Saturday, March 8, 2014
Wednesday, January 29, 2014
దుంధుమారుని కథ
మహాభారతం - అరణ్యపర్వం - దుంధుమారుని కథ - అమరత్వ లబ్ధి
ఆయుర్దాయం ఉన్నంత కాలం మానవులెలాగూ బ్రతుకుతారు. మరణించిన తరువాతకూడా కీర్తి
కాయులై జీవించి ఉండటం ఎంతో గొప్ప విషయం. ఇది వారి సత్ప్రవర్తన, సమాజహిత కార్యాచరణ,
కావ్య, కళానిర్మాణదక్షత మొదలైన వాటిని అనుసరించి ఉంటుంది. దీనిని గూర్చి
ఆంధ్రమహాభారతం, అరణ్యపర్వంలో ఒక ప్రతీకాత్మకమైన కథ ఉంది. దీనిని మార్కండేయమహర్షి
ధర్మరాజుకు చెప్పాడు.
పూర్వం హైహయ వంశానికి చెందిన "ధుంధుమారుడు" అనే రాజకుమారుడు వేటకు
వెళ్ళి, జింక చర్మం ధరించి పొదలమాటునుంచి కనిపిస్తున్న ఒక బ్రాహ్మణ యువకుణ్ణి
జింకగా భావించి బాణంతో కొట్టి చంపాడు. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే ఆ యువకుని
కళేబరం కనిపించింది. తన పొరపాటువల్ల ఇంత అనర్థం జరిగిందే అని బాధపడి, ఇంటికి
వెళ్ళి తన వృద్ధ బంధుజనులకు ఈ విషయం చెప్పి, వారిని ఆ ప్రదేశానికి తీసుకువచ్చి ఆ
యువకుని మృతకళేబరాన్ని చూపించాడు.
వారందరూ అక్కడికి సమీపంలో ఉన్న తార్క్ష్యుడు అనే మహర్షి ఆశ్రమానికి వెళ్ళారు. ఆయన
వారిని ఆదరంగా ఆశీర్వదించి, వారికి అతిథిసత్కారాలు చేయవలసినదిగా తన శిష్యులను నియోగించాడు.
అపుడు హైహయులు మహర్షికి నమస్కరిస్తూ "మహర్షీ ! మా మీది అనుగ్రహంతో మీరు మాకు
అతిథిసత్కారాలు చేయిస్తున్నారు. కానీ వాటిని అందుకోదగిన అర్హత మాకు లేదు. ఇడుగో..
మా వంశానికి చెందిన ఈ రాజకుమారుడు మీ ఆశ్రమ ప్రాంతంలో ఒక బ్రాహ్మణయువకుణ్ణి జింకగా
భ్రమించి బాణంతో నేలగూల్చాడు. ఈ మహాపాపానికి నిష్కృతి ఏముంటుంది. ఈ విషయాన్ని తమకు
నివేదించటానికే వచ్చాం" అన్నారు.
అపుడు తార్క్ష్యుడు చిరునవ్వు నవ్వుతూ "త్రిలోకాలకూ ఆశ్చర్యం కలిగించే విషయం
ఒకటి మీకు చెప్పాలి. మా ఆశ్రమంలో ఎవరికీ భయం, వ్యాధి, దుర్గతి, మరణం ఉండనే ఉండవు. అందువల్ల
ఈ రాజకుమారుడు ఇక్కడ ఎవరినో చంపాడనటం మీ భ్రమ" అని తపోబల సంపన్నుడు, తేజస్వి
అయిన ఒక యువకుణ్ణి పిలిచి వారికి చూపుతూ "చూడండి .. మీ రాజకుమారుడు బాణంతో
కొట్టినది ఇతనినేనా?" అన్నాడు.
ఆశ్చర్యం ! రాజకుమారుడు చంపింది ఈ యువకుణ్ణే! పైగా ఇతడు తార్క్ష్య మహర్షికి
కుమారుడట. తమ కళ్ళతో తాము ఈ యువకుని మృతదేహాన్ని చూశారుకదా!కానీ ఇతడు జీవించే
ఉన్నాడే! ఇది ఎలా సంభవం? హైహయులు ఆశ్చర్యపడి తార్క్ష్యునితో "మహర్షీ!ఈ
యువకుడు మరణించి పునర్జీవితుడయ్యాడు. ఈ మహత్తు విస్మయకరం. ఇంతటి మహిమ ఇతనికి ఎలా
సిద్ధించింది?" దయచేసి చెప్పండి అని అడిగారు.
"ఆలస్యంబొకయింత లేదు, శుచి యాహారంబు, నిత్యక్రియా
జాలంబేమఱ, మర్చనీయు లతిథుల్, సత్యంబు
పల్కంబడున్
మేలై శాంతియు, బ్రహ్మచర్యమును నెమ్మిందాల్తు,
మట్లౌట నె
క్కాలంబుం బటురోగ మృత్యుభయ శంకంబొంద
మేమెన్నడున్" అన్నాడు.
ఆ ఆశ్రమవాసుల అమరత్వ లబ్ధికి మహర్షి చెప్పిన కారణాలు ఇవీ -
---> చేయవలసిన పనులు చేయటంలో ఒకయింతైనా ఆలస్యం చేయరు.
---> శుచియైన ఆహారం మాత్రమే భుజిస్తారు.
---> అనుదిన క్రియా కలాపాలలో ఏమఱుపాటు
చెందరు.
---> అతిథులు వారికెప్పుడూ పూజనీయులే!
---> కేవలం సత్యాన్ని పలుకుతారు.
---> ఐచ్ఛికంగా శాంతస్వభావాన్ని,
బ్రహ్మచర్యాన్ని పాటిస్తారు.
ఈ ఆరు లక్షణాలను ఆధునిక సమాజం ఎంతవరకూ సమాదరిస్తోంది అనేది ఆలోచించవలసిన అంశం.
సంకల్పబలం ఉంటే వీనిలో ఆచరణకు అసాధ్యమైనవి ఉండవు. వీటిని ఆచరణలో చూపిస్తే
ఆఫీసుల్లో పెండింగ్ ఫై ల్స్ ఉండవు. కలుషితాహారం తిని అస్వస్థులై ఆసుపత్రుల
పాలయ్యేవారుండరు. పనులు చేయటంలో రేపు, మాపు అని బద్ధకంతో వాయిదాలు వెయ్యటం
ఉండదు.అతిథులు వస్తారంటే , లేదా మనమే అతిథులుగా ఎవరింటికో వెళ్లవలసి వస్తే
భయపడవలసిన అవసరం ఉండదు. అసత్య దోషం ఉండదు. కక్షలూ, అత్యాచారాలూ ఉండవు. నిజానికి ఈ
అంశాలన్నింటికీ నేపథ్యంగా ఒక ఆధ్యాత్మిక దృక్పథం ఉంది. ఆచరణలో అది ప్రతిష్ఠితమైతే
అమరత్వమే సిద్ధిస్తుంది. ఇలాంటి సత్ప్రవర్తన కలిగిన సజ్జనులు భౌతికంగా మరణించినా
మరణాన్ని జయిస్తారని గ్రహించాలి.
"జీవంతం మృతవన్మన్యే దేహినం ధర్మ వర్తనం
మృతో ధర్మేణ సంయుక్తో దీర్ఘజీవీ న
సంశయః" అని పెద్దల మాట.
"ధర్మాన్ని త్యజించినవాడు జీవించి ఉన్నా చనిపోయినవానిగానే పరిగణింపబడుతాడు.
ధర్మైక జీవి మృతుడైనా చిరంజీవి అనటంలో సంశయం లేదు" అని దీని భావం.
Ref : అరణ్యపర్వం మహాభారతం నుండి సేకరించినది.
నవలల్లో మనో విశ్లేషణాత్మకత
నవలల్లో మనో విశ్లేషణాత్మకత
పరిచయo:
నవలల్లో మనో విశ్లేషణాత్మకత అనేది నవీన యుగములోనే ప్రారంభం అయిందని
చెప్పవచ్చు. క్రీ.శ. 1920-1942 ప్రాంతములోని తెలుగు నవలా వికాసం నందు, క్రీ.శ.1942
నుండి 1960 వరకు మధ్య ప్రాంతం లోని మనో వైజ్ఞానిక యుగము నందు నవలల్లో గల మనో
విశ్లేషణాత్మకత మీద విస్తృత చర్చ జరిగిందని చెప్పవచ్చు.
మనస్తత్వ విశ్లేషణల ద్వారా మాత్రమే మానసిక పరిణతి సాధించబడ్తుందని గ్రహించి
సాహిత్యములో మనో విశ్లేషణాత్మకతని పరిచయము చేశారు. కథకు మనో విజ్ఞానమునకు
ప్రాధాన్యము ఇవ్వడం దీని ముఖ్య ఉద్దేశం. వీటిల్లో మనో విశ్లేషణ ప్రధానముగా
ఉంటుంది. ఒక వ్యక్తి పాత్ర ప్రవర్తించే స్వభావము అతని మనసు ఆలోచించే తీరుమీద
ఆధారపడి ఉంటుంది. ఆ వ్యక్తి జీవితములోని కీలకసమయాలలో అతని మనస్తత్వం ఎలా ఉంది?
అతని నిర్ణయాలను అతను అతని ఇష్టానుసారం అనుసరించినప్పుడు వాటి ఫలితాలు అతనే
అనుభవిస్తాడు. ఒక వ్యక్తి ఇతరులకు సలహాలుగా సూచనలుగా ఎన్నో విషయాలు చెప్తాడు కానీ
తను మాత్రం ఆచరించడు. అలాగే కొందరు ఇతరులలోని తప్పులని ఎత్తిచూపుతారు వారికి
జ్ఞానభోద చెయ్యాలని చూస్తారు కాని వారు మాత్రం వారు చేసే తప్పులని
విశ్లేషించుకోరు. ఈ విషయాలన్నీ మనస్తత్వం ఆధారంగా ఆ వ్యక్తి యొక్క ఆలోచనా సరళిని,
వ్యక్తిత్వాన్ని నమ్మకాలను ఆశ్రయించి ఉంటాయి.
మనస్తత్వం ప్రధానంగా పాత్రల మానసిక సంఘర్షణలు, మనో విశ్లేషణలు, తత్వాలు,
ఆలొచనలను వివరిస్తూ నవలా రచన సాగుతుంది. మనో విశ్లేషణాత్మకంగా రచనలు చేసిన వారిలో
త్రిపురనేని గోపీచంద్, రాచకొండ విశ్వనాధ శాస్త్రి, జి.వి.కిష్ణారావు, బుచ్చిబాబు,
కొడవటి గంటి కుటుంబరావు ముఖ్యులుగా చెప్పవచ్చు.
మనోవిశ్లేషణాత్మకతను ప్రధానంగా చేసుకుని రచన కావించబడ్డ నవలలలోముఖ్యమైనవి
బుచ్చి బాబు – చివరకు మిగిలేది, గోపీచంద్ – అసమర్ధుని జీవయాత్ర, విశ్వనాధ శాస్త్రి
గారి అల్పజీవి, రాజు మనిషి మొదలైన నవలలు ముఖ్యమైన నవలలుగా చెప్పవచ్చు.
ముఖ్యమైన కొన్ని మనో విశ్లేషణాత్మక రచనలు:
కొడవటిగంటి కుటుంబరావుగారు ఆర్ధిక మానసిక సంక్షోభాన్ని మనో విజ్ఞానాన్ని
కథా సంవిధానాన్ని కూడా చూపిస్తూ అనుభవం, చదువు, ఆత్మజన్మ, కొత్త కోడలు, ప్రేమించిన
మనిషి, కొత్త అల్లుడూ మొదలైన నవలలు రచించారు.
బుచ్చిబాబు చివరకు మిగిలేది నవలలో సాంఘిక, మానసిక సంఘర్షణలకు సతమతమౌతూ,
తల్లి మీద నింద తనకి నీడలా వెంటాడుతోందని భాదపడ్తూ ఉన్నటువంటి పాత్రగా దయానిధి
పాత్రని చిత్రించారు. చివరలో అతను చేసినట్టి సాహసలు అతని జీవితగమనంలోని ఒడిదుడుకులను కూడా ఇందులో
వివరిస్తారు. ’చివరకు మిగిలేది’ ఏంటి? అని పాఠకుని ప్రశ్న ముగింపుగా మనకు ఈ నవలలో
కనిపిస్తుంది.
అవ్యక్త మానసిక స్ధితికి ప్రాధాన్యమిస్తూ చేసిన రచన రాచకొండ విశ్వనాధ
శాస్త్రిగారి అల్పజీవి. మధ్య తరగతి గుమాస్తా అయిన సుబ్బయ్య తన జీవితాన్ని
స్ధితిగతులను నిందించుకుంటూ జీవితం గడుపుతుంటాడు. పరిణతి చెందిన వ్యక్తిత్వము
లేనివాడుగా సుబ్బయ్య పాత్ర ఇందులో కన్పిస్తుంది. వ్యక్తిత్వము లేక అతను అల్పజీవి
అయిన విధానాన్ని వివరిస్తూ మానసిక లోతులు ఒక వ్యక్తిలో ఏ పరిధిలో ఉంటాయో
అద్భుతముగా వివరిస్తారు.
త్రిపురనేని గోపీచంద్ అసమర్ధుని జెవయాత్ర నవల అతిముఖ్యమైనది. జీవితంలో
ఎన్ని ఉన్నా సుఖదుఖాలకు జయాపజయాలకు వ్యక్తియొక్క మనస్తత్వమే ప్రధానమని నిరూపించిన
తొలినవలగా దీని గురించి చెప్పుకోవచ్చు. సీతారామారావు పాత్రని ప్రతిభావంతంగా
తీర్చిదిద్దాడు. మెరుపుల మరకలు, పండిత ప్రమేశ్వర శాస్త్రి వీలునామా, పిల్ల తెమ్మెర
నవలలు గోపీచంద్ మనో విశ్లేషణాత్మకత కు నిదర్శనాలు.
ఏకవీర – అసమర్ధుని జీవయాత్ర నవలల పరిచయం:
ఏకవీర పాశ్చాచ్య నాగరికతా వ్యామొహంలో పడి నైతికవిలువలు సంస్కృతీ సంప్రదాయము
మర్చిపోతున్న సమయంలో కొత్త సమాజాన్ని నిర్మింపజేయాలనే ఆశతో నవలా రచన చేసి 60కి
పైగా నవలలను రచించిన వారు విశ్వనాథ సత్యనారాయణ. వీటిల్లో ఉత్తమోత్తమ
స్ధాయినందుకున్న నవల ’ ఏకవీర’. మధురను ఏలిన నాయకరాజుల కాలమునాడు జరిగినట్టి కధగా
మనకు కనిపిస్తుంది.వైదిక ధర్మానికీ, వ్యక్తిగత హృదయ స్పందనకు మధ్య సంఘర్షణ ఇందులోని
కథా బీజము. ప్రేమకీ ధర్మానికీ చెలరేగిన ఘర్షణ ఇందులో తారస్ధాయినందుకుంది.
వీరభూపతి, కుట్టాన్,మీనాక్షి,ఏకవీరలు ఇందులో ప్రధాన పాత్రలు. వీరి ప్రేమ కథలు,
విరహవేదనలు ఇందులో ప్రధాన వస్తువులు.
ఏకవీర ఇతివృత్తం:
సేతుపతి కుట్టాన్, వీరభూఅప్తి చిన్ననాటి నుంచీ ప్రాణ మిత్రులు. అన్ని విద్యలయందు ఆరితేరినవారు. సమౌజ్జీలు. సేతుపతి సైన్యాద్యక్షుడి కొడుకు.
వీరభూపతి సామాన్యుడు. సేతుపతి మీనాక్షి అనే సామాన్య యువతిని ప్రేమిస్తాడు. ఆమె
కూడా ఇతన్ని ప్రేమిస్తుంది. వీరభూపతి ఏకవీర అనే రాజకుమారిని ప్రేమిస్తాడు. ఆమె
కూడా ఇతన్ని ఇతన్ని ప్రేమిస్తుంది. కానీ పరిస్తితులు అంతస్ధుల అంతరాల వల్ల ఒకరి
చెలియని మరొకరు ఒకరికి తెలియకుండా ఒకరు వివాహము చేసుకోవల్సి వస్తుంది. ప్రేమించిన
వారిని వదలలేక వైవాహిక బంధానికి తలొంచలేక పెద్దలనందరినీ ఎదిరించలేక మనస్సుకు
సర్దిచెప్పుకోలేక నలుగురూ చివరకు మనో సంఘర్షణకు గురౌతారు. ఏకవీర పాత్ర ఆత్మార్పణ
చేసుకుంటుంది.
ఏకవీర – మనో విశ్లేషణాత్మకత:
ధృఢ చిత్తం గలవారు వీరాధివీరులు అన్నింటా జయాపజయాలు తప్ప అపజయాలను చూడని
వారు సేతుపతి, వీరభూపతి. అన్నింటా ప్రతిభావంతులు కానీ జీవితగమనంలో ఓడిపోతారు.తమ
మనసును తామే వంచించుకుంతారు. ఏకవీర పాత్ర ధైర్యం గలది దిట్టమైన గుండె గలది
రహస్యాలు వెల్లడించని స్త్రీ ఏకవీర. పేదవనిత సామాన్యురాలైనప్పటికీ ఆత్మాభిమానం,
అద్వితీయ సౌందర్యం ప్రతిభ గల స్త్రీ మీనాక్షి.
ఈ నాలుగు పాత్రలూ ఇన్నింటా ప్రావీణ్యులు ఓటమినెరుగని వారు జీవితగమనంలో
ఎందుకు ఓడిపోయారనేది ప్రధాన ప్రశ్న. వారి వారి మనస్సును చంపుకోలేక పెద్దవారి మాటను
ఎదిరిమ్చలేని వారిగా ఈ నలుగురి పాత్రలూ కనిపిస్తాయి. వీరి తల్లిదండ్రులు తమ
మూర్ఖత్వం కొద్దీ తమ పంతం నెగ్గించుకుంటారు. అంతిమంగా ఫలితం పొందలేకపోతారు.
ఆత్మవంచన చేసుకులేని, మోసం చెయ్యలేని పాత్రలుగా నలుగురి పాత్రలనూ గొప్పగా
విశ్వనాధగారు తీర్చిదిద్దారు. చదువుకున్న వారు, సకలవిద్యాపారంగతులైనప్పటికీ మనసు
మాటవినలేక, పెద్దలని ఎదిరించలేక జీవనగమనములో ప్రయాణం సాగించలేక ఆత్మవంచన
చేసుకుంటారు. విచక్షణ ఆలోచనలను కోల్పోయిన పాత్రలుగా వీరి పాత్రలు కనిపిస్తాయి.
ఏకవీర పాత్ర అన్ని ఆటుపోట్లనూ ఎదుర్కోలేక రాజీ పడలేక ప్రియుడికీ దూరమై భర్తకూ
దూరమై ఎవ్వరి ప్రేమానురాగాలు పొందకుండా మరణిస్తుంది. చివరిలో ఏకాకిగా మిగిలిన
అనుభూతి కలుగుతుంది. సేతుపతి, ఏకవీర, భూపతి, మీనాక్షిల మానసిక సంఘర్షణలు, మనస్సులో
చెలరేగే ఆలోచనలు, సంక్షోభాలు, వ్యక్తిత్వనిరూపణలు మొదలైనవి పాత్రోచితముగా
సందర్భోచితముగా అద్భుతంగా చూపారు.
గోపీచంద్ – అసమర్ధుని జీవయాత్ర:
జీవితములో ఎన్ని ఉన్నా సుఖానికి విజయానికి వ్యక్తి మనస్తత్వమే అన్నిటికంటే
ముఖ్యము అని నిరూపించిన తొలి నవల ’ అసమర్ధుని జెవయాత్ర. జీవితములో అనేక సమస్యలకు
లోనైన వ్యక్తి జీవితమెందుకు అను మీమాంస ఈ నవల. సీతారామారావు పాత్ర ద్వారా సగటు
మనిషి జీవితము ఎన్ని మానసిక సంఘర్షణలకు లోనవుతుందో ఇందులో గోపీచంద్ వివరీంచారు.
సీతారామారావు పాత్ర అపరదానకర్ణుడిగా, మంచి వ్యక్తిత్వము ఉన్న వాడిగా నవల మొదట్లో
కనిపిస్తుంది. తర్వాత క్రమక్రమముగా అతని పాత్రతీరు ఉచ్చస్ధితికి
కాకుండా నీచస్ధితికి చేరుకోవడాన్ని మనము గమనించావచ్చు. అతని పాత్ర అతని
వ్యక్తిత్వము ఆలోచనలు ఆశయాలు అన్నీ కాలగర్భమునందు మట్టిలో కల్సిపోయాయి. పాఠకుడు
ఇంత అద్భుతంగా ఆలోచించే వ్యక్తి ఇంత మంచి వ్యక్తి నిజాయితీగా దర్మబద్ధంగా ఆలోచించే
వ్యక్తి చివరికి ఎంత గొప్పవాడౌతాడో ఎంతమంది చేత ఆరాధింపబడుతాడో అని ఊహిస్తాడు.
కానీ ముగింపు దానికి పూర్తి విరుద్ధముగా ఉంటుంది ఒక మనస్సు చెపినట్లు వ్యక్తిత్వము నడవడిక తీరు తెన్నులు అనేవి జీవితములో చోటుచేసుకుంటాయి.
ఆత్మవంచన చేసుకుని ధర్మ విరుద్ధంగా సత్యానికి వ్యతిరేకముగా పనులు చేసినప్పుడు
ఎలాంటి ఫలితారు అనుభవించవలసి వస్తుందో ఎన్ని కష్టాలు పడాల్సి వస్తుందో జీవితము ఎంత
నీచస్ధితికి చేరుకుంటుందో అన్న దానికి నిలువెత్తు సాక్ష్యంగా మనకి సీతారామారావు
పాత్ర చిత్రణ, మనస్తత్వము కనిపిస్తుంది.
ధర్మ మార్గములో పేరు ప్రతిష్టలు సాధించి వంశ ప్రతిష్టను నిలబెట్టిన వాడు
సీతారామరావు అయినప్పటికీ మనస్సు ఆలోచనలు పరి పరి విధాల పెడదారి పడుతున్నా వాటిని
అదుపులో ఉంచుకోలేక ఆలోచనలకు తలవంచి జీవితాన్ని కోల్పోయిన పాత్ర ఇతనిది. మనం
జీవితంలో ఏమేమి చేయాలో ఏ విధంగా నడచుకోవాలో అన్న విషయాలన్నిటికీ సీతారామారావు
మనస్తత్వము నిలువెత్తు సాక్ష్యముగా పరిగణించవచ్చు. ఈ ప్రపంచములో నిజముగా సుఖప్డేది
సంతోష పడేది అజ్ఞానే అని భావిస్తాడు. ఆడవాళ్ళు హీనులని భావిస్తాడు. అతిచిన్న
విషయాల గూర్చి అతిగా ఆలోచన చెయ్యడం కోర్కెలకు అతి తీరకపోవడానికి గల కారణాలు,
వాటివల్ల పడుతున్న బాధలకు కారణాలు అని భావించి ఆలోచనలు చెయ్యడం మానేస్తాడు. తనని
తాను అతిగా కష్టపెట్టుకుని భార్యా బిడ్డలను అనవసరంగా తిడుతూ వారి ఆప్యాయతానురాగాలకు
ప్రేమకు దూరమౌతాడు. నిశితముగా దేని గురించి ఆలోచించడు. ప్రయత్నించకుండానే వచ్చి
పడాలని ప్రయత్నిమ్చడము గొప్ప కాదని భావించి దాన్ని ఆచరణలో పెడతాడు. శ్మశానానికి చేరుకుని ఆత్మాన్వేషణ చేసుకుంటాడు.
ఎదిగిన కూతురు సంపాదించి తెచ్చి కుటుంబాన్ని పోషిస్తూ కొడుకుని చదివిస్తూ ఉంటుంది.
అది చూసి కూడా తానుసంపాదించడం మొదలు పెట్టడు.కొడుకు పెళ్ళి చేసుకుని
సంపాదనాపరుడౌతాడు. భార్య ఇందిర పిల్లల బాగోగులు చూసుకుంటూ కాలం వెళ్లదీస్తుంది.
వాళ్ళని చూస్తూ వాళ్ళని సంతోషపెట్టలేకపోయానని బాధపడ్తూ చివరికి చనిపోతాడు.
ముగింపు:
ఈ పాత్రలన్నిటి ద్వారా మనకు అనేక విషయాలు తెలుస్తాయి. మానవులు చేసే పనులు
అన్నిటికీ మనసే ప్రధానము, అది పరిపరి విధాల ఆలోచిస్తుంది. మనస్సు చెప్పిన దాని
ప్రకారమే పాత్ర తీరు, నడవడిక ఆలోచనలు నడుచు కుంటాయి. బుద్ధి ఒకటి చెప్తుంది, మనసు
ఒకటి చెప్తుంది, నడవడిక మరొకటి చెప్తుంది. బుద్ధి, మనస్సు , నడవడిక అన్నీ మన
నియంత్రణలోనే ఉంటాయి. మంచి చెడ్డలను విడదీసుకుని మానవత్వానికి ప్రాధాన్యము
కల్పిస్తూ ధర్మ న్యాయ నీతిబద్ధముగా ఆలోచిస్తూ, సత్యానికి ఎక్కువ ప్రాధాన్యము ఇస్తూ
ఉంటే మన జీవితము పూలబాటలా సాగుతుంది. వీటన్నిటినీ కూడా ఆచరణలో ఎట్టడానికి మనో
నియంత్రణ అతి ముఖ్యము. మనస్తత్వ విశ్లేషణల ద్వారా మాత్రమే మనో పరిణతి
సాధించబడ్తుందని గ్రహించి సాహిత్యములో మనో విశ్లేషణాత్మకతని పరిచయము చేశారు. దీని
ద్వారా ఎట్లా జీవితము మొదలు పెట్టిన వారైనా ఎంత గొప్పవారైనా మనసు అదుపులో
ఉంచుకోనట్లైతే ఎట్లా మారగలరో మనకు నవలలలో పాత్రల ద్వారా రచయితలు నిరూపించారు. ఈ
నవలలలో పాత్రలు అన్నీ మనకు మార్గదర్శకాలు. వీటిలో నిజానిజాలను గ్రహించి మన
జీవితాల్లో అవి జరగకుండా చూసుకుంటూ, వాటిని నిరంతరము గుర్తు చేసుకుంటూ ఉండాలి.
ఆత్మస్థైర్యాన్ని, మనోనిగ్రహాన్ని అలవరుచుకోవాలి. మానసిక విశ్లేషణచేసుకోవాలి. వాటిని జ్ఞప్తికి తెచ్చుకుంటూ జీవనము కొనసాగిస్తే మన జీవితము ఆనందమయము
అవుతుంది.
Sunday, September 8, 2013
నాకు ఇష్టమైన దైవం వినాయకుడు
శుక్లాంబర ధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
అగజానన పద్మార్కం గజానన మహర్నిశం
అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నం కురు మే దేవ సర్వ కార్యేషు సర్వద
మొదటగా వినాయకప్రార్థన చేసిన తరువాత మనం ఏ కార్యం మొదలుపెట్టినా అది నిర్విఘ్నంగా కొనసాగుతుందని లోకోక్తి. నాకు ఊహతెలిసిన తరువాత నేను తెలుసుకున్న తొలి పండుగ వినాయక చవితి. భాద్రపద శుద్ధ చతుర్ధి నాడు పొద్దున్నే లేచి కొత్తబట్టలు వేసుకుని చెట్ల దగ్గరకి వెళ్ళి పూజకు అవసరమైన పత్రిని తీసుకు రావడం, విగ్రహాన్ని తయారు చేయడం, వాటితో పూజ చేయడం, పుస్తకాలకు పసుపు పెట్టడం, ముఖ్యంగా ఉండ్రాళ్ళు పంచిపెట్టడం వంటి ఈ కార్యక్రమాలు నాకు భలే నచ్చేవి. ఒకసారి వినాయక చవితికి విగ్రహాన్ని చేస్తున్నప్పుడు నాకు ఒక సందేహం కలిగింది.
వినాయకుడు ఇంతగొప్పవాడు కదా! మరి ఈయనకి ఇటువంటి దేహం ఎందుకు వచ్చిందా అని..?! మరి ఆయన దేవుడు కదా.. మన కోరికలన్నిటినీ తీరుస్తాడంటారు కదా మరి అంతగొప్పవాడైన ఆయన దేహం ఇంత వికృతంగా ఎందుకుందా అని నాకు సందేహం కలిగింది. ఆయన ఎందుకు అందంగా లేడని బాధ కలిగింది. దేవుళ్ళందరిలోకి అత్యంత అందగాడు, తెలివి తేటలు గలవాడు, మేధోశాలి ఈయనే అన్న విషయం చాలాకాలం తర్వాత నాకు బోధపడింది.
వినాయకవ్రత కథ తెలుసుకున్నప్పుడు ఆ కథ నిజం కాదేమో కల్పించి చెప్పినదేమో అనిపించింది. ఒకసారి నేను అప్పుడే పుట్టిన ఒక పిల్లవాడిని చూశాను. ఆ పిల్లవాడు కూడా కొంత వినాయకుని పోలికలతో ఉన్నాడు. వికృతంగా ఉన్నది మొహమంతా. కొంతమంది ఆ పిల్లవాడిని అసహ్యించుకోసాగారు. నాకా పిల్లవాని మొహంలో వినాయకుడు కనిపించాడు. అప్పుడు నాకు, ఇంతచిన్నవయసులోనే ఈ పిల్లవాడు ఇన్ని అవమానాలు పొందుతుంటే, అంత కాలం ఆ వినాయకులవారు ఇంకెన్ని అవమానాలు పొందారో అనిపించింది. అవన్నీ తట్టుకుని కూడా ఎంత గుండె నిబ్బరంతో ఉన్నారో అనిపించింది. ఇంతటి ఆకారంతో ఉండి ఆ స్వామివారు ఇన్ని విజయాలు సాధిస్తే అన్నీ సక్రమంగా ఉన్న మానవులు ఇంకెన్ని విజయాలు సాధించగలరో అనిపించింది.
వినాయకుడు లోకంలోని దేవతాగణములకు అధిపతి గా ఖ్యాతినొందాడు. విఘ్నాలను తొలగించి తలపెట్టిన కార్యాలను నిర్విఘ్నంగా పూర్తిచేయించేవాడు. విజయానికీ, చదువులకూ, జ్ఞానానికీ మార్గదర్శిగా నిలుచువాడు. వినాయకుని భారీ కాయం, ఉదరం సమస్త జగత్తుకు ప్రతీక. ఆయన నయనాలు, శిరస్సు మేధోశక్తిని చిహ్నాలు. ఆయన వక్రతుండము’ "ఓం"కారనాదానికి మూలముగా చెప్పేవారట. ఉదరబంధనంగా విలసిల్లు నాగబంధనము శక్తి, సామర్ధ్యాలకు ప్రతీక. ఆయన ఆయుధాలు ఆయన ఆలోచనలు అన్నీ మన బుద్ధి మనసులకు సన్మార్గబోధన చేసే సాధనాలు. వ్యాసభగవానుడు భారతరచనకు సంకల్పించినపుడు వినాయకులవారు వారి దంతాన్ని విరిచి కలంగా ఇచ్చారని ప్రతీతి. గణాధ్యక్షునిగా ప్రసిద్ధిచెందినవారు. దేవతల చేత కూడా ప్రధమపూజలు అందుకునేవారు. తాండవనృత్యకళాకారుడు కూడా.
ఇన్నిరకాలైన ప్రఖ్యాతులు గణేశుని సొంతం. ఈశరీరంతో ఇంత పేరుప్రఖ్యాతులు సాధించిన గణేశుని చూసినతరువాత ఆయనను గురించి తెలుసుకున్న తరువాత ఆయనపై భక్తి పెరిగింది. వినాయకచవితినాడు మనం గణేశుని తలుచుకుని ఏదైనా కార్యసాధనకు పూనుకుంటే ఆకార్యం నిర్విఘ్నంగా కొనసాగుతుందని లోకోక్తి. ఇన్ని విషయాలు తెలుసుకున్న తరువాత నాకు ఒక ఆలోచన కలిగింది. మనం దేవతలను, దేవుళ్ళను చూసి వారి కథలను చదివి తెలుసుకోవలసిన విషయాలు అనేకం ఉన్నాయేమో అనిపించింది. మనకి అనేకమంది ఈ ప్రార్ధన ఇన్ని సార్లు చదువు అంటారు కానీ ఎందుకో చెప్పరు. అది అన్ని సార్లు చదివితే ఒక్కసారైనా అది మన మస్తిష్కాన్ని తాకుతుందేమో అని అన్నిసార్లు చెప్పారేమో అన్నది నా అభిప్రాయం. మనం దేవతలను గూర్చి తెలుసుకుని వారి కథలను చదివి, వారి వ్యక్తిత్వము గురించి తెలుసుకుని స్పూర్తి పొందాలి కానీ వారిని కోరికలు కోరరాదేమో అనిపించింది. దేవతలుగా కీర్తింపబడినవారందరూ వారివారి విషయాలలో ప్రావీణ్యులు. ఒక్కవినాయకుల విషయంలోనే మనకు ఇన్ని విషయాలు తెలిస్తే ఇంక తక్కిన దేవుళ్ళను గురించి తెలుసుకుంటే ఇంకెన్ని విషయాలు అవగతమవుతాయో అనిపించింది. మనం దేవుళ్ళను కోరికలు తీర్చమని కాక వారి జ్ఞానానికి, వారు ఈ రోజు ఈ స్థితిలో ఉండటానికి గల కారణాల్ని తెలుసుకుని వాటి సాధనకు పూనుకుంటే, వారి వ్యక్తిత్వ సాధనే మన ధ్యేయంగా మార్చుకుంటే మనం ఇంకా ఉన్నతస్థితిని సాధించడంతో పాటు దేవుళ్ళ అనుగ్రహంతో పాటుగా మోక్షాన్ని సాధించగలమేమో అనిపించింది.
ఆవినాయకులవారు మీకందరికీ విజయాలకీ, విద్యలకూ, జ్ఞానానికీ మార్గదర్శిగా నిలవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
అందరికీ వినాయకచవితి శుభాకాంక్షలు.
గమనిక. ఎవరి మనోభావాలను అయినా దెబ్బతీసి ఉంటే మన్నించమని ప్రార్ధన.
Thursday, April 11, 2013
శ్రీ ’విజయ’ నామ సంవత్సర యుగాది శుభాకాంక్షలు..
ఉగాది
ఉగాదిని చైత్ర మాసంలోనే జరుపుకోవడానికి గల కారణాలు:
''ఉగ'' అంటే నక్షత్ర నడక అని, ''ఆది'' అంటే మొదలు అని అర్ధం. సృష్టి ఆరంభం లేదా కాలం మొదలవడాన్ని ''ఉగాది'' అన్నారు. మరోరకంగా చూస్తే ''యుగం'' అంటే రెండు అనే అర్ధం ఉంది. అంటే ఒకటి కాలం, రెండోది గ్రహాలు. కాలం రాశులలో ప్రవేశించడాన్ని బట్టి ''యుగము'' అన్నారు. ''యుగం'' ప్రారంభమైన రోజు కనుక ''యుగాది'' అన్నారు. అదే క్రమంగా ''ఉగాది'' అయింది. చైత్ర శుద్ధ పాడ్యమి చాంద్రమాన ఉగాది లేదా యుగాది పండుగ.
అసలు చైత్ర మాసానికి ఆ పేరు ఎందుకు వచ్చిందో చూద్దాం.పౌర్ణమినాడు చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రం పేరు ఆ మాసానికి వస్తుంది. ఈ పౌర్ణమి నాడు చంద్రుడు ''చిత్రా'' నక్షత్రంలో (దీన్నే చిత్తా నక్షత్రం అంటాం) ఉండటంవల్ల ఈ నెలకు ''చైత్రమాసం'' అనే పేరు వచ్చింది.
ఉగాదిని చైత్రమాసంలోనే ఎందుకు జరుపుకోవాలి? ఇతర నెలల్లో కూడా చంద్రుడు ఇతర నక్షత్రాలతో కూడి ఉంటాడు కదా.. మరి ఇతర నెలల్లో ఎందుకు జరుపుకోవడంలేదు? విఘ్నాలను తొలగించే వినాయకుని పండుగ వచ్చేది భాద్రపదమాసంలో. మరి భాద్రపదమాసం కంటే ఉత్క్రుష్టమైన నెల ఎదుంటుంది? ఆ నెలలో ఎందుకు ఉగాది జరుపుకోవడంలేదు? ముఖ్యంగా అన్ని నెలల్లోకెళ్ళా శ్రేష్ఠమైంది మార్గశిర మాసం. ''మాసానాం మార్గశీర్షోహం'' అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఉపదేశించాడు. అవును, లోకకళ్యాణార్ధం కృష్ణుడు గీతోపదేశం చేసింది మార్గశిరంలోనే. మరి అంట ఉత్తమమైన మార్గశిర శుద్ధ పాడ్యమి ఉగాది ఎందుకు కాలేదు? ఇక ఆశ్వయుజ మాసం కూడా ఘనమైందే. ఆశ్వయుజంలో అత్యంత ఉత్సాహంతో, భక్తిశ్రద్ధలతో , లక్ష్మీ, సరస్వతి, కనకదుర్గాదేవిల పూజలు నిర్వహిస్తాం. మనకు చాలా అవసరమైన చదువు, తెలివి డబ్బు, ధైర్యం అన్నిటినీ ప్రసాదించే దేవతల పూజలు నిర్వహించేది ఈ నెలలోనే. విజయదశమి పర్వదినం నాడు జైత్రయాత్రకు సన్నాహాలు జరుగుతాయి. పోనీ శ్రీరామనవమి, శ్రీకృష్ణ జన్మాష్టమి వచ్చే నెలలు ఎలా చూసినా పవిత్రమైనవే కదా! ఆ నెలల్లో ఎందుకు సంవత్సరాదిని చేసుకోము? చాతుర్మాసం మొదలయ్యే ఆషాఢంలోనో, ఉత్థాన ద్వాదశి వచ్చే కార్తీకమాసంలోలోనో ఉగాది ఎందుకు జరుపుకోము? ఇలా చూస్తే పన్నెండు నెలల్లో ఏడాది పొడుగునా అనేక ప్రత్యేకతలు, పర్వదినాలు ఉన్నాయి. కానీ వాటన్నిటినీ వదిలి చైత్ర శుద్ధ పాడ్యమినే ఉగాదిగా, సంవత్సరాదిగా జరుపుకుంటున్నాం..
చైత్ర శుద్ధ పాడ్యమినే కొత్త సంవత్సరంగా అంగీకరించడానికి, వేడుక చేసుకోడానికి కారణం ఋతువులు. నెలల కంటే ఋతువులు ప్రధానమైనవి.చైత్రమాసానికి శిశిర ఋతువు పోయి వసంత ఋతువు... అంటే చలికాలం పోయి వేసవికాలం వస్తుంది. ఆకులు రాలే కాలం అయిపోయి చెట్లు చిగుర్చి పూత పూస్తాయి. మల్లెలు గుబాళిస్తాయి.పక్షుల ఈకలు ఊడి కొత్తవి వస్తాయి. మనకు కూడా అప్పటిదాకా చర్మం పొడివారడం, పగుళ్ళు, పొట్టు ఊడటం లాంటి సమస్యలు పోయి కొత్త చర్మం వస్తుంది. ఈ నెలతో చెట్లు చిగురించడం మొదలై పూత, పిందెలు, పండ్లు - ఇలా అంతా లబ్దికరంగా సాగుతుంది. శరీరంలో పైకి కనిపించే మార్పులే కాదు.. మానసికంగా కూడా చైత్రమాసం నుండి ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటుంది. చలికాలంలో, వర్షాకాలంలో ఉండే మండగోడితనం వసంతఋతువు నుండి ఉండదు. ఒకవిధమైన చురుకుదనం ప్రవేశిస్తుంది. ఈ కారణంగానే చైత్రమాసంలో ఉగాదిని జరుపుకుంటాం.
ఉగాదిరోజున చేయవలసిన పనులు:
"నూతన సంవత్సర కీర్తనాత్ ప్రారంభః ప్రతి గృహ ధ్వజారోహణం
నింబ పత్రాశనం సంవత్సర పంచాంగ శ్రవణం నవరాత్రారంభః"
సంవత్సరాదిని అంటే కొత్త సంవత్సరాన్ని కీర్తిస్తూ తలస్నానం చేయడంతో దినచర్య మొదలౌతుంది.ధ్వజారోహణం చేయాలి. కొన్ని వేపాకులు నమలాలి. వేపపూత కలిపి చేసిన ఉగాది పచ్చడి తినాలి.కొత్త దుస్తులు ధరించి నిత్యకర్మ పూర్తి చేసుకుని పంచభక్ష్య పరమాన్నాలతో భోజనం చేసి పంచాంగ శ్రవణం చేయాలి. ఉగాది నుండి వసంత నవరాత్రులు ప్రారంభమౌతాయి.
ఉగాది పచ్చడి తినడంవల్ల కలిగే ప్రయోజనాలు:
"శతాయుష్యం వజ్రదేహం దదాత్యర్ధం సుఖానిచ
సర్వారిష్ట వినాశనం చ నింబ కందళ భక్షణం"
వేపపూత, బెల్లం తినడం వల్ల శరీరం వజ్రంలా గట్టిపడుతుంది. సర్వసంపదలు వస్తాయి. ఎలాంటి కష్టాలైనా తీరిపోతాయి.
శాస్త్రం ప్రకారం చూస్తే చైత్ర మాసంలో భూమి సూర్యునికి చాలా దగ్గరగా ఉంటుంది. కనుకనే గ్రీష్మ తాపం ఎక్కువగా ఉంటుంది. ఈ వేడివల్ల కొన్ని రకాల వ్యాధులు రావడానికి, ప్రబలడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఈ ఉపద్రవాన్ని నివారించడానికి వేపపూత, బెల్లం తోడ్పడతాయి.
అనేక పురాణ కథల్లో ఉగాది ప్రస్తావన కనిపిస్తుంది. విష్ణుమూర్తి మత్స్యావతారం ఎత్తింది చైత్ర శుద్ధపాడ్యమి నాడే. సోమకుడు వేదాలను దొంగిలించగా వాటిని తీసుకొచ్చి బ్రహ్మదేవునికి అప్పగించేందుకు విష్ణుమూర్తి మత్స్యావతారం ఎత్తాడు. మహా విష్ణువును స్మరించుకుని ధ్యానించుకునే నిమిత్తమే ఉగాది పండుగ ప్రారంభమైంది.
చరిత్రలో అత్యంత పరాక్రమశాలి విక్రమార్కుడు. ఆ తేజోవంతుడైన విక్రమార్క చక్రవర్తి పట్టాభిషిక్తుడయ్యాడయ్యింది చైత్ర శుద్ధ పాద్యమినాడే. కనుకనే ఉగాదినాడు విక్రమార్కుని స్మరించుకుని ఉత్సాహం పొందుతారు.
షణ్ముఖం ద్వాదశ భుజం వ్యాఘ్రవాహన మాశ్రితమ్ !
వ్యాఘ్ర చర్మాంబరం వందే ఖగం విజయ సంజ్ఞకం !!
మిత్రులందరికీ
శ్రీ విజయ నామ సంవత్సర యుగాది
శుభాకాంక్షలు..
నవవర్షస్య శుభాశయా:
Tuesday, April 2, 2013
అందం
అందం.....
ఈ ప్రపంచంలో ప్రతి జీవికీ అందం అనేది సహజంగా వచ్చేస్తుంది.... ఈ రంగులను, ఈ రంగు రంగులతో కూడిన అందమైన పూలను, పళ్లను, పక్షులను, వాటినన్నిటినీ తనలో ఇముడ్చుకున్న ఈ ప్రకృతిని ఎవరు సృష్టించారో తెలీదు..
కొందరు భగవంతుడంతారు.. కొందరు ప్రకృతే సృష్టించింది అంటారు..
కానీ ఈ ప్రకృతిలో జీవ రాసులన్నిటిలోనో ఉన్న ఒకే ఒక్క తేడా ఆడ మగ...
మనము ఎన్ని తేడాలు ఏర్పరుచుకున్నప్పటికీ.. దేవుడు సృష్టించిన తేడా ఇదేనేమో... ( నాకు ఇంతకన్న తేడాలు ఏమున్నాయో తెలీదు మరి)
ఈ అందం అనే ఆలోచన మనిషికి వచ్చిందేనేమో.. లేకపోతే ఈ ఒక్క చిన్న విషయాన్ని గురించి ఆలోచిస్తూ ఎంతో మంది ఆత్మ విశ్వాసాన్ని కోల్పోతున్నారు.. ఎందరో తాము అందంగా లేమని పక్క వారితో పోల్చుకుని భాదలు పడుతున్నారు.. మరి కొందరు అందాన్ని ఇనుమడించుకోవాలని తాము సంపాదించిన దానిని అంతా బ్యూటీ పార్లర్లకు సమర్పించు కుంటున్నారు....
మగ వారి సంగతి ఏమో గానీ ఆడవాళ్ళు మాత్రం అందం అనే విషయానికి అధిక ప్రాముఖ్యతని ఇస్తున్నారు...
అందుకేనేమో ఆడవాళ్ళ మీద వారి అందం మీద, వారు తయారు అవడానికి పట్టే సమయం మీద అనేక రకాల జోకులు పుట్టుకొచ్చాయి.
నిజానికి ఆడవాళ్ళు అందంగా ఉండరని ఎండలో కాసేపు పనిచేస్తే వారి అందం తరిగిపోతుందని అనేక మంది చెబుతుంటారు.
అది నిజమే ననడానికి కొన్ని ఆధారాలు కూడా లేకపోలేదు. సృష్టిలో అందం అని చెప్పుకునే లక్షణాలన్నీ మగజాతికే ఉన్నాయి. ఉదాహరణకి మగ కోయిలే పాడుతుంది, మగ నెమలే పురి విప్పి నాట్యం చేస్తుంది, మగ సింహానికే జూలు ఉంటుంది, ఇలా చాలా ఉదాహరణలు ఉన్నాయి.
కానీ మగ జాతికి అంత అందం ఎక్కడ నుంచి వచ్చిందంటారా??!!
అవన్నీ ఆడవారి రక్తమాంసాలతో తయారైన దేహాలు కదండీ.. అందుకే అంత అందం..
ఆడవారి అందం అంతా దేవుడు మగవారికి ఇచ్చేసి ఆడవారికి ’ మాతృత్వం’ అనే అందాన్ని ప్రసాదించాడు. దీనికి సంబంధించి ఒక కధ కూడా ఉందండీ.. ఒక సారి దేవుడు ఆడవాళ్లని అడిగాడట.. మీకు అందం కావాలా మాతృత్వం( తల్లి ప్రేమ ) కావాలా అని?! ఆడవాళ్ళు మాతృత్వం కావాలని కోరుకున్నారట. అంచేత ఆడవాళ్ళు తాము అందంగా లేమని బాధపడనక్కరలేదు, కృత్రిమ అందం కోసం తాపత్రయపడనక్కరలేదు.. ఎందుకంటే ఆడవారికి మాతృత్వమే ఎన్నటికీ తరగని అద్భుతమైన అందం.
ఈ సోది అంతా ఎందుకు అంటారా?! నా చుట్టు ప్రక్కల అనేక మంది ఆడవాళ్ళు తాము అందంగా ఉండమని అనేకరకాల పయత్నాలు చేయడం చూసాను. ఒకళ్ళైతే ఫ్లాస్టిక్ సర్జరీ వరకూ వెళ్ళారు. ఇవన్నీ చూశాక నిజంగా అందానికి జీవితంలో అంత ప్రాధాన్యం ఉందా అనిపించింది. తల్లి ఇచ్చే పాలల్లో పిల్లలని అంత అందంగా మార్చే గుణమున్నదా అనిపించింది. అందం కన్నా మధురమైన మాతృత్వం ఆడవాళ్లకు వరంగా ఉండగా బాహ్య సౌందర్యం కోసం ప్రాకులాడటం మంచిది కాదేమో అనిపించింది.బాహ్య సౌందర్యం కన్నా అంతఃసౌందర్యం గొప్పది కదా... నా అభిప్రాయాలు మీతో పంచుకోవాలని ఇలా రాసున్నాను. ఎవరి మనోభావాలయినా దెబ్బతిని ఉంటే మన్నించమని కోరుకుంటున్నాను.
Thursday, February 7, 2013
వివాహ చిహ్నములు-ప్రాముఖ్యత
వివాహ చిహ్నములు-ప్రాముఖ్యత:
శరీరము మనుగడకు ఆత్మ
ఎంత అవసరమో, ఆత్మ మనుగడకు శరీరము అంతే అవసరము. ఈ విశ్వం లోని చరాచర సృష్టి అంతా స్త్రీ పురుష ప్రకృతులుగా రూపు దాల్చి జీవిస్తోంది.
విడివిడిగా జన్మించి కలిసి మనుగడ సాగిస్తోంది. ఎక్కడో మహా యోగులైన పురుషులను మినహాయిస్తే
స్త్రీ, పురుషులు ఇద్దరూ ఒకరు లేకుండా ఇంకొకరు పరిపూర్ణ వంతులు కాలేరు. అందుకే ఆ ఇద్దరినీ
కలిపి సంపూర్ణవంతులు అవ్వడం కోసం వారి బంధాన్ని పరిపూర్ణ బంధంగా మార్చే ధర్మకార్యం
“వివాహము”. ఈ వివాహము అనే కార్యము ఇద్దరు వ్యక్తులనే
కాకుండా రెండు కుటుంబాలను కూడా కలుపుతుంది. స్త్రీ పురుషుల ఇద్దరి జీవితాలలోనూ భౌతికముగా, అంతర్ముఖంగా అనేక
మార్పులను తీసుకు వస్తుంది.
బయట నుంచి చూస్తే వివాహం, వైవాహిక బంధం పురుషునిలో కన్నా స్త్రీలోనే
ఎక్కువ మార్పులను తీసుకొస్తుంది. వస్త్రధారణ,అలంకరణలో అనేక ప్రత్యేకమైన మార్పులకు లోనౌతుంది.
అనేక పరిధులు, పరిమితులు ఏర్పడతాయి. ఇదంతా స్త్రీలకు మాత్రమే మారుతుంది. వివాహమైన పురుషునిలో
సాధారణంగా ఎటువంటి మార్పు కంటికి కనబడదు. కానీ వివాహమైన స్త్రీకి మాత్రం అనేక ఆభరణాలు
వైవాహిక చిహ్నాలుగా చేరి ఆమె వివాహవతి అన్న విషయాన్ని ప్రపంచానికి తెలియచేస్తాయి.ఇక్కడ ప్రపంచానికి తెలియ జేస్తాయి
అంటే పురుష ప్రపంచానికి తెలియజేస్తాయి అనే.. వీటన్నిటివలనా ఆ స్త్రీ సుమంగళి అనీ, సౌభాగ్యవతి
అనీ , పరస్త్రీ అని వ్యవహరించబడుతుంది.
ప్రకృతిలో స్త్రీ పురుషులు ఇద్దరూ సమానులు
అయినప్పుడు ఈ వివాహ చిహ్నాలను స్త్రీలు మాత్రమే ధరించడం లోని అంతరార్ధం స్త్రీ స్వేచ్చను
హరించడం కాదా? స్త్రీని తొక్కివేయడం కాదా? ఇది అతి సున్నితమైన, అతి ముఖ్యమైన, అత్యంత
ఆసక్తికరమైన విషయం. వివాహ చిహ్నాలను ధరించడం ఒక్క హైందవ మతంలోనే కాదు, ప్రపంచంలో ఏ
వివాహ పద్ధతి చూసినా స్త్రీలు మాత్రమే ఈ చిహ్నాలను ధరించడం చూడవచ్చు.
కొన్ని
మతాచారాలలో స్త్రీలకు పుట్టుకతోనే నుదుటన కుంకుమ ధరించడం, గాజులు ధరించడం మొదలౌతుంది.
కానీ కొన్ని మతాలలో వివాహ సందర్భంలో భర్త భార్య నుదుటన, పాపిటలో పెట్టిన కుంకుమే ఆమె
వివాహ బంధంలో ఉన్నది అన్న విషయాన్ని తెలుపుతుంది.
స్త్రీ వివాహిత అని తెలుపు చిహ్నాలలో ముఖ్యమైనవి
తాళిబొట్టు(మాంగల్యము), పసుపు కుంకుమలు గాజులు,
మెట్టెలు(మట్టెలు), ముక్కుపుడక(అడ్డు బాస), కళ్యాణం ఉంగరం మొదలయినవి.
తాళిబొట్టు
స్త్రీకి వివాహమయిన
తరువాత తప్పనిసరిగా ధరించే చిహ్నాలలో మొదటిది తాళిబొట్టు.దీనికే మంగళ సూత్రము, పుస్తెల
తాడు అని నామాంతరాలు ఉన్నాయి. స్త్రీ కి వివాహ సమయములో రెండు మంగళసూత్రాలను (అత్తింటి
వారిది ఒకటి, పుట్టింటి వారిది ఒకటి) గౌరీదేవి వద్ద పూజ చేయించి, పురుషుని చేత స్త్రీ
మెడలో కట్టిస్తారు. పుట్టినింటికీ, మెట్టినింటికీ మధ్య వారధిలా నిలిచి, రెండు కుటుంబాల
పేరు ప్రతిష్టలనీ,సంస్కృతీ సంప్రదాయాలనీ నిలబెట్టడానికి కృషి చేయమని సూచించడం మాంగల్య
ధారణలో గల అంతరార్ధం.
ఈ రెండు సూత్రాలను ఎంత బీదవారయినా తప్పనిసరిగా
బంగారముతోనే చేయిస్తారు. ఎందుకనగా బంగారము కుజగ్రహానికి చెప్పబడిన లోహము. కుజుడు అగ్ని.
ఉష్ణాన్ని నియంత్రించడంలో బంగారము సాయపడుతుంది. శరీరము నందు ఉత్పన్నమయ్యే ఉష్ణ శక్తికి
నియంత్రించి శరీరాన్ని ఆధీనములోకి తెచ్చే శక్తి బంగారానికి కలదు. అలాగే ఇది గర్భోత్పత్తికి
సహాయకారిగా ఉండి, వంధ్యత్వమును పోగొట్టడంలో సహాయపడుతుంది. అందుకనే స్త్రీల ఒంటి మీద
మాత్రమే ఎక్కువగా బంగారు ఆభరణాలు ధరింపజేస్తారు. “ అమృతం వైహిరణ్యం”, “ఆయుష్యం వర్చస్యగ్”
అనే వివాహ మంత్రంలోనూ ఆయుష్షు పెంచుతుందని చెప్తూ దీన్ని ధరింపజేస్తారు.
కుంకుమ
స్త్రీలు
మాత్రమే తప్పనిసరిగా కుంకుమ ధరించాలని ఉన్న నియమము ఈ నాటిది కాదు.హైందవ మతములో ప్రాచీనకాలము
నుండి సంప్రదాయముగా వస్తున్నది. వివాహము అయిన స్త్రీలకూ కుంకుమ అతి ముఖ్యమయిన ఆభరణం.
ప్రతి స్త్రీ దీనిని తప్పని సరిగా ధరిస్తుంది.కొన్ని కుటుంబాలలో కుంకుమ మాత్రమే ఆ స్త్రీ
వివాహవతి అని చెప్పడానికి గుర్తు. వివాహానికి ముందు నుదుటన మాత్రమే ధరించే స్త్రీలు,
వివాహము తరువాత పాపిటన కూడా ధరిస్తారు.కుంకుమ బొట్టును లక్ష్మీదేవిగా భావిస్తారు. ముఖాన
గనుక సింధూరం ఉంటేదృష్టి సోకదని, చెప్తారు.
నుదుట తిలకం లేకపోతే ముఖం కళ తప్పి బోసిగా ఉండటమే కాదు, మంచిది కాదని పండితులు ఉద్బోధించారు.
కనుక కుంకుమ కేవలం సౌందర్య చిహ్నం కాదని, మానవుల దృష్టి సోకకుండా ఉంటుందని అంటారు.
కుంకుమ
లేదా తిలకం ఎర్రగా ఉంటుంది. ఎరుపు సూర్యునికి సంకేతం. నుదుట ధరించే సింధూరం సూర్యుని
వేడిమి తాకకుండా చేస్తుంది. ఇంకా, శరీరంలోని అన్ని నాడులనూ కలుపుతూ, మెదడుకు సంకేతస్థానమై,
ఎప్పుడూ చైతన్యంగా ఉండే అతి కీలకమైన “సుషుమ్న” నాడి ఉండేది లలాటం మీదనే. దాన్నే “జ్ఞాననేత్రం”
అంటారు. ఈ జ్ఞాననేత్రానికి ఇతరుల దృష్టి సోకకుండా, సూర్యతాపం దానిమీద పడకుండా చేసేందుకు
సిందూరం పెట్టుకునే ఆచారం జనించింది. అంటే రక్త ప్రసరణ వల్ల, ఆలోచనల వెల్లువ వల్ల కలిగే
వేడి జ్ఞాననేత్రానికి తగలకుండా అది సురక్షితంగా ఉండేందుకు గానూ ఎప్పుడూ కుంకుమ ధరించి
ఉండాలి అన్నారు.
ఉంగరం ప్రత్యేకత:
కొన్ని మతాలలో వివాహ చిహ్నముగా
ఉంగరమును ధరించడం ఆచారముగా ఉన్నది. ఈ ఉంగరమును స్త్రీలు వారి ఎడమచేతి చిటికెనవేలు పక్కనున్న నాలుగవవేలుకు పెట్టుకుంటారు.
ఎందుకంటే ఆ వేలు నుండి ఒక రక్త నాళము తిన్నగా హృదయానికి పోవును. అందుకే ఈ వేలుని “ఉంగరము
వేలు” , “అనామిక” అని కూడా వ్యవహరిస్తారు. దీనిని ధరించడం వలన ఇక్కడ చర్మానికి స్పర్శ
కలిగి హృదయం మన ఆధీనములో నియంత్రణ కలిగి ఉంటుంది. అందువలన ఉంగరమును ఆ వేలుకు మాత్రమే
ధరింపజేయడం ఆచారముగా కొనసాగుతున్నది.
ముక్కుపుడక ప్రత్యేకత:
కొన్ని
మతాలలో ముక్కుపుడకని వివాహ సందర్భంలో స్త్రీకి ధరింపజేయడం అనే ఆచారము ఉన్నది. ముక్కుపుడకకి
అడ్డు బాస,ముక్కెర, అని నామాంతరాలు ఉన్నాయి. భాషని అడ్డగించడానికి దోహదపడేది కనుక దీనికి
“అడ్డు బాస” అనే పేరు వచ్చింది. మాట్లాడేటపుడు ముక్కుకు రాపిడి జరిగి అడ్డంగా ఉండి
మితంగా మాట్లాడమని హెచ్చరిస్తూ ఉంటుంది. స్త్రీలకి వివాహం తర్వాత ఇంటి బాధ్యతలు వస్తాయి.
ఆ బాధ్యతలలో వచ్చే దోషాలను పోగొట్టడానికి కూడా ఇది సహాయకారిగా వ్యవహరిస్తుంది. ఇది
కూడా బంగారపులోహంతో తయారయినటువంటిదే.అలంకారంగా స్థిరపడిన ముక్కెరను కాబోయే భర్త మాత్రమే బహూకరించడం అనేది ప్రాచీన కాలంనుంచీ
వస్తున్న సాంప్రదాయం.
తాళిబొట్టు మాదిరిగానే
వివాహసమయంలో ధరించిన ముక్కుపుడకను జీవితాంతం కొందరు తీయరు. అది ఉన్నంతకాలం భర్త క్షేమంగా
ఉంటాడన్నది వారి నమ్మకం. అందుకే దీన్ని సౌభాగ్యానికి
సంకేతంగా చెబుతారు. ఎంత పేదవారైనా దీనిని మాత్రం బంగారంతోనే చేయించుకుంటారు. దక్షిణ
భారతదేశంలో దీన్ని ఎక్కువగా కుడివైపు పెడితే, ఉత్తరాదిన మాత్రం ఎడమవైపు పెడుతుంటారు.
ఈ ప్రస్తుతకాలంలో కూడా పెద్ద ముత్యపు ముక్కెరను( నాత్) మరాఠీ మహిళలు చాలా ఇష్టంగా ధరిస్తారు.
కొందరిలో ఇది దాదాపు గడ్డం వరకు వస్తుంది. ఇప్పటికీ కొందరు ఆదివాసులలో పెద్దవైన బులాకీలు
వాడతారు.
కాలిమట్టెలు-ప్రత్యేకత:
స్త్రీకి వివాహము అయిన తరువాత ధరించే
వాటిలో అతి ముఖ్యమయినవిగా కాలి మట్టెల గురించి చెప్పుకోవచ్చు. గర్భకోశములో ఉన్న నరాలకు
కాలి వేళ్ళకు సంబంధము ఉన్నది. స్త్రీత్వము నకు భంగము కలుగ కుండా ఉండాలంటే స్త్రీలు
కాలికి మట్టెలు పెట్టుకోవాలని పురాణాలు చెపుతున్నాయి.
స్త్రీలు
పురుషులకన్నా అధికులు అని చెప్పినట్టి పద్యం.
స్త్రీణాం
ద్విగుణమాహారం బుద్ధిశ్యాపి చతుర్గుణమ్
సాహసం
షడ్గుణం చైవ, కామోష్ట్య గుణి ముచ్యతే.
భావం: పురుషులకంటే స్త్రీలకు ఆహారం రెండు రెట్లు, బుద్ధి నాలుగు రెట్లు, సాహసం
ఆరు రెట్లు, కామం ఎనిమిది రెట్లు ఎక్కువగా ఉంటుంది అని అర్ధం.
కామ,క్రోధములను నియంత్రించడానికి
వీటిని ధరించడం అవసరము అని శాస్త్రాలు చెపుతున్నాయి. వీటిని ధరించడం వలన కాలివేళ్ళ
మధ్య ఒరిపిడి జరిగి కోరికలను నియంత్రించడానికి సహాయపడుతుంది. సన్యాసులు పావుకోళ్ళను
ధరించడంలో పరమార్ధం కూడా కోరికల నియంత్రణ కోసమే. కోరికలను అదుపులో ఉంచే నరము కాలి బొటనవేలుకు
పక్కనున్న రెండవ వేలుకు సంబంధించి ఉంటుంది. ఈ రెండు వేళ్ళకు ఒత్తిడి కల్గడం కోసం సన్యాసులు
పావుకోళ్ళను వేసుకుంటారు. స్త్రీలకు పూర్తిగా కోరికలను నాశనము చెయ్యడం ప్రకృతి విరుద్ధం
కనుక ,పురుషులతో సమానంగా ఉండటం కోసం బొటన వేలు పక్కనున్న వేలుకు వెండి తో చేసిన మట్టెలను
ధరింపజేస్తారు. ఇది కూడా దేహములో ఉష్ణాన్ని తగ్గించడంలో సహాయపడ్తుంది. వీటిని వివాహ
సమయములో కొందరు అత్తగారి చేత పెట్టిస్తే, కొందరు భర్త చేత పెట్టిస్తారు.
అలాగే ఈ చిహ్నాల గొప్పదనము
ధరించిన వారికీ, ధరించని వారికీ మధ్య గల వ్యత్యాసాలు పరిశీలించినపుడు వాటి ఆవశ్యకత
తెలుస్తుంది. ఇవి అలంకారాలు మాత్రమే కాక స్త్రీలలో వచ్చే కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు,ఒత్తిడులను
తగ్గించడంలో, ఉష్ణాన్ని నియంత్రించడంలో సహాయకారిగా పనిచేస్తాయి.
గాజుల ప్రత్యేకత:
రంగు రంగుల గాజులు మనకు అలంకరణ వస్తువులుగా,
ఆభరణాలుగా మాత్రమే తెలుసు. చేతినిండా బంగారు గాజులు ధరించి, వాటిని ఆస్తిగా పరిగణిస్తాం.
పూర్వపు రోజుల్లో భార్య చేతికి ఎన్ని బంగారు గాజులు ఉంటే అంత సంపాదనా పరుడిగా భర్తని
లెక్కకట్టేవారట. అయితే గాజులు ధరించడం అనే ఆచారం ఎందుకు వచ్చిందో తెలుసా? గర్భాశయ నాడులను
ఉద్దీపనం చేయడానికి ఉద్దేశించినవే గాజులు. మహిళలకు మణికట్టుకు ముంజేతికి మధ్య ఉండే
నాడులు గర్భాశయ నాడులతో అనుసంధానమై ఉంటాయి. మణికట్టు నాడులు స్వల్పంగా ఒత్తిడికి లోనవుతుంటే,
గర్భాశయ నాడులు కూడా అందుకు అనుగుణంగా ఉత్తేజితమవుతుంటాయి. దాంతో గర్భాశయం పనితీరు,
కండరాల కదలికలు సవ్యంగా జరుగుతుంటాయి.ఇందుకు తప్పనిసరిగా గాజులనే ధరించాలా? ప్రత్యామ్నాయం
లేదా అంటే... ఉంది. రోజూ కొంతసేపు మణికట్టు-ముంజేతి మధ్య చేత్తో నొక్కుకోవచ్చు. అలాగని
మర్దన చేసినంత ఒత్తిడి పడకూడదు.
అలాగే ఈ వివాహ చిహ్నాలను ధరించడం
అనేది ఈనాడు వచ్చిన సంప్రదాయం కాదు, ప్రాచీన కాలము నాటిది. ఈ ఆచారాలు ధర్మ బద్ధమయినవి,
మానవులకు మేలు చేసేవి కనుకనే కొన్ని వేలయేళ్ళ నాటి సంప్రదాయాలు నేటికీ ఆచరణలో ఉన్నాయి.
అనేక సరిక్రొత్త రూపాలను పొంది స్త్రీల మనస్సులను దోచుకుంటున్నాయి.

















