ఈ వాగ్దేవీ'' '' వాఙ్మయం" ఇవన్నీ యదార్థాలేలే అవి, వాక్ మయం అంటే అగ్నిమయం అని"! " మనందరి వాక్కులో అగ్ని వున్నదీ'' అని అన్న మాటలు వొట్టి మాటలు కావూ.. నిజంగానే వాక్కుకు అధిపతిగా ఒక మహా శక్తి కేంద్రమే వున్నదీ. అది బడబాగ్ని కన్నా బలమైనదీ..భయంకరమైనదీ" అని అర్థమౌతుంది. అయితే ఈ విషయాన్ని నాశనం కాక ముందే మొదటి హెచ్చరికతోనే ముందుగా గ్రహించగలిగితే తల్లికీ ఆనందం బిడ్డకూ ఆనందం. !
"Lets talk less - work more"
గమనిక : నాకు తెలిసినంతలో చెప్పడానికి ప్రయత్నించాను. ఎక్కడైనా తప్పుగా చెప్పి ఉన్నా,  ఎవరి మనసును అయినా నొప్పించి ఉన్నా మన్నించమని ప్రార్థన.